Tuesday 3 January 2012

వాడితో నా ప్రయాణం

 
బుజంమీద ముడితో జోలెలా అనిపించే
మెత్తటి చీరముక్క ఊయలని-
ఆమె జోలె అంటుంది
నేను వాడిని మోస్తూ నాలోకి ఒదగనిస్తూ
వాడి అనుభావాలకి మూగ  పల్లకీనవుతాను

పొద్దునే నాలోకి జారుకుంటాడు లేతభానుడిలా
                 ,అక్కడనూంచి మాఇద్దరి ప్రయాణం.

నిద్రవీడని లేతకళ్ళు వాహనాల రోదకి ఉలికిపడతాయి
వాలిపోతున్న మెడకి ఆసరాగా చేతులు కానిచేతులు
నాచీర అంచులతొ అడ్డుకుంటాను..

అకొసనూంచీ ఈ కొసకి పరుగులు  పెట్టే తల్లినిచూస్తూ నవ్వుతాడు
వాడి లేతచిరునవ్వు నాకే వినిపిస్తుంది
వాడి ఊసులని వింటాను, ఏడుపుకి భయపడతాను.

అమ్మ ముఖంకోసం తలఎత్తీ చూడలనుకుంటాడు
ఎండ చుర్రుమని రెప్పలని వాల్చేస్తుంది.
ఎవరెవరో కనిపిస్తారు,వాళ్ళనే చూసి నవ్వుతాడు

వెలుతురు కొమ్మమీద వాలిన చీకటి 
వాడిని అమ్మఒడిలోకి చేర్చింది-
నన్ను దులిపి పక్కగాచేసి వాడిని పడుక్కోపెట్టగానే
మెత్తటి తివాచినవనందుకు నన్ను నేను తిట్టుకుంటాను
కనీసం మెత్తటి దుప్పటి నవుదామని నన్నునేను కుదించుకుని
వాడిని హత్తుకుంటాను.

బోర్లాపడతాడు నన్ను దగ్గరగాతీసుకుని
చేతి వేళ్ళతో లాగుతూ గుర్తుపట్టడాని ప్రయత్నిస్తాడు
ఆటలన్నీ కొద్ది క్షాణాలే..
మళ్ళీ అమ్మకోసం ఏడుస్తాడు

వస్తుంది విసుగుతో కసురుకుంటూ
”క్రిష్ణుడ్ని చెట్టుకి కట్టేసినట్లే ''మమ్మల్ని కొమ్మకి
తగిలించేసి వెళ్ళిపోతుంది.

ఊయలగా నేను జోరుగా ఊగి-
వాడి దుఖాఃన్ని చెరిపే కొమ్మమీద పిట్టకోసం ఎదురు చూస్తాను
వాడి కావలసింది అమ్మ.
అమ్మకి కావాలి ఆకలితీర్చే ఆదాయం.
జీవితం   ట్ర్రాఫిక్ సిగ్న్ ల్ దగ్గర ఆగి పోయింది

వాడి కలలరెప్పలమీద నవ్వు అంచుల్లో నేను తోడుగా మిగిలిపోయాను
అనుక్షణం అమ్మకి దగ్గరగావుంటూ
అమ్మని తీరిగ్గాచూడలేనంతదూరంగా వున్న వాడి
అనుభావాన్ని వింటూండగానే  తూరుపు రేఖలు విచ్చుకున్నాయి....















1 comment:

  1. amma ku kaavaali akali thirche adhaayam---nice poem renuka garu--buchi reddy

    ReplyDelete