Monday, 15 April 2013

ఎప్పుడో ఒక సారి ఈ సమస్వరత (tuning) విశ్వానికి మనకు మధ్య ఈ సంగీతం స్వరం కలిసి పోతుంది ఏవిధంగా అంటే 
అకస్మికంగా ఎవరైన బాలుడు సితార్ ను మీటడం వలన రాగం వుత్పన్నం అయి నట్లుగా కలిసిపోతుంది.ఇది ఒక రకంగా accident.
సరిగ్గా జీవనంలో ఎక్కడి నుండి ఆ అనంద కిరణం పడుతుందో ఆద్వారాన్ని పెద్దది చేయడమే ధ్యానం అంటారు
ఓషో

ఓషో పుస్తకం 

 చదవగానే ఇలా అనిపించింది

అది వెన్నెల రాత్రి
అందరు నిద్రపోయినా పోక పోయినా వెన్నెల ఆకాశంనుంచి భూమ్మీదకి జారుతూ
మూలమూల చీకటిపైన వేస్తున్న తెల్లటి చారికల రంగు నాకంట పడింది

తెల్లగా గేటు అంచులులోంచి ప్రవహించీ ముగ్గులో దిదుకున్న రేకుమీద వాలిపోయి
విరిగిన అద్దం ముక్కలా తళుక్కుమంది


నేను ముగ్గు వైపుకి జరగానే చెంపలని సవరించి ముక్కుపుడకలో దాక్కుని
చెమక్కుమని 

అక్కడే వున్నపూల కుండీమొక్కల ఆకులని తడిమి
డాబామెట్లమీద ఆగి పోయింది


వెన్నెల ఆకస్మికంగా ఎదురైన పాట కాదు
నేను చూస్తేనే నాకు కనిపించింది


నేను వున్నా లేక పోయినా అది అలాగే గేటుని ముగ్గుని పలకరించీ డాబామెట్ల మీద ఆగి పోతుంది..
ఆ ధ్యానాన్ని నేను ఈ రోజు అంగీకరించానేమో!

Tuesday, 26 March 2013

//వాడి అడుగుల చప్పుడు//



           


మూసిన తలుపువెనక వాడు వెళ్ళిపోతున్న అడుగుల సవ్వడి వినిపిస్తూనేఉంది
నేను వెళ్ళిపోయాక నువ్వు జాగ్రత్తా అంటాడు
కాని గదిలోపల వాడు ఇంకా ఉన్నాడు
పాటలు పాడుతున్నాడు  ఫియానో వాయిస్తున్నాడు
అమ్మా అకలి ఏమున్నాయి అంటూ బుజాలమీద ఊయలలూగుతున్నాడు

వాడున్నతసేపు వాడిని పెద్దవాడిని చేసేసాను
పోరాడలేని ఘర్షణలు దాపరికంలేని బిడియాలు
ప్రవహించీ ప్రవహించీ
వాడి లేతమనసు  ప్రవాహపు సుడిలో కోట్టుకుపోతున్నా
మాట్లాడుతూనే ఉన్నాను

ఈఏకాంతంలో వాడు శబ్ధమై గదంతా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాడు

చదువుల బరిలోకి దింపేసి వాడు వెళ్లకూడదనుకుంటాను
బయట ప్రపంచంలో వాడు వ్యధ శిలమీదే ఉంటాడు
ప్రేమ కోలనులో వాడు నెలవంకలా తేలుతుంటాడు
తలవంచుకుని అలోచనలని రెప్పల పరదాలలో దాచేసి
నవ్వుతాడు నాఒడిలో తలదాచుకుని


వాడు ఇంకా పరుగులు తీసే లేగదూడ లా అనిపిస్తాడు
లోపలి మాటలని బుజాన మోస్తున్నప్పుడు
స్కూలు పిల్లావాడిలా అనిపిస్తాడు
కాని వాడు మాత్రం  పోడి మేఘాలకి నీరందించే ఆవిరి నవుతానంటాడు

మూసేసిన తలుపు వెనక వాడు వెళ్ళిపోతున్న అడుగులసవ్వడి వినిపిస్తూనేఉంది.

Thursday, 21 March 2013

కొన్ని కబుర్లు కొన్నిసరదాలు



మాఅత్తగారు అమ్మాయి నువ్వీవ్వాళ  మజ్జిగ చిలికి వెన్న తీయ్యాలి అన్నారు  ఉలికి పడ్డాను నేనా ? ప్రశ్నార్ధకంగా మొహం పెట్టి
అవును నువ్వే అన్నారు చిన్నగా నవ్వుతూ పూజ గదిలోకి వెళ్లబోతూ
రాదేమో అన్నాను  నసుగుతూ ,
ఎందుకు రాదు అదేమైనా బ్రహ్మ విద్యా రాకపోవడానికీ అంటూ పూజగదిలోకి వెళ్ళిపోయారు
మీక్కూడా అనిపిస్తోందా మజ్జిక చిలకడానికి ఎందుకింత భయం మరీ చోద్యం కాకపోతేనూ.. అనుకుంటున్నారా
గబగబా మిక్సి దగ్గరకి వెళ్ళీ గిర్రున ఓ తిప్పు తిప్పేయక.....
 అసలు విషాయానికి వస్తున్నాను  నడవ వాకిట్ళో   స్థంబానికి కట్టేసిన పద్దతాడుతో కవ్వం  సిలవరు గిన్నెనిండా మజ్జిగ
మజ్జిగ తోణకకుండా చుట్టుపక్కల చిందకుండా తాడుతో కవ్వాన్ని తిప్పుతూ వెన్న తీయాలి..
తాడు రెండు చేతులతో పట్టుకుని తిప్పుతుంటే  చేతులుకున్న గాజులు గిన్నెలో కవ్వంతోపాటు చిలక పడుతున్న మజ్జిగ
ఒక చక్కటి లయతోకూడిన జుగల్ బందిలా వినిపిస్తుంది చెప్తూవుంటే బావుందికదా
ఆలోచిస్తూ నిలబడ్డాను  ఎలా తిప్పాలీ గిన్నే జరిగి పోతే మజ్జిగా చుట్టుపక్కల చిమ్మితే ?
కోత్త కోడలిగా నాకదో సవాలు
అటుగా వచ్చిన మునెమ్మ  అమ్మాయిగారు ఏంటండీ ఆలోచిస్తున్నారు ముందు ఆతాడు అందుకోండి అంది ముసిముసిగా నవ్వుతూ
దాని నవ్వు చూస్తే ఇంకా ఉక్రోషం వచ్చింది
 ఇంతలో మావారు వచ్చారు ఎలా అన్నను కళ్ళతో ?
హటాత్తుగా నారెండు చేతులు పట్టుకుని  తాడుని రెండు చేతుల్లో పెట్టీ ఇలాగా చెయ్యి అన్నారు తాడుని స్పీడుగా తిప్పుతూ
బెల్ న్స కుదరక కవ్వం గిన్నె అంచులుకి కొట్టుకుని  మజ్జిగా తుళ్ళీ నేల మీద పడిపోయింది
నేను పట్టుతప్పి వెనక్కి ఒరిగిపోయాను
కావిడితొ మంచినీళ్ళు తీసుకోచ్చిన రావుడు, మందారపూలు  అత్తగారి పూజకోసం తీసుకోచ్చిన పక్కంటి సూరమ్మగారు
కట్టువిడుపు బట్టలు ఉతకడానికి తీసుకెళ్లడానికోచ్చిన  సరివి  అందరు నవ్వగానే ఏడుపొచ్చింది
మీవల్లే ఇదంతా జరిగింది అన్నాను కళ్ళనిండా నీళ్ళతో మావారితో..
ఇంతలో మా అత్తగారు పూజ గదిలోంచి వచ్చి నీకో విషయం తెలుసా చిన్నపటినుంచి ఈ పల్లేటూర్లో నే పెరిగాడు మీఆయన
ఒక్కరోజుఈ మజ్జిగ గిన్నెవైపు ఒస్తే ఒట్టు  అరచేతి నిండా నెయ్యి ఒంపుకోవడం.వెన్న ముద్దలు తీసుకుని తనడం తప్పించి
నువ్వంటె పట్నం పిల్లవి  నీకు తెలియదు మరివాడికో  అందుకుని నీపుణ్యమా అని వాడికి మజ్జిగ చిలకడాని కో కవ్వం దానికో రెండు తాళ్ళు ఉంటాయని తెలిసింది గోప్పవిషయమేకదా
రేపటినుంచి ఇద్దరు కలిసి మజ్జిగ తిప్పివెన్నతీయండి అన్నారు
అమ్మా నన్ను ఇలా ఇరికించకు పొరపాటున వచ్చాను మీకోడలికి నేర్పుకుంటావో మానేస్తావో అదినీ ఇస్టం అంటూ తువ్వాలు తీసుకుని
ఏటి స్నానానికి పరిగెట్టారు
నవ్వుతున్న నన్ను చూసి  హమ్మయ్య నువ్వు నవ్వావు అదేచాలు/ చూడు నీకళ్ళు నవ్వు ఏడుపుని నింపుకోన్న ఇంద్రధనస్సులా వున్నాయి అంటూ ప్రాసాదం చేతిలో పెడుతూ చూసావా ఆడవాళ్ళే అన్నిపనులు చెయ్యాలి  పని అనగానే ఎలా పరిగెట్టాడో
అందుకనే మనకి రిటైర్ మెంటులేదు హవుస్ పెన్ షన్  లాంటివికూడా లేవు......
   ”దంచినమ్మకి బొక్కిందేకూలి” అన్నట్లు.. నిజమేకదా ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళు బతకుంటే అన్నేళ్ళు వంటీంటీ గడపలని అలుపు సొలుపు లేకుండా దాటుతుండాలి...

Wednesday, 20 March 2013

కబుర్లు కాకరకాయలు






మా అత్తగారి దగ్గర చుట్టం ఒకాయన ఉండేవాడు
 
ఆయనకి అందరూ సలహాల కాంతరావు అనేవారు ఆనయన జేబులో ఎప్పుడూ సెనక్కాయలు ఎలా ఉంటాయో సలహాలు అంత అందుబాటులో ఉంటాయి పోగడ్తలా అగడ్తలు అనేవాడు

కోరికలు ఎందుకు కోరుక్కు తినడానికా అనేవాడు అందరిని పనికిమాలిన వాళ్ళలా మాట్లాడేవాడు
వాడా వాడికేంరాదు వీడా వీడి దుంపతెగ వీడో మహా తెలివితక్కవ వెధవ అనేవాడు ఇలా కనిపించిన అందరికి పేర్లు పెట్టేవాడు వాడి నోటికి దడిసి అందరూ ఆమడ దూరంలో ఉండేవారు

మాఅత్తగారు ఓ రోజు ఇంటికి పిలిచి చిక్కటి కాఫి పెద్దగ్లాసుడు ఇచ్చీ కాంతరావు ఏమి అనుకోనంటే ఓ మాట చెప్పనా అన్నారు
చెప్పండీ దానికేం భాగ్యం అన్నాడు కాఫి గ్లాసు ఇంకా చేతులో ఉంది కాబట్టీ
మీమ్మల్నంతా మతిలేని మహారాజు అని చెప్పుకుంటూ జాలి పడుతున్నారండి అన్నారు మా అత్తగారు


ఒక్క సారిగా ఉలిక్కి పడ్డాడు కాంతారావు ఎప్పుడూ అందర్ని ఏదోఒకటి అనడమే తప్పించీ తనని కూడా ఇంకోళ్ళు అంటారని తెలియక బిత్తరపోయాడు నాకా మతిలేదా? ఏమిటండీ ఈ అన్యాయం


నిక్షేపంలాంటి మనిషిని పట్టుకుని అంతమాట అంటారా? అంటూ అగ్గిమీద గుగ్గిలంలా అయిపోయాడు ఎర్రగా కందగడ్డలా మొహంపేట్టుకుని ఠక్కున కఫీ గ్లాసు కిందపెడుతూ చెప్పండీ ఎవరన్నరో కడిగేస్తాను వెధవల్ని అన్నాడు కోపంతో ఊగిపోతూ
ఎవరంటే ఏం చెప్తాము కాంతరావు నువ్వేప్పూడూ అందరిని అంటుంటావుకదా వాళల్లో ఎవరైనాకావచ్చుకదా అటుగా వచ్చిన కంబారితో గ్లాసు తోమడానికి వెయ్యారా రావుడు అన్నారు నిదానంగా


విసవిసా అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయిన కాంతారావుని చూస్తుంటే
నాకు నవ్వోచ్చింది అనండం ఎంత తేలికో మాట పడడం అంతకన్నా కస్టం....


Monday, 25 February 2013

//నిద్రపోతున్న శవం// 25-2-2013



     
ప్లాస్టిక్ సంచి చెత్తతోపాటు చెత్తకుండిలో విసురుగా వచ్చిపడింది
నిద్ర పోతున్న శవంకూడా అక్కడే దోర్లుతోంది
మత్తుని నీళ్ళతోకలుపుకున్న  శవంకోసం ఎదురుచూసేవాళ్లు చూస్తూవుంటారు

వాడు కోడుకు కావచ్చు భర్తకావచ్చు తోబుట్టువు కావచ్చు
ఎవరైనా వాడు నిద్రపోతున్నశవం

గేటుకి గదిలో గడియారానికి అతుక్కుపోయిన కళ్లు
అవమానాలని అస్సహా యతని ప్రశ్నించే కళ్లకోసం
మత్తుతో మూసుకుపోయే రెప్పలని తెరవడాని ప్రయత్నిస్తూ తూలుతూ
గేటుకి వేళ్ళాడే మనిషికోసం ఎదురుచూపు

పడకగదిలో పిల్లలు నిద్రనటిస్తారు
అమ్మనాన్నా లు అరుస్తుంటే జతువుల్లా పోట్లాడుకుంటుంటే
అమ్మ దు;ఖం తలుపుల ఖాళీలని తోసుకుని వినిపిస్తుంది
ఏడుపు తీగలు వేసుకుంటున్న మొక్కలా పాకుతూ గదిని అల్లుకుని
నిద్ర అంటె భయం వేసేలాచేస్తుంది
నాన్న ఇంకా రాలేదు
గదిలో ఫేను తిరుగుతోంది మెల్లగా
నిద్రఒడిలోకి జారుకుంటున్నా భయమే
ఎక్కడ అమ్మగోంతులోంచి వూడిపడ్డ శోకం తీగలా అలుకుంటుందోనని



పక్కలు చాలని పాక
అయ్య అనబడే రాక్షసుడు రాలేదు
రాకపోయినా బాగుండేది ఆరాత్రి నిద్రని గడుపుకుంటుంది
తడికన తోసే చేతులు దెయ్యానికి ప్రతిరూపం దాలుస్తాయి
బూతులు వే్ట కత్తులా మనిషి మీద విరుచుకుపడతాయి
అమ్మ శరీరం శక్తిని కోల్పోతుంది
సారా మత్తు హరించిన మగతనం  కళ్ళుతెరచి ఆమె డొక్కలోపొడిచి
శరిరంతో ఆడుకుంటుంది
ఆరాక్షసుడి పాదముద్రలు పాకలో పిల్లల గుండెలొ తెగువని చూపిస్తాయి
చావుకోసం ఎదుచూసేలా చేస్తాయి

అమ్మ తనని దోషి చేసుకుంటుంది
బీటలు వారిన కాలన్ని మూయాలని మట్టి పూతలుపూస్తూ
తాగుడు మానేసిన కోడుకునవ్వుని కలకంటూ
గేటు దగ్గర నిలబడుతుంది
చెదిరిన జుట్టు నలిగిన ముఖాన్ని తడమడంకోసం
మానేయరా కన్నా ఈ  అలవాటుని
మళ్ళీ మళ్ళీ చెప్పడంకోసం
ఒడిలో జారుతున్న కోడుకు నిద్రపోతున్న శరీరాన్ని తడమడం కోసం
గేటుకి కళ్ళని వప్పచెప్పి  అలికిడికి కోసం ఎదురు చూస్తూనే వుంటుంది


అక్కడ శవం మాత్రం నిద్రపోతోంది
కుక్కలు చుట్టుముట్టినా
జేబులు తడిమి ఎర్ర ఏగాని లేని శవాన్ని కాళ్లతో తన్నినా
శవం నిద్రపోతూనే వుంది
ఎదురు చూసేవాళ్ళకళ్ళని తప్పించుకుని
                                               
(నడి రోడ్డుమీద చెత్తకుండి పక్కన ఒంటిమీద సృహలేకుండా తాగిపడివున్న ఎవరిని చూసినా అలోచనలు ఇలా దొలుస్తాయి)




Sunday, 24 February 2013

అమ్మని అడుగుతున్నాను//



నేను అడుగుతున్నాను నేను ఏం చేసానని
నాకొడుకుని పోద్దున్నే కాలేజికి పంపించాను
వాడు చదువుకుని నాకు ఆసరా అవుతాడని

నా నాన్న బందువు ఇంట్లో పెళ్లికని వెళ్ళాడు
ఎదురు చూస్తున్నాను వస్తే పెళ్లి కబుర్లు చెప్తాడని
మా అక్క పిల్లని చంకనేసుకుని ఇంటికి పోదామని బస్టాండులో నిలబడింది
అక్క కోసం ఎదురు చూసే మేమంతా నీ కేం అపకారం చేసాము

నాకోడుకు మాంసం ముద్దలా మార్చురీలొ వున్నాడు
అక్క కాలుకి గాయంతో పిల్లని ఓదార్చుకుంటూ ఏడుస్తోంది
మానాన్న తిరిగిరాని లోకాలకి చేరుకుంటే అమ్మని ఓదార్చగలనా

నువ్వేరో తేలీదు మతం అంటున్నారు ఉగ్రవాదం అంటున్నారు
నగరం గోడలనిండా గుర్రండేక్కల నాచులా చుట్టుకున్నావు
నా నగరం ఇప్పటికే యువరక్తాలతో మరణ చరిత్రలు రాసుకుంటోంది
గర్భ శోకాలతో పమిటచెంగు తడీ ఆరటం లేదు
కోడుకు చనిపోతే కోడుకా బలి అయినావురా అంటూ ఏడ్చాను
న్నాన్న అక్క అన్న తమ్ముడు ఇందర్ని పోగోట్టుకున్నానే
నా కంటి తడీ ఆరుతుందా?

నేను మాత్రం అమ్మని అందర్ని పోగొట్టుకున్న అనాధని
ఎవరేవరో వస్తారు ఓదారుస్తారు అయ్యా అడుగుతున్నాను
నన్ను నాకుటుంబాన్ని చంపడమెందుకు ఓ దార్చడమెందుకు
నన్నూ చంపేయండి ఇంక రక్తాలని తెగిన తలల్ని ఈ ఒడి మొయ్యలేదు
అమ్మని చంపేస్తే కుటుంబం ఎక్కడ ఆడపిల్ల మొగపిల్ల మతము భాష
ఏవి ఉండవు

ఆలోచించండీ అమ్మని చంపేయండి..

Wednesday, 23 January 2013

అక్షరాలకు ఆయువు పోసిన లోపలి స్వరం

సారస్వతం 
పుస్తక పరిచయం - 1

- సమీక్షకులు ; శైలజామిత్ర

కవిత్వానికి గుండె ఒక నివాసం . తలుపు తీసినప్పుడల్లా ఒక్కో తలపు మనల్ని పలకరిస్తూ బయటకు వెళ్ళిపోయి కవి అయితే అక్షరంగా,, కాకుంటే ఒక జ్ఞాపకంగా రూపు దాల్చుతుంది.. , కలలు కూడా మనలోని భావాలే అని తెలుసుకునేది ఒక్క కవి మాత్రమే అనే మాటకు కవిత్వమే సాక్ష్యం. కవిత్వం లో ఎప్పుడు అభూత కల్పనలు ఉండవు కేవలం అనుభూతులు తప్ప. తపస్సు చేసుకునే రుషి భావుకుడు కాలేడు. ఆ తపస్సును గమనించే వ్యక్తి మాత్రం తప్పకుండా కవిగా మిగిలిపోతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కవిత్వం పూజ కాదు. నైవేద్యం. కవిత్వంలో ఎన్ని అలలు ఉన్నా జడి మాత్రం ఉండదు. అంతా నిశ్శబ్దం ...

రేణుక అయోల కవిత్వానికి ఒక ముద్ర ఉంది. మానవీయ స్పర్శ ఉంది. వీటన్నిటితో పాటు ఏదో కోల్పోయాననే ఆవేదన ఉంది. గుండెలో తడి ఉంది. ఉదాహరణకు కాలం ఎపుడు కధ చెబుతుంది అనే వస్తువును తీసుకొని నా పేరు కాలం అనే కవిత రాసారు. "నువ్వు నన్ను తెలుసుకోవాలంటే /యుగాలతో సంభాషణ జరపాలి/మృదువైన పిల్ల గాలిని అడగాలి" అంటారు. ఎంత బరువైన భావం ? మొదటిది యుగాన్ని మరొకటి పిల్లగాలిని రెంటినీ సమాన స్వరంలో మనకు చూపారు. ఇక్కడ యుగం అనేది గతం. పిల్లగాలి అనేది వాస్తవం, ప్రస్తుతం. అంటే మనిషిని గురించి, కాలాన్ని గురించి విపులంగా తేలపాలంటే రెండు వాస్తవాలను అడిగి తెలుసుకోవాలి అంటారు.

కాలాన్ని అంచనా వేయడం అంత సులభం కాదంటారు.

అడవిని అంచనా వేయడం చాలా ప్రయాసతో కూడిన పని అంటాను. ఎందుకంటే అడవి విశాలం, ఏ మూలా ఏముందో తెలుసుకోవడం, ఎలా వెళితే బయటకు వస్తామో తెలుసుకోవడం అనేది చాల కష్టం. ఒక్కసారి అన్నీ కని పెట్టగలిగామంటే ఇక అదే స్వర్గం అవుతుంది. అలాంటిది అడవిలో ఒక రాత్రిని గురించి తెలిపే అరుదైన ప్రయత్నం చేసారు. ఈ వాక్యాలు గమనించండి ఆ రాత్రి/ అడవిని చుట్టుకున్న వెన్నెల దీపం/చీకటిని మింగిన చందమామ/అడవిలో నడుస్తున్న నన్ను పెనవేసుకున్నాయి// రహస్యాలను చేదించాలని ఉద్వేగం/ కొమ్మ కొమ్మను పలకరించాలనే తపన/చల్లటి స్పర్శతో ఆత్రుతగా నడిచే నడకలు/పచ్చటి చీకటి నీడల్ని చీల్చే / వెన్నెల పాయలు/ గడ్డి పొదలు/గుండెను గుబులు పట్టించే కూతలు.. అంటారు . ఎంత అద్భుతం? ఈ వాక్యాలు చదువుతుంటే మనం అక్కడే ఉన్నామేమో అనే భావన కలిగించక మానదు.

కవిత్వం అనేది ఒక చిత్రమా? లేక శిల్పమా ? అనే సంశయం వస్తే ఖచ్చితంగా చిత్రమే అంటారు రేణుక అయోల గారు. అందుకే వీరి ప్రతి కవితలో ఒక అద్బుతమయిన భావ చిత్రం కనిపిస్తుంది.. అలాగే వీరి కవిత్వం చదవరులను కట్టి పడేస్తుంది.. హృదయం అనేది ఒక సముద్రం. అందులో ఎన్నో అలజడులు, ప్రశ్నలు, సందేహాలతో పాటు సమాధానాలు కూడా ఉంటాయి. కాని మనం ఒక్క సమాధానాన్ని మాత్రం వదిలి పెట్టి మిగిలిన వాటిపైనే దృష్టిని కేంద్రీకరిస్తాము. కాని ఈ కవయిత్రి సమాధానం వైపు కూడా దృష్టిని పెట్టారు.. చూడండి చిన్న విత్తు / తనకు తానే భుమిలోకి ఒదిగి /కాలానికి నమస్కరిస్తూ లేత చిగుళ్ళతో/గున గున ఎదిగి పలకరిస్తుంది". అంటూ చివరిలో అంటారు "చెట్టు మొదలును తడుముతుంటే / గిలిగింతలు పెడుతూ/ చిన్నారి మొలక/ గుండె గుడిలో వెచ్చదనపు పండగ అంటారు. రోడ్డు వెడల్పులో కనుమరుగవుతున్న చెట్లను చూస్తూ చలించి రాసిన ఈ భావాలలో నువ్వెంతగా నరికినా నువ్వు నువ్వు పాతిన చోటే మళ్లీ మొక్కై నిలవక మానదు. చెట్టు స్వభావం మొలకెత్తడం అనే విషయాన్ని ఎంతో అందంగా తెలియజేసారు.

ఇక్కడో విషయం మనం గమనించాలి. వీరి కవిత్వం లో సునిశితత్వం దాగుంది. సున్నితంగా గుండెను స్పృశించే గుణం ఉంది. గొంతును తీయగా పలికితే పరుష వ్యాఖ్యలు కూడా పరమానందం కురిపిస్తాయి. భావనలో ఎలా ఉన్నా పరుషంగా తోటి మనుషులను ఓదార్చినా సరే పారిపోయేలా చేస్తాయి. అందుకే మాట మంత్రం అంటారు. రేణుక గారు తన మృదువైన స్వరంతో ప్రకృతిని ఎంత ఆదరించారో చూడండి చినుకుల తెరలో/ తడిసిన మనసు శరీరం/ లేడి పిల్లలా గంతులు వేసింది. తడుస్తున్న పులా కొమ్మల్లో నేను / పువ్వునై తడుస్తుంటాను// ఎండా వానా కలబోసినా సాయంత్రం/ మబ్బుల్లో తల దాచుకున్న సూర్యబింబం/చినుకు తడిలో భూమిని అల్లుకున్న సుగంధ శ్వాస /ఆవిరి అవుతున్న వేడి ఇలా సాగుతుంది వీరి ధోరణి. కవి ప్రకృతికి దాసుడు అనే వాఖ్యానికి రేణుక గారి కవిత్వం ఒక గొప్ప ఉదాహరణ.

కలమనేది కాలంతో పాటు కదులుతుంది. జీవితంలో ఎన్నో సంఘటనలు మనల్ని హత్తుకుని నిరంతరం జ్ఞాపకానికి వస్తుంటాయి. అలంటి కవితలే నీటి బొమ్మ, మరణమే చరిత్ర, కొత్త ఉదయం పుట్టుక, ఊరి ప్రయాణం, పల్లకీలో పెళ్ళికూతురు కవితలు. ప్రతి కవితలో ఆర్ద్రత ఉంది. మానవత్వం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా పరిశీలన ఉంది. కవికి పరిశీలనా ఎంత అవసరమో అంతా రేణుక గారిలో ఉంది అనడం అతిశయోక్తి కాదు.

ఇవన్నీ ఒక ఎత్తైతే. ఈ గ్రంధం చివరిలో ఒక పది వాక్య కవితలు ఉన్నాయి. వాటిలో కొత్తదనాన్ని మనం గమనిద్దాం. ఏ కవితైనా, చిన్నదైన, పెద్దదైనా, వాక్యమైనా, వాటిలో వస్తువుతో ఒడంబడిక ఉండాలి. అంటే వాక్యానికి, వాక్యానికి మధ్య సంవిధానం తప్పనిసరి. ముఖ్యంగా వాక్య కవితలకు చాల అవసరం. ఆ విషయం ఈ కవయిత్రికి తెలుసు. తెలుసు కనుకనే ఈ ప్రయోగానికి ప్రాణం పోశారు. ఉదాహరణగా ఈ వాక్యాలు గమనించండి. ఊడ్చి వెళ్ళిన రోడ్డు మీద పరుచుకున్న బొమ్మ కుంచెలు రంగులు లేని చిత్రం నేలనంతా కళాత్మకంగా మార్చేసింది. ఈ వాక్యం లో ఎంత భావన దాగుందో అందరికి తెలుసు. కళను ఎవరు ప్రదర్శించినా అది కళే అనే మాట ఇందులో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆ కవిత అనుసరణ చూడండి. మధ్యాహ్నం ఎండలో మిల మిలా మెరుస్తూ పాదాల కింద పడిపోకుండా ఆ బొమ్మ తనని తాను రక్షించుకుంటూ దేవుడి రూపంలో చిత్రకారుడి ఆకలి రంగు తెలియనీకుండా తెల్లగా మెరుస్తూ, నిశ్సబ్దంగా చిల్లర నాణాలు మోస్తూ, వాడి గుండె తడిలో ఒదిగి తనలో తాను నవ్వుకుంటూ, నేలను నమ్ముకున్న చిత్రం లోపల ఎన్ని మెలికలు తిరిగినా, ఆకలి చూపులు రాకుండా అచ్చం గుళ్ళో దేవుడిలా గంభీరంగా ఉండిపోతుంది. ఈ ప్రక్రియ ఎంతో విలక్షణంగా ఉంది.. చదువుతున్నంత సేపు టాగూర్ గీతాంజలి, తిలక్ అమృతం కురిసిన రాత్రి గ్రంధాలు గుర్తుకు వచ్చాయి.

రేణుక అయోల ఒక నిర్దిష్టమయిన భావాలు ఉన్న కవయిత్రి. పదాల పొందిక, భావాల అల్లిక లో తనకు తానే సాటి అనిపించు కున్నారు. కవిత్వం ఎలా ఉండాలో అనే ఆలోచన కలిగితే ఒక్కసారి వీరి కవితలను తరచి చూస్తే చాలునేమో అనిపించక మానదు. వీరి భావాలు మరింత సుగమమై, మరింత సోయగమై మరో గ్రంధం రావాలని అభిలషిస్తూ అభినందనలు.

ప్రతులకు :

పాలపిట్ట బుక్స్
16-1-20//1/1,
403,విజయశ్రీ రెసిడెన్సి ,
సలీం నగర్, మలక్ పెట్, హైదరాబాద్.-36

ఫోన్ : 040-2778430
వెల: 60 రూపా