Tuesday 25 October 2011

లోపలి కల


 
 

 

(కలలు కనని మనిషి వుండడు.కఠినమైన నిజంకన్నా అబద్దంలాంటి కల హాయికదా! కలలునే కళ్ళ వెనక అంతులేని ప్రపంచం దాగివుంది .ఏదిఏమైనా ప్రతీ మనిషి కలకనడం చాలా సహజం..అలాంటి కలవెంట ఒక ప్రయాణం-)
 
 
 
నిద్రని ముక్కలు చేస్తున్న స్వప్నం              
మెదడుని కాపలా కాస్తున్నకుక్క
బొట్టుబిళ్ళని రెండుగా విరిచి
నవ్వుతున్న ముఖంలాంటి పొగ

నల్లని మేఘం నీటిలో
పాయలు పాయలుగా విడిపోయి
వాటి అంచుల్లో చిక్కుకున్న మంచు ముత్యాలు
జడని చుట్టుకొన్న మందార పూలు

నల్లకనుల నాగస్వరం ఊది చూడు అంటున్నారు ఎవరో--
నీటీ అంచుల్లో తేలుతు ఒడ్డుని తాకుతూ
రాగాలు పలుకుతున్న నల్లకనుల మురళి
చుట్టూ చీకటి ఇసుకలొ కూరుకుపోతున్న పాట!
రాగాలను వినిపిస్తూ చుట్టు తిరుగుతోంది
గానం గొంతులో వెచ్చటినెత్తురు బొట్లుబొట్లుగా--

ఏదో బలమైన హస్తం
చేతికి ఆసరా ఇస్తూ స్వరం వెంట లాక్కెళుతోంది
కాలి వెండి పట్టాలు బంధాలు తెంచుకొని
పాదంలోంచి జారిపోయాయి-
మువ్వల అంచుని తాకిన చేయిలొ చిరు గజ్జల సవ్వడీ
వేళ్ళు తాకిన స్పర్సలలో వేదన

పాట మళ్ళీ వచ్చి లోపల వాలింది
కొండని చుట్టుకొని లోయలోకి ఒదుగుతున్న
పాట వెంట -అప్పటికప్పుడు పూచిన పూలు
సీతాకోక చిలుకలై ఎగురుతూ దేహాన్ని చుట్టుకొని
లోలోపలికి ప్రవేసిస్తూ కలలని కదుపుతూ
మెలకువలోకి ప్రవేసించాయి.

నిద్ర రెప్పలని విప్పి వెలుతురిని చూపించినా
కొత్త లోకం విడిచి రాలేని శరీరం
కలల పుప్పోడీ అద్దుకొని బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటోంది.
 
*** 

Friday 14 October 2011

నల్లని చేపలు

 

నేత్ర సముద్రంలో నల్లటి చేపలు
కబుర్లాడుతూ అగాధాలు వెదుకుతూ
గిరగిరా తిరుగుతుంటాయ
కెమేరాకందని జీవితం
కాగితాలకందని అనుభవం
తళుకు బెళుకులతో
కవ్వీంచి కధలు చెప్పే కాటుక చేపలు
దాచుకునే వన్నీ

అద్భుత చిత్రాలు

వెతికే కోద్దీ

కనుల సముద్రం అంతుచిక్కని
"డిస్కవరీ చానల్"
అట్ట అడుగున ఆకుపచ్చని పర్వతాలు
శిలతో చెక్కిన శిల్పాలు
ఏళ్ళుగా కూరుకుపోయిన గతాలు
అగ్నిపర్వతాలు,బాల్యపు రంగురంగుల గాజులు

అప్పుడప్పుడు-
ఋతుపవనాలు సందడిలో
కరిగిన మబ్బులు ముత్యాల గుంపులై
నేలకు జారే వానజల్లులా జారిపడతాయి
నల్లని చేపలు నీటి తడిలో
విలవిలలాడుతాయి

కరిగిపొతున్న కలలు
కలల మధ్యలొ దాచుకొన్న గతం

నీటి తడిలో ఒదిగిన ఓదార్పు-

గుండె బరువు దిగగానే
అలజడి ఆగిన నేత్ర సముద్రంలో
నల్లని చేపలు మేరుపులు అద్దుకొని
కలలుకంటూ ఈదుతూనే వుంటాయి

Sunday 9 October 2011

నీలి వుత్తరం

నువ్వు రాసిన వుత్తరం జారి పడింది
జ్ఞాపకంఊపిరి పోసుకొని జీవించింది 
కళ్ళుఅక్షరాలతో కలసి  ప్రయాణం చేసాయి-
అప్పటి గతాలు ఎన్నో ఏళ్ళ తరువాత
నాముందు నిల్చుంటే ఈ నీలి ఊత్తరంలో దాస్తున్నాను
నువ్వు నాకళ్ళముందు నిలబడితే చూస్తున్నాను
శరీరాన్ని కుదలించుకుని ఎగిసిపడే నీనవ్వు
నాలోనే నింపుకోవాలన్నంత ఉద్వేగం
తామర పూలన్నీ దండకట్టీ మెడలో వెయ్యాలని
పూలకిరీటాలతో రాణీలా నా ఎదమీద నిద్రించిన క్షణాలాని
చూస్తూన్నాను
కలలా జారిపోతావేమో
నాచేతులలో నీగోరింట పూల చేతులు
నాకళ్ళలొ నీ ప్రతిబింబం
నీటి పొరల కదలికలలో ఒక్క క్షణం జరిగిందేమో
రెప్పమూసి దాచుకున్నాను
.
ఎంత దూరంలో వున్నా నీ పరిచయ సుగంధము
నిశ్శబ్దంలో రాతి బొమ్మలా నిల్చోపెట్టింది
నీసంకేతాలు నాగుండెకు చేరుకుంటున్నాయి
 
నీతో నానడక దూరాలని తగ్గిస్తోంది
తరిగి పోతున్న దూరంలో
ఇద్దరి మధ్య ప్రతి క్షణం కదిలేకదలికలు
పదిలంగానే వుంచాను
నిన్ను మళ్ళీ మళ్ళీ చుసుకోవాలని
.
 
ఉత్తరం వేళ్ళమధ్య కాదు
గుండేలొ ఒదిగిపొయి
నీవులేవన్న దిగులు చీకట్లని దూరంచేసే
పల్చటి పట్టుదారాలాంటీ అనుభూతితో
బంధించి బంధించి కట్టిపడేస్తుంది
 
 
 
 
\