Monday, 5 January 2026
రవిక ( the dress sense of a women)
సంప్రదాయం నిరంతర ప్రవాహం. సంప్రదాయాన్ని విడిచి పెడితే సమాజానికి పురోగతి లేదు. సంప్రదాయానికి మరొక అంచు ఆధునికత. ఆధునికత అనేది కాలానికి సంబంధించిన అంశం కాదు. అది స్వభావ సంబంధమైనది. సమకాలికులంతా ఆధునికులు కారు."
___టి.ఎస్.విలియట్
నేను ఇటీవల చదివిన ' రవిక ' అనే కవిత్వ సంపుటి నాకు పై వాక్యాలను గుర్తు చేసింది. సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య నలిగిన కవిత్వమే రవిక.
పందొమ్మిదవ శతాబ్దపు కేరళ సమాజంలో 'చాన్నార్ లహల' ఒక చారిత్రక మైలురాయి. కేవలం తమ శరీరాన్ని కప్పుకునే కనీస హక్కు కోసం, ఆత్మగౌరవం కోసం నాడు స్త్రీలు చేసిన ఆ పోరాటం నేటి ఆధునిక వస్త్రధారణ స్వేచ్ఛకు పునాది అని చెప్పవచ్చు. నాడు "హక్కు" (Right) కోసం మొదలైన ఆ ప్రయాణం, నేడు "ఇష్టం" (Choice) అనే మలుపు వద్ద నిలిచింది.
శరీరాన్ని కప్పుకోవడం అనేది నాడు ఒక సామాజిక విప్లవం అయితే, నేడు అదే శరీరాన్ని తమకు నచ్చిన రీతిలో ప్రదర్శించడం లేదా అలంకరించుకోవడం అనేది వ్యక్తిగత స్వేచ్ఛగా రూపాంతరం చెందింది. ఈ మార్పు వెనుక ఒక తరం నుండి మరో తరానికి జరిగిన భావజాల వలస కనిపిస్తుంది. మనిషి ఒక భావం నుండి మరొక భావంలోకి వలస వెళ్లడం అనేది కేవలం భౌతికమైన మార్పు కాదు, అది ఆత్మావిష్కరణలో ఒక భాగం. సంప్రదాయం అనేది ఒక అవిచ్ఛిన్న ధారగా తనను తాను నిలుపుకోవడానికి కారణం అందులో ఉండే సామూహిక మూలాలు. కానీ ఆధునికత అనేది ఎప్పటికప్పుడు పాతపడిపోతూ, కొత్త రూపాన్ని సంతరించుకోవడానికి కారణం అది వర్తమానంతో పోటీ పడుతూ, నిరంతరం అన్వేషణలో ఉండటమే.
సాధారణంగా పాత కొత్తల మధ్య సంఘర్షణ తలెత్తినప్పుడు అది ఘర్షణగా మారుతుంది. పాత తరం తమ విలువలను రక్షణగా భావిస్తే, కొత్త తరం ఆ విలువలను బంధనాలుగా చూస్తుంది. చాన్నార్ లహల నాటి స్త్రీలు కోరుకున్నది 'గౌరవం', నేటి తరం కోరుకుంటున్నది 'స్వేచ్ఛ'. నిజానికి గౌరవం లేని చోట స్వేచ్ఛ ఉండదు, స్వేచ్ఛ లేని చోట గౌరవానికి అర్థం లేదు. ఇవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు. ఒకనాడు గుడ్డ ముక్క కోసం పోరాడిన చేతులే, నేడు తమకు నచ్చిన దుస్తులను ఎంచుకునే స్థాయికి ఎదిగాయంటే అది సామాజిక చైతన్యానికి నిదర్శనం.
వస్త్రధారణ అనేది కేవలం శరీరాన్ని కప్పి ఉంచే సాధనం మాత్రమే కాదు, అది ఒక వ్యక్తి తనను తాను ప్రపంచానికి ఎలా పరిచయం
చేసుకోవాలనుకుంటున్నాడో తెలిపే సంకేతం. సంప్రదాయం మనకు ఒక అస్తిత్వాన్ని ఇస్తే, ఆధునికత మనకు ఒక వ్యక్తిత్వాన్ని ఇస్తుంది. ఈ రెండింటి మధ్య సమతుల్యత దెబ్బతిన్నప్పుడే ఘర్షణ పుడుతుంది.
కాబట్టి, నిన్నటి 'హక్కు' నేటి 'ఇష్టం'గా మారిన ఈ ప్రయాణాన్ని ఒక వికాసంగా చూడాలి. సమాజం విధించిన ఆంక్షల నుండి విముక్తి పొందడం ఒక ఎత్తు అయితే, ఆ విముక్తిని బాధ్యతాయుతమైన స్వేచ్ఛగా మలుచుకోవడం మరొక ఎత్తు. ఆనాడు చాన్నార్ లహల ద్వారా సామాజిక గౌరవాన్ని సాధించుకున్న స్త్రీకి, నేడు తన ఇష్టానుసారం జీవిస్తున్న స్త్రీకి మధ్య ఉన్న వారధి 'ఆత్మగౌరవం' మాత్రమే. అది ఏ కాలంలోనైనా, ఏ వస్త్రధారణలోనైనా మారదు. దానిని నిలుపుకోవలసిన బాధ్యత స్త్రీదే.
ఈ ఘర్షణ రేణుకా అయోలా కవిత్వం లో నాకు కనిపించింది.
ఆమెకి..
తన రవిక లేని భుజాలు నచ్చలేదు
ఎద చుట్టూతా కప్పుకున్న చీర కొంగు ఒసలగానే
కొన్ని జతల కళ్ళు అక్కడే తచ్చాడటం నచ్చలేదు
నచ్చని నగ్నత్వం కింద మనసు శరీరం నలిగిపోవడం
ఆమెని వెంటాడే మనసు పోరాటం
ఇవీ రవిక లోని ప్రారంభ వాక్యాలు. అప్పటి కాలంలో బ్రాహ్మణ కుటుంబాలలో ఆచారాల పేరిట వితంతువులని రవిక తొడగనివ్వని సంప్రదాయాన్ని ఎదిరించి రవిక ను వేసుకున్న ఆమె సంఘర్షణ ఈ కవిత లో మనకి కనిపిస్తుంది.
నిజానికి బ్రాహ్మణ లలో వితంతువులు మాత్రమే అనుభవించిన ఈ బాధ,వేదన, రవిక లేని తనం ఇతర కులాలలో సాధారణ మహిళలు కూడా అనుభవించారు. 19 వ శతాబ్దంలో ముఖ్యంగా కేరళ, ట్రావెంకూర్ లాంటి ప్రాంతాల్లో స్త్రీలకి రవిక నిషిద్ధం. ఆ ప్రాంతాలలో బ్రాహ్మణ స్త్రీలు రవిక ధరించవచ్చు. నాయర్ స్త్రీలు అంటే క్షత్రియ స్త్రీలు కూడా రవిక ధరించవచ్చు. కానీ వారికి బ్రాహ్మణులు లేదా రాజవంశీయులు ఎవరైనా ఎదురైతే మాత్రం గౌరవ సూచకంగా రవిక తొలగించాలి.
మరీ దిగువ కులాలుగా పిలువబడే లాడార్, ఈజవ వంటి వారికి ఎప్పటికీ రవిక నిషిద్ధం. ఒక వేళ వారు రవిక ధరిస్తే పన్ను చెల్లించాలి. ఈ పరిస్తితులలో 1813_59 మధ్య కాలంలో అనేక ఉద్యమాలు చెలరేగాయి. ఫలితంగా వారికి రవిక ధరించడానికి అనుమతి లభించింది.
ఈ ఉద్యమాలు జరుగుతున్న క్రమంలో స్త్రీలు అనేక రకాల బాధలు అనుభవించారు. గ్రామాలలో,బహిరంగ ప్రదేశాలలో మహిళల వస్త్రాలు చించేయటం, రవిక ధరించిన వారిని చెట్లకు వేలాడదీయటం వంటి బాధాకరమైన శిక్ష లు స్త్రీలు అనుభవించారు.ఇవే కాదు ఇంకా అనేక రకాల బాధలు ఎన్నో స్త్రీలు ఆ రోజుల్లో అనుభవించారు.
ఒకప్పుడు భర్తలు వృత్తి రీత్యా కుటుంబాన్ని వదిలి ఇంటికి దూరంగా వెడుతున్నపుడు భార్యలకి ఇనుప కచ్చడాలు వేసి వెళ్లారట వారు వచ్చేవరకు స్త్రీల పవిత్రత చెడిపోకూడదని. ఆ సంఘర్షణ నీ కళ్ళకి కట్టినా ఈ కవిత చూడండి.
అనుమానం తలుపు కొట్టినప్పుడు
నడుముకి కచ్చడం తగిలించి
యోనిని కాపుకాసే తాళం కప్ప చేయించుకుని
తాళం పంచ మొలకి కట్టుకున్న నాడూ
భయపడలేదు
అనుక్షణం వెంట తిరిగే మగడు
చూపుల వేట తప్పించుకోవటానికి
ఇనుప కచ్చడాలు మోసింది.
ఆమె..
ఆధునిక కచ్చడం కోసం వెతుకుతుంది
మనిషి దగ్గరకు రాగానే రాతి గుహ మూసుకుపోయినట్టు
మూసుకుపోయే తాళం కప్ప కోసం వెతుకుతుంది
ఎప్పుడో మనువు కాలంలో స్త్రీల మీద అనుమానం వచ్చిన మొగుళ్ళు నడుముకి కట్టిన తాళం కప్ప వాటిని మోసిన స్త్రీలకి వేల వేల దండాలు. వాటి నుంచి బయటపడి బతుకుతున్న బతుకులకి మళ్ళీ వాటి కోసం వెతికే దారుణమైన పరిస్థితి వచ్చిందంటూ చెప్తున్న సంఘర్షణని ఈ కవితలో చూస్తాం.
ఆమె..
విస్కీ గ్లాసుతో కనిపించినప్పుడు
సంప్రదాయాన్ని దిబ్బ చేర్చిందని
గొడవలు చేసే సమూహంలో
వాడు తాగి చితక తన్నే చిత్ర పటాలు
అమ్మకానికి పెట్టింది
పొట్టి గుడ్డలు వేసుకున్నందుకే
కామం బుస కొట్టిందని
బుసకొడుతున్న ముఖాల ముందు
ఒంటి మీద బట్ట లేని పాపాయి శవాన్ని పడుకోబెట్టి
ఏ చిరునామా కి పంపాలని అడిగింది
ఈ కవితా పదాలు ఏం చెపుతున్నాయి ఆమె
విస్కీ తాగటం సంప్రదాయాన్ని బద్దలు కొట్టే ఆధునికతా? పొట్టి గుడ్డలు వేసుకోవటం ఆధునికతా? పొట్టి గుడ్డలు వేసుకోవటం కామం బుసగొట్టటానికి కారణం కాదా? ఆధునికత ముసుగులో,స్వేచ్ఛ పేరుతో నేటి ఆధునిక స్త్రీ తాను ఏం చేస్తుందో తనకే తెలియని స్థితిలో ఉందని అనిపిస్తుంది. విలియట్ అన్నట్లు ఆధునికత కాలానికి సంబంధించింది కాదు. స్వభావ సంబంధమైనది.
స్వేచ్ఛకు,స్వతంత్రతకి మధ్య ఉన్న చిన్న గీతని అర్థం చేసుకోలేక పోతుందా నేటి ఆధునిక స్త్రీ. స్వేచ్ఛకు ఖచ్చితంగా కొన్ని పరిమితులు ఉంటాయి ఉండాలి కూడా. ఎప్పుడో ప్రాకృతిక వ్యవస్థలో, నాయకత్వం, రాజ్యాంగం లేనప్పుడు మానవుడు అనుభవించిందే సహజ స్వేచ్ఛ. మనం ఎప్పుడైతే స్వాతంత్ర్యం సంపాదించుకుని రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నామో అప్పుడు సహజ స్వేచ్ఛ స్థానంలో పౌర స్వేచ్ఛ వచ్చింది. ఎట్లాంటి పరిమితులు లేనిది సహజ స్వేచ్ఛ అయితే కొన్ని పరిమితులు ఉన్నది పౌర స్వేచ్ఛ. అంటే రాజ్యాంగమే పౌరులకు వారి స్వేచ్ఛ పై కొన్ని పరిమితులు విధించింది. ఎందుకూ అంటే వారి సంక్షేమం కోసమే. .స్పీడ్ బ్రేకర్స్ వేగాన్ని ఆపటానికి. కానీ వాటిని లెక్క చేయకపోతే బొక్క బోర్లా పడక తప్పదు. అలానే స్వేచ్ఛ కూడా. ఆధునిక స్త్రీ తెలుసుకోవలసింది కూడా అదే తనకు తను కొన్ని పరిమితులు విధించుకుని ప్రవర్తిస్తే అది తన స్వతంత్రతను తను సాధించుకోగలదు లేకపోతే భంగం పాటు తప్పదు. స్వతంత్రంగా ఉండటంలో తప్పులేదు కానీ స్వేచ్ఛ పేరుతో పొట్టి గుడ్డలు వేసుకుని ఏమన్నా అంటే పసి పాపాయిలో ఏ సెక్సప్పీల్ ఉందని వితండ వాదం చేసి, మా కంఫర్టబుల్ మా డ్రెస్సులు అంటే భంగపాటు తప్పదు కొన్ని యూనివర్సల్ ట్రూత్స్ ఉంటాయి. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు లాగా ఇది ఎవరూ కాదనలేని సత్యం. అలానే వేషధారణ కూడా ధరించిన విధానం బట్టి ఎదుటి వారి చూపు వుంటుంది. ఒంటి నిండా కప్పుకుంటే చూడగానే చేతులెత్తి నమస్కరించాలని అనిపిస్తుంది. ఒంటినిండా లేకపోతే చెంప మీద కొట్టాలని అనిపిస్తుంది.
ఆమె..
ఎటువంటి ఆజ్ఞలు అదుపులు లేని
కొత్త ఉదయం కిటికీ తెరుచుకున్న ఇల్లు
విశాలంగా ప్రతీ మూల వెలిగించుకున్న
దీపం ప్రమిదలు చీకటిని తరుముతున్నాయి
తలుపులకి తాళం లేని ఆ ఇంట్లో
ఎవరికి వారే స్వేచ్ఛగా ఎగిరి మళ్ళీ వాలిపోవచ్చు
నమ్మకం దారంతో పెనవేసుకున్న ప్రేమ
ఇద్దరి మధ్య రోజూ ఉదయిస్తూనే ఉంది
సరి సమానంలో ఆనందం
ఆర్థిక స్వేచ్ఛలో వెసులుబాటు
ఈ కవితా పాదాలు పెళ్లి మీద నమ్మకం లేని సహజీవనం గురించి చెప్తున్నాయి. సహజీవనం లో బాధ్యతలు ఉండవు. ఎవరూ ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.ఇష్టం ఉన్నన్ని రోజులు కలిసి ఉండచ్చు తర్వాత విడిపోవచ్చు. లీగల్ ప్రాబ్లమ్స్ ఏవీ రావు. అంటే విడిపోవడం చాలా ఈజీ. అంతా ఈజీ గోయింగ్. విలువలు లేవు, నిబద్ధత లేదు ఎవరికి ఏది నచ్చితే అది చేసేయటమే.
ఒకప్పుడు జోగిని,దేవదాసి వ్యవస్థలు అతి దారుణంగా ఉండేవి. ఆ సమయంలో చాలామంది ఆ వృత్తిని వదిలి వేసి పెళ్లి చేసుకోవాలని చాలా ఆశ పడేవారు. వారిని ఆ వృత్తి నుంచి విముక్తి చేయాలని కందుకూరి వీరేశలింగం పంతులు గారు, దర్శి చెంచయ్య మొదలగు వారు చాలా కృషి చేసి వారికి విముక్తి కలిగించారు. వారి పోరాటం ఫలితంగా కేంద్ర శాసన సభ లో బిల్లు ఆమోదం పొంది చట్టం అయింది.
ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఒకప్పుడు ఏది కావాలని పోరాటం చేసామో అది వద్దు అని ఇప్పుడు పోరాటం చేస్తున్నాము.
భూ ప్రపంచంలో ఆలోచించే జంతువు అంటే మానవుడొక్కడే. ఆ ఆలోచన తోనే మానవులు కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకుని జీవితం గడుపుతున్నారు. ఆధునికత పేరుతో ఆ నిబంధనలను తుంగలో తొక్కి నేటి ప్రపంచం నడుస్తుంది. ఈ ఆధునికత మనిషికి పశువుకు తేడా లేకుండా చేస్తుంది అనటం అతిశయోక్తి కాదేమో.
.....నీలిమ.....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment