Tuesday 8 January 2013

by-- కాశీరాజు





















లోపలి స్వరం *

రేణుకా అయోలా లోపలి స్వరం కవితా సంకలనం చదివిన తర్వాత నా అనుభూతిని వీలైతే ఆ రచయిత్రితో లేదా నాలాంటి పాటకులతో పంచుకోవాలనిపించింది.లోపలి స్వరం ఆమె రాసిన రెండవ కవితా సంకలనం.ఇందులో ఉన్న కవితల్లో చాలామటుకు తన రోజువారీ జీవితంలోని సంఘటణలే, వాటిని అక్షరంతో అభిషేకం చేసి మనముందు ప్రతిస్టించింది.ఒకరి మనసులోని ఆంతర్యాన్ని లేదా వారి మాటలను అతి సులువుగా కవిత్వం చేయగలదీమే .
”ఆగిపోని కవిత్వం ఏరులై ప్రవహిస్తుంటే
కవులు పసితనపు పక్షులు ఎగరేస్తారు .
చిట్టి మొలకలవైపు గడ్డి పూలవైపు చూస్తూ సంబరపడిపోతారు.
ఈ కవులు ఏ కాలంలో నడుస్తున్నా,
వారు పాతిన గింజలవంటి చరిత్రను తిరగేస్తూ జీవితం మీద నమ్మకాన్ని కలిగిస్తారు .
ఈ కవులింతే” అని తన తాతగారి మాటల్లోని భావనల్ని ఆయన గొంతై,రాతై మనకు కవితను వినిపిస్తుంది .ఒకరిమీద ప్రేమనో, స్నేహాన్నో , ఒక ప్రదేశం మీద వీడిపోని ఇష్టమో ఆమె కవితల్లో కనిపిస్తాయి.
“జ్ఞాపకాలతో నలుగుతున్న ఆ ముఖం కనపడగానే
ప్రపంచం తెలిసిపోయినంత ఆనందం
దూరం అవుతున్న కొద్దీ
వేదనో, ఆవేదనో తెలియని తనం
ముఖం ముఖంలాగా కాక జ్ఞాపకంలా మనలో మిగులుతుంది “ అని
ఒక చిన్నప్పటి జ్యాపకాన్ని కవిత్వంతో గట్టిగా కట్టి, కానుక మీకు అన్నట్టు మనముందు ఉంచింది . తన మనసులోని భావాలే కాక వేరే మనుసుల్లోకి చొరబడి వారి భావాలను అంతే చక్కగా రాస్తారు . ఇంట్లో పాత గడియారం కింద వేలాడుతున్న తాత ఫోటో చూసి ఇలా రాస్తారు.
“ఎప్పుడు ఈ ఇంట్లో కాలుపెట్టినా
ఎడ్లబండి చప్పుడు వినిపిస్తుంది “
నాగలి చేత్తోపట్టి ఎడ్లబండి తోలుతూ , దాన్యాన్ని కొట్లో నింపిన చేతులు ,పట్టె మంచం,తెల్లని బొంత కాళ్ళ దగ్గర రాగి చెంబుతో వాళ్ళ తాతయ్య వెంటాడే జ్ఞాపకం అని చెబుతుంటే మనకళ్ళముందు ఒక పిచ్చరైజేషన్ ఏర్పడి కాసేపు ఆ తాతగారిని సజీవంగా చూడగలుగుతాము .
మనమనుకుంటాం కానీ ఒంటరితనం ఎవరికీ ఉండదు.అది బహుశా సాధ్యం కాదు. ఖాళీ ఖాళీగా కనిపించి నిండి ఉండే గాలిలా ఒంటరితన కూడా ఖాళీగా ఉండదు. సుడులెత్తే ఆలోచనలతో జ్ఞాపకాలతో ఎల్లప్పుడూ సందడి సందడి గా ఉంటుందని చెబుతారు ఒంటరి తనం అనే కవితలో! . ఇద్దరిమద్యా మూఖాభినయాన్ని ఎంతబాగా వివరిస్తారంటే
“ వేళ్ళ చివర అక్షరాలను పొదిగి
అరచేత సంజ్ఞలతో ముడిపెట్టి
కబుర్లని అనువదిస్తూ స్పర్శలతో బందాలనూ ముడిపెట్టుకోవాలని
ఆ ఇద్దరూ మౌనానికి భాషను నేర్పుతారు “
భాషలేని భావాలూ, విడమరచలేని సందిగ్ద రూపాల్లా వాళ్ళు
చేతివేళ్ళ కోనల్లో మాటల్ని సృస్టిస్తారు “
మౌనాన్ని భాషగా చేసుకుని మూకాభినయం ప్రదర్శించుకునే ఒక జంట గురించి ఇంత అందంగా ఎవరు రాస్తారు ?
"అమ్మా,నాన్న గురించి సమాజం అడిగినపుడు వాడికో పుట్టుక కధ ఉందని గుర్తుకొస్తుంది పసివయసులో గుండెలనిండా గాదలే కళ్ళనిండా అనాధ దృశ్యాలే ! పసితనమొకటి అప్పుడప్పుడూ పలకరించి పోతుంటుంది .రహదారిలో ఒకరికొకరు తోడుగా నడుచుకుంటూ బీదరికాన్ని తలాకాస్తా పంచుకుంటారు” ఇలాంటి వాక్యాలతో అనాద తనం గురించి రాస్తూ అనాద మనుసులనీ, మనసులనీ ఆలోసింపజేస్తుందామె.
“ఉన్న ఊరు, కన్నతల్లి మీద ప్రేమనీ ఎంతబాగా కవిత్వీకరించి మనకు అందించిందంటే ఊరిప్రయాణం అనే కవితలో
“ రోహిణీ కార్తె మద్యానపు ఎండ నిలువునా కాస్తుంటే
దిగుడు బావిలో ఈతలూ
ఆ స్నానం ఎంతో గొప్పది
బావిచుట్టూ చిన్న చిన్న అడుగుల కుదుళ్లలో నీరు
ఆ నీటి తడిలో పిచ్చుకల స్నానాలు “
ఊరిప్రయాణం ఎప్పుడు అనుకున్నా మనిషికన్నా ముందు జ్ఞాపకాలు పరుగులు తీస్తాయి . అని ఈ పుస్తకాని మనచేతుల్లో ఉంచుకునీ మనం కూడా మన వూళ్ళకు వెళ్ళి దిగుడుబావుల్లో మునకలేసి వచ్చేంతగా చక్కగా రాసింది.
తనవూరిలోని నదిని గుర్తుచేసుకుంటూ
“పల్లెమీద అలిగీ
దూరంగా జరిగీ
తనకు తానుగా నిచ్చలంగా పాయాలా పారుతుంటే
వర్షపు గొడుగులేక మండుటెండలో నిలుచున్నట్లుంది “
ఇసుక గొంతులో నీటి చెలమల తడి
పల్లెదాహం తీరిస్తూ! అని అమ్మలాంటి నది గురించి “అమ్మనది” కవిత

“అమ్మ వెళ్ళి పోయింది
అందర్నీ వదిలి వెళ్లిపోయింది
నన్ను ఎత్తుకుని లాలించిన చేతుల నుండి గాజులూ
పడుకోబెట్టి నలుగుపెట్టి స్నానం చేయించిన కాళ్ళ నుండి
కడియాలు వాటాలు పంచుకున్నాక
అమ్మ వెళ్లిపోయింది”
ఒక జ్ఞాపకం సూదిమొనలా గుచ్చుకుంటుంది
“ కూరలో ఉప్పు ఎక్కువైతే
ముఖం మీద పల్లాలు విసిరేసినా
ఉప్పు సరిచూసుకున్నాను కాను – అనుకునే అమ్మకి
అభిమానాలు,ఆప్యాయతలు పంచివ్వడమే తెలుసు “ అమ్మ జ్ఞాపకం గా మిగిలిన ఓ సందుపెట్టెని చూసినప్పుడల్లా ఆమె తన తల్లిని పల్లకిలో పెళ్లికూతిరిలా చూసుకుంటుంది . ఆ సన్నివేశాలు ఎంతో చక్కగా కనిపిస్తాయి తన ఊరి చిత్రాన్ని చూసో, లేదా వేరే ఏదైనా ప్రదేశాన్ని చూసో ఎంత చక్కగా ఆయాప్రాంతాలను అక్షరాలుగా చేస్తుందో ప్రేమకట్టడం,చిత్రం అయిన ఊరు లాంటి కవితల్లో మనం చూడవచ్చు
“శరీరం శిధిలమై చరిత్రలో బాగమైపోతుంటుంది
ప్రేమ సజీవమై పాలరాతి గుండెలో ఒదిగిపోతుంది
అడుగడుగునా ప్రేమ శిల్పచాతుర్యాలతోనిండి
తన ఒడిలో చేరమంటూ పిలుస్తుంది “
ఒక చారిత్రక కట్టడం తాజ్ మహల్ మీద రాసిన ఈ కవిత అద్భుతం .

“బర్త్ డే గ్రీటింగ్స్ కోసం ఎదురుచూపు
ఖాళీగా పడివున్న ఉదయాన్ని దాటుకునీ
అద్దరాత్రి గ్రీటింగ్స్ , గుప్పుమన్న విస్కీ వాసన
పొగడ్తలు, శరీరం నిండా గాయాలు
సుడితిరిగే దుఖ్ఖపు అంచుల్లో పుట్టినరోజు
మసక చంద్రుడిలా వెలవెలబోయింది
కానీ
మళ్ళీ వచ్చింది
హ్యాపీ బర్త్ డే మాతృత్వపు పరిమళం తియ్యగా రాగాలు తీసింది “
అని పుట్టిన రోజు కవితా ద్వారా ఒక నిశిత పరిశీలనని , జీవితంలో ఎదుర్కున్న సంఘటనల్ని కవితగా ఎలా మార్చిందో ఇక్కడ చూడొచ్చు
కొత్త ఉదయం పుట్టుక ,ఎవరో నేర్పిన పాఠం,జన్మరహస్యం ,పాత ఇల్లు ఇలా అన్నీ తమ ప్రాముఖ్యతను ఈ పుస్తకంలో చెబుతూ కనిపిస్తాయి .
“నిద్రపోతున్న దేన్నైనా లేపొచ్చు
నిద్రపోతున్న సాహిత్యాన్ని ఇప్పుడిక పెడబొబ్బలతో లేపాలి
మనకోసం సాహిత్యం నాగలిని
భుజానికెత్తుకోవాలి
దుక్కి దున్నిన భూమ్మీద
ఆప్యాయతల గింజలు జల్లుకోవాలి
మొలకెత్తిన మొలక
మేలుకోవాల్సిన సమాజానికి ప్రతీక “ అంటూ “రాయాల్సిన వాక్యం” రాసేసి, ఈ పుస్తకానికి కవీ,లేదా కవయిత్రీ ఎప్పుడూ రాస్తూనే ఉండాలి అని వాడ్రేవు చినవీరభద్రుడు ముందుమాటగా రాసిన వాక్యాలు నిజం చేస్తుంది .ఈ పుస్తకం చదివి అభిప్రాయం రాయడంలో నేను ఎంత సఫలమయ్యానో తెలియదుగానీ నేను ఇక్కడ రాసింది ఆ కవితల్లోని ఖచ్చితమైన ఆతృత కాకపోతే నేను మిగతా పాటకులని తప్పుదోవ పట్టించినట్టే అవుతుంది . అయినా యధావిదిగా పుస్తకం చదివిన తర్వాత అది నాకు పంచిన అనుభూతిని ఇలా రాస్తున్నాను .వాస్తవికతను అక్షరబద్దం చేయడానికి మీ చేతుల్లో ఉండాల్సిన పుస్తకం ఇది .

లోపలి స్వరం
కవయిత్రి: రేణుకా అయోలా
ఈమైల్:isola.renu@yahoo.com
కవర్ డిజైన్ :మహేశ్ మలైకర్
వేల:60 రూ /
పేజీలు:119
ప్రతులకు :పాలపిట్ట బుక్స్ , kinige.com












No comments:

Post a Comment