Hi friends, ఝాన్సీ కొప్పిశెట్టి రాసిన విశ్లేషణ
రేణుక అయోల 'పృథ' పై తొలుతగా గొంతు విప్పిన గువ్వ.
పాలపిట్ట డిసెంబర్ సంచికలో ప్రచురించిన పాలపిట్ట ఎడిటర్ శ్రీ గుడిపాటి గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
మీ అందరి కోసం నా సమీక్షను ఇక్కడ పెడుతున్నాను... చదువుతారు కదూ....
@రేణుక అయోల పృథాన్వేషణపై నా అన్వేషణ@
పృథ... ఓ అన్వేషణ...
అన్వేషణ అంటేనే ఆత్రం, ఉత్సాహం నాకు.
ఎంతో ఉత్సుకతతో రేణుక అయోల అన్వేషణలోకి నా అన్వేషణ మొదలెట్టాను.
పృథ అంటే కుంతి కదా...
భారత కథా నేపధ్యంలో కుంతి పాత్రను స్త్రీవాద దృక్కోణంతో తనదైన సృజనాత్మకతో దీర్ఘ కావ్యంగా మలిచి వుంటారేమో అనుకున్నాను.
పౌరాణిక పాత్రలతో రెలెవెన్స్ ఇస్తూ వచ్చిన కథలు, నవలలు చూసాను కాని ఇలా కవిత్వ రూపంలో ఇంత అద్భుతంగా ఆర్ద్రంగా హృద్యంగా మలచటం చూసి ఒకింత ఆశ్చర్యపోయాను. పృథ మనోలాపన చదివాక బహూశా రేణుక తప్ప ఇది ఎవరూ రాయలేని కావ్యం అనిపించింది.
పృథ మౌన మానసిక సంఘర్షణ, రాచరికపు వ్యవస్థకు అనుకూలంగా రాజ్యం వంశాభివృద్ది కోసం సూత్రీకరించుకుని అతివల పైన రుద్దిన నైతిక విలువలు, నిర్దేశిక పితృస్వామ్య విధానం చదువుతుంటే ఒళ్ళు గగుర్పొడిచి మనసు చలించింది. చదవగా చదవగా రేణుక ఈ రచన చేయటానికి పడిన క్షోభ, ఈ పృథావిర్భావానికి మూలం పురాణ పాత్ర పృథే అయినప్పటికీ ఆమె ఆక్రోశిస్తున్నది నేటికీ మారని సామాజిక కట్టుబాట్లు, వర్తమాన సమాజంలోని అనేక పృథల వేదన అని అర్ధమయ్యింది. రేణుక ఈ కవితాస్త్రం సంధించింది ఇప్పటికీ లోతుగా పాతుకుపోయి వున్న పితృస్వామ్య సమాజం పైన అని గ్రహించాక ఆమె పట్ల గౌరవం మరింత పెరిగింది.
ఈ పృథ మానసిక సంఘర్షణ చదివే కొద్దీ పృథ సంఘర్షణతో ఎంతగా కనెక్ట్ అయ్యానంటే అసంకల్పితంగా గత తలపుల్లోకి నా మనసు తలుపులు తెరుచుకు పోయాయి. అసలు ఆ భావనా స్థితిని మాటల్లో చెప్పలేను. కొన్ని చోట్ల రేణుక వ్యక్తీకరించిన పృథలోని భావ ప్రకంపనలకు కంపించిపోయాను. ఒకానొక సందర్భంలో ఉలిక్కిపడ్డాను. మరికొన్ని చోట్ల ఒక్కొక్కరుగా నాకు పరిచయమున్న ఈ సమాజంలోని అనేక పృథలు కళ్ళ ముందు కనిపించారు.
రేణుక సృజించిన సమ్మోహనమైన కవిత్వ కథనానికి చకితురాలినయ్యాను.
“అందమైన దేహం చుట్టూ కథ
కథ చుట్టూ నమ్మకాలు బానిసత్వాలు
చరిత్ర జాతరలో వంశం కోసం
తెచ్చుకున్న బలమైన
పెయ్యిదూడలు ఆడవాళ్ళు
ఆమె చరిత్ర ద్వారాలు బార్లా తెరిచి
స్పష్టంగానే చెబుతోంది...”
కృతి ప్రారంభoలోనే చరిత్ర జాతరలో వంశాభివృద్ది కోసం ఉపయోగించుకునే ప్రాణులుగా స్త్రీలను పెయ్యిదూడలతో పోలుస్తూ రేణుక ఎంత నర్మగర్భంగా సర్కాస్టిక్ గా వ్యక్తీకరించారో కదా...!
నన్నడిగితే దేహం అందమైనది కానక్కరలేదు.. ఆడ దేహమంటే సరిపోయేదేమో.
ప్రతి ఆడదేహానికి ఓ కథ వుంటుంది. ఆ కథ చుట్టూ నమ్మకాలు బానిసత్వాలు.
ఇంకొంచం ముందుకెళ్ళాక పృథను తండ్రి దుర్వాస మహర్షి సేవలకు నియమించటాన్ని, ఆమెలోని అయిష్టతను వ్యక్తపరిచిన తీరుకి ఖిన్నురాలినయ్యాను.
“చుట్టూతా ఒక గీత గీసి
ఇదే రాచరికపు మర్యాదా అన్నప్పుడు
తండ్రి ఇచ్చిన బాధ్యతకి వులిక్కిపడింది
రాచరికం అప్పగించిన బాధ్యత
ఊహించని మలుపు తిప్పిన జీవితం..
ఆమెని ఎవరూ అడగలేదు
ఇష్టమో కాదో ఆలోచించనూ లేదు
మొహమాటం భయంలో
వద్దు అనే శబ్దం గొంతులోనే ఆగిపోయింది
ఎక్కడెక్కడో తిరిగొచ్చే
మట్టిపాదాలు కడగాలి
నిలకడ లేని కోపానికి బలి అవ్వాలి
అప్పుడు కూడా ఎవరూ వెనక్కి
తిరిగి చూడలేదు అడగలేదు
ఒంటరి యవ్వనాన్ని ఖాతరు చేయలేదు..”
అనేకానేక అయిష్టమైన పనులు తండ్రి ఆఘ్నాపించాడనో, తల్లి అర్ధించిందనో ఆడపిల్లలు చేస్తుంటారు. ఇది చదివాక నా మనసు పురాస్మృతులతో ఆక్రోశించింది. నాకు ఇక్కడ నేను ఎనిమిదో క్లాసు చదివేప్పటి సంఘటన ఒకటి గుర్తొచ్చింది.
అప్పుడు అమ్మoటే నాకు బెత్తంతో ఓ టీచరు. ఇప్పటి బాహుబలిలో రమ్యక్రిష్ణలా ‘నేను చెప్పిందే శాసనం’ టైపు.
అమ్మ స్వరజ్ఞానం లేని నన్ను వీణ నేర్చుకోమని బలవంత పెట్టింది. చదువొక్కటే సరిపోదు ఆడపిల్లకు అన్ని కళలు అవసరమనేది అమ్మ. వీణా మాష్టారు మా ఇంటికి రావాలంటే నా దగ్గర వీణ లేదు, అంత ఫీజు ఇచ్చుకునే స్థోమత లేదు. నేనే వెళ్ళేదాన్ని వారి ఇంటికి. అమ్మ క్లాసులకు రానూ పోనూ రిక్షా కుదిర్చింది.
మాష్టారుకి డెబ్భయ్ ఏళ్ళు వుంటాయేమో. నేను పదమూడేళ్ళ పిల్లను. నేను వెళ్ళే వేళప్పుడు వారి ఇంట్లో హౌస్ వైఫ్ అయిన వారి కోడలు కూడా వుండే వారు. మంచి సాంప్రదాయ పద్దతిలో క్రమశిక్షణతో క్లాసు నడిచేది. అయితే క్లాసు అయ్యాక దారిలో తనకో క్లాసు వుందని మాష్టారు నా రిక్షా ఎక్కేవారు. పక్కనే కూర్చుని నన్ను కాని చోట తాకటం, నొక్కటం, అసభ్యంగా ప్రవర్తించటం చేసేవారు. అమ్మకు చెప్పలేను. వీణ నేర్చుకోవటం ఇష్టం లేక అది నేను కల్పించిన సాకు అనుకోవచ్చు అమ్మ. నిజానికి అసలు అమ్మ ముందు అలాంటి విషయాన్ని ప్రస్తావించ లేను. మౌనంగా ఆ జుగుప్సాకర నరకాన్ని భరించాను. ఇలా పెద్దలను, గార్డియన్స్ ను ఎదిరించలేని పృథలు ఎందరో కదా అనిపించింది.
ఇక మునీశ్వరులు ఇచ్చిన వరం విషయంలో
“గూడుకట్టుకున్న సందేహం
మనసుని చిన్నాభిన్నం చేసింది
వరమనే దీపాన్ని గూట్లో పెట్టి
చూస్తూ వుండలేక పోయింది”
మానవసహజమే కదా...
వరం ఏమిటో తెలుసుకుందామని కన్నె చాపల్యాన్ని, అనుమానాన్ని అణచుకోలేక సూర్యగ్రహాన్ని ఆహ్వానించింది పృథ. భూమి పైన ప్రత్యక్షమైన గోళాన్ని చూసి అంతలోనే తన తప్పును గ్రహించి ‘వొద్దు’ అని బతిమాలుకుంది. ఎంత ఎలుగెత్తి ఆక్రోశించినా అంతఃపురం గోడలకు అర్ధం కాలేదు. అన్యాయమని ఎవరికీ అనిపించలేదు. ఈ నిస్సహాయ స్థితిని నిజానికి ఈ నేల సాక్షిగా ఎందరు పృథలు రకరకాల విపత్కర పరిస్థితుల్లో అనుభవిస్తున్నారో కదా..!
వొద్దు అంటే నో..
‘నో అంటే నో’ యే అని ఎందరికి అర్ధం అవుతుంది.
స్త్రీ ఎన్ని విద్యల్లో ఆరితేరినా, ఎంత ఉన్నతి సాధించినా, రాజ్యాలే ఏలినా, రణాలే గెలిచినా, ‘నో అంటే నో’ యే అని ఎన్ని ‘పింక్’ పిక్చర్లు గొంతు చించుకున్నా యుగయుగాలుగా మారని స్త్రీల చరిత్ర మగాడి దురహంకార ‘నో’ ల కింద నొక్కబడి అణచి వేయబడుతూనే వుంది.
కాలమాన స్థితిగతులేమైనప్పటికీ పురాణాల్లో పతివ్రతలుగా చెప్పబడిన సతీమణుల నుండి రెడ్ లైట్ ఏరియాలో రతీమణుల వరకూ అప్పుడే పుట్టిన పసికందు నుండి కాటికి కాళ్ళు చాచిన ముదుసలి వరకూ బలవంత లైంగిక అత్యాచారానికి, అణచివేతకు గురవుతూనే వున్నారు.
పితృస్వామ్య నియంత్రణను ఎదిరించి ‘నో’ అంటే పతివ్రతలో ఓ అక్షరం ఆగమై పతితగా మిగులుతుంది. ‘నో’ కి అర్ధం ‘నో’ గా పుణ్య పురుషులు గ్రహించే వరకూ ఈ వ్యథా తప్పదు... ఘర్షణా తప్పదు... పృథలూ తప్పరు...
ఆకృత్యాలను ప్రతిఘటిస్తూ రేణుక లాంటి వారు స్వరం విప్పక తప్పదు.
సరే ఆ నిస్సహాయతకి ఫలంగా ఓ కర్ణుడు పుట్టాడు...
“తల్లి తండ్రి సఖులు
చుట్టూతా మనుషులు
అప్పుడే చీకటిని చూసినట్టు
వొక్కొక్క దీపమై వచ్చారు
పక్కలో బిడ్డ పామైనట్టు భయపడిపోయి
వాడిని వదిలేయమంటున్నారు
పెళ్ళీడు పిల్లవు
గాయాన్ని చెరిపేసుకోమన్నారు
రక్తాన్ని బట్టకట్టి దాచినట్టే వుంది కదూ !
ఎంతో నిర్దయగా కొన్ని పూలను
దీపం పడవలని నదిలో వదిలినట్టు
పసిబిడ్దని వదిలేయగానే న్యాయం జరిగినట్టేనా ?”
సమాజం గుండెల్లోకి రేణుక గురి చూసి విసిరిన బాణం ఇది. ఇలాంటి ఎందరు పృథల వలన సమాజంలో ఎందరు కర్ణులు చెత్త కుప్ప పాలవుతున్నారో కదా. ఇక్కడ కూడా సమాజం పాత్రను ఎంతో ఆర్ద్రంగా నిష్కర్షగా నిలదీసారు రేణుక.
గుండెల్లో దాచుకున్న గాయం మానకుండా మనసు ముక్కలవుతున్న సమయంలో పెళ్ళి. పైగా ఆమెకు మునీశ్వరుడిచ్చిన వరమే పెద్ద శాపమనుకుంటే ఇప్పుడు భర్త నపుంసకత్వం మరో దురదృష్టకర శాపం. బహూశా అదే మహా భారతానికి పునాది అనుకుంటా.
పృథ తనువుని రగిలించి, రగిలిన అగ్గిని రాజించ లేని నపుంసక పరిష్వంగ దుఃఖాన్ని, ఆమె వదిలించుకోలేని ఆ జీవిత సంకెళ్ళని, ఏ అంగాంగ ప్రదర్శనాత్మక జుగుప్సాకర శృంగార వర్ణన లేకుండా ఆమెలోని ఎన్నెన్ని మనోభావాలను కవితా మాలలో ఒకే చోట గుదిగుచ్చారో రేణుక. నిజంగా ఆమె వ్యక్తీకరణకు ఇక్కడ నేను ఫిదా అయిపోయా. పాండురాజు ఆమెను ఉద్రిక్తపరచటం.. ఆమె రగిలిపోవటం... అతని నపుంసకత్వం... మూకుమ్మడి భావజాలాన్ని ఈ కవితాత్మక వాక్యాల్లో ఎంత అద్భుతంగా ప్రెజెంట్ చేసారో..!
“వాడు కనుబొమ్మలు సవరించి
మైకట్టుని పొగిడి రగిల్చీ రగిల్చీ
నిట్టూర్పుల వేడి మీద మంచు ముక్కలు దొర్లించి
కాలితో ఇసుక మేడని తన్నిన
పాదాల మంటను చల్లార్చుకోవటం ఎలాగ?
మసక వెలుగుని కాంతివంతం
చేయడం ఎలాగ?
అధికారం విసిరిన ద్రోహపు రాయిని
శబ్దం చేయకుండా నదిలోకి విసరటం ఎలా?
ఈ నష్ట వీరుడిని ఏం చేసుకోవాలి !
శృంగార ఆర్భాటాల వల వేసి
జీవిత ఖైదు చేసిన ఈ వీరుడి
సంకెళ్ళు తెంపుకోవటం ఎలా?
రగిలి రగిలి అడుగుతూనే వుంది
పులకరించక ముందే రాలిపోయి”
ఈనాటి జీవితాల్లో ఇది ఎందరో పృథల వ్యథాత్మక కథ సుమా. కొందరు సంకెళ్ళు తెంచుకోలేక జీవిత ఖైదీలయితే కొందరు తెగువతో విడాకులు తీసుకుంటారు. నా క్లోజ్ ఫ్రెండ్ కూతురు గుర్తొచ్చింది ఇక్కడ. అమ్మాయి డాక్టరు. అమెరికా సంబంధం. ఎంతో ఆర్భాటంగా పెళ్ళి చేసి సాగనంపితే అబ్బాయి నపుంసకుడని తెలిసింది. వివాహానంతర కన్నెగానే మిగిలిన ఆ పృథ వ్యథకు నా స్నేహితురాలి శోకం వర్ణనాతీతం.
పురుషులు వాళ్ళ అసమర్థతను అంగీకరించకుండా దోషమంతా మగువకే అంటగట్టే నైజాన్ని, పృథకు ఎదురయిన దయనీయ స్థితిని రేణుక ఎంత హృదయవిదారకంగా దృశ్యమానం చేసారో చూడండి.
“పనికి రాని దేహమని
చిందర వందరగా ఆడుకుని
పట్టు పరికిణీ మీద
వోణీ లేని వొంటి నిండా
అద్దకాలు చేతి గుర్తులు
రంగులన్నీ కలియబెట్టి ఆడబొమ్మ కాదని
సగంలో వదిలేసిన
గంధం మరకల వేళ్ళతో
కొడిగట్టిన దీపం మసి ముఖంతో
అవమానించి హింసించి
వోడిన ముఖంతో నిద్రపోతున్నాడు”
తన బీజంలో సత్తా లేదని ఒప్పుకోక భార్యదే బంజరు భూమి అని మాద్రిని మారు మనువు చేసుకున్న ఉదంతం చదువుతుంటే మా ఒకప్పటి పనిమనిషి లక్ష్మి గుర్తొచ్చింది. తన పధ్నాలుగు సంవత్సరాల కాపురం తరువాత ఆమె భర్త రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఎందుకని అడిగితే తనలో ఆడతనం లేదని సంతానం ఇవ్వలేకపోతున్నందుకు మరో మనువు.
అసలు బీజాన్ని నాటే పురుషుడిలోనే ఎక్కువ శాతం లోపముంటుందని ఒప్పుకునేదెoదరు..?
వంశాభివృద్ది కోసం రాజు పడుతున్న వ్యథను చూచి పృథ తాను వివాహ పూర్వమే కన్న బిడ్డ గురించి చెబితే
“బతికి వున్నవాడిని కులహింసలో తల నరికేసి
క్షత్రియ వంశ సాంప్రదాయ ముసుగులో
ఈ రాజు నన్ను ఎవరికి తాకట్టు పెడుతున్నాడు ?
గుండెల నిండా ఊపిరి తీసుకోలేని
సొరంగం లోకి తోసేసి
చిన్న తాడు ఇచ్చి పైకి రమ్మనే
కురువంశ దాహ సమాధి పొడ నీడ
కుంతి కళ్ళ మీద వాలి వాన అయ్యింది
అశక్తుడైన భర్త
కొండ దిగి వచ్చే బీజ దాతలతో
ఎలా నడుచుకోవాలో చెప్తూనే వున్నాడు
వీళ్ళు కూడా దేవుళ్లే
దేవుళ్ల పక్కలో పడుకుంటే
పసుపు నీళ్ళంత పవిత్రం అనుకుంటా
ఏమి చేయకూడదో చెప్తూనే వున్నాడు
సమీపించే దేవ పురుషుడి మీద
వ్యామోహాలు కోరికలు నగ్నంగా వదిలేసి
లోపల విచ్చుకునే వెలుగు శబ్దం
వినలేని చెవిటితనంతోనే
బీజం నాటించుకుని కడుపు పండగానే
వాడు పితృసమానుడు అనుకోవాలిట.!”
ఇంతకన్నా దారుణం వుంటుందా...?
పృథ ఎవరితో పడుకోవాలో నిర్ణయం రాజుదే, పడుకున్న వ్యక్తికి బిడ్డను కనాలి, మళ్ళీ ఆ వ్యక్తి పైన వ్యామోహపు కోరికలు వుండకూడదు, తన బిడ్డకు తండ్రి అయిన వాడిని తను పితృసమానునిగా భావించాలి. ఆమె మనసులో భావాలను కూడా రాజే నిర్ణయించి నియంత్రిస్తాడు. ఇంతకన్నా పీక్స్ ఆఫ్ పితృస్వామ్యం వుంటుందా..!
ఈ సందర్భంలో రేణుకలో అసహనం రగిలి విస్ఫోటనమయి పృథలోకి పరకాయప్రవేశం చేసి శక్తివంతమైన శాపనార్ధాల అక్షర బాంబులను పేల్చారు.
“రాజ్యాధికారాల మీద
అహంకారాల మీద వుమ్మి వేయాలి
నియోగం పేరుతో పర పురుషులను తార్చే
తార్పుడుగాళ్లను సమాధి చేయాలి
స్త్రీల వొంటి మీద పతివ్రత సాధ్వీమణి
పచ్చబొట్లు వేసేవాడి చేతులు కాళ్ళు కట్టేసి
గాలి వెలుతురు లేని గుహలోకి నెట్టేయ్యాలని
ద్వేషం, అసహనం, అసహ్యం సరోవరంలో
అగ్నిపూల తెప్పతో ఈదుతోంది”
నిజానికి నేటి రాజకీయ సమాజంలో స్త్రీల దుస్థితికి రేణుకలో కలిగిన చలనమే ఈ పృథాన్వేషణ.
“ప్రపంచ సౌందర్యంలో
స్త్రీ దేహానికే మరక అంటుకుంటుంది
తవ్వీ తవ్వీ బయట పడ్డ పుర్రెలకు
వ్యభిచారి అనో హంతకి అనో పతివ్రత అనో
బిరుదులుంటాయి
బిరుదుల పుర్రెలను తాకిన చేతుల
ఆనవాళ్ళు వుండవు
శరీరాలను దోచుకున్న వాటి దాఖలాలు వుండవు
కనికరించి కరుణ చూపే
మంగళ సూత్రాల ముద్ర వుంటుంది...”
సంక్షుభిత హృదయంతో, దుఃఖాశ్రువులతో, దుస్సాంప్రదాయాలను వేలెత్తి చూపుతూ ఈ సమాజానికి స్త్రీల పైనున్న దృష్టి కోణానికి ఎక్కుపెట్టిన ప్రశ్నే ఈ పృథ.
ఈ దీర్ఘ కవిత చివరి చరణంలో
“దేవలోకంలో
వైధవ్య రహిత జీవితాన్ని వదులుకుని
మంచు కొండల్లో తప్పిపోయి
జీవితం తెలుసుకునే అర్హత కోల్పోయి
అయిదుగురు పిల్లల కన్నీళ్ళకి దడిగట్టి
హస్తినాపుర జీవిత ప్రయాణంలో
జీవితం ముగిసిందీ లేదు
బతికిందీ లేదు
కేవలం సమాధి కట్టబడింది” అంటూ ముగించారు.
ఇది నాకు ముగింపులా అనిపించ లేదు. నిజానికి స్త్రీ శక్తిని చాటుకునే సిసలైన పృథ అకుంటిత జీవితానికి నాందిలా వుంది.
మొత్తం మీద ఈ దీర్ఘ కావ్యంలో పృథ ప్రతి సందర్భాన్ని నేటి సమకాలీన జీవితాలకు అన్వయిస్తూ ఎంతో హృద్యంగా ఆర్ద్రంగా ఆవిష్కరించారు రేణుక. పృథ తండ్రి ఆజ్ఞను మీర లేకపోవటం, తొలి ఆగంతక దేవుడి నుండి తనను తాను కాపాడుకోలేకపోవటం, తన నుండి బిడ్డను వేరు చేస్తుంటే అడ్డు కోలేక పోవటం, గాయం మానకుండానే పెళ్ళి నిర్ణయిస్తే తలవంచటం, భర్త నపుంసకత్వం, పైశాచికత్వం, పృథలోని ఆడతనానికి జరిగిన అవమానం, సవతి రాక, పృథలో రేకెత్తిన ఈర్ష్యాసూయలు, అంతఃపుర రాణులు ఇద్దరున్నా అణువణువునా యువతులతో భోగించే పురుషుల స్త్రీలోలత్వం, పురుషుల్లో తార్పుడు తత్వం, స్త్రీలపై నిందారోపణలు, అనేకానేక సామాజిక రుగ్మతలు.. ఇవన్నీ దైనందిన జీవితంలో మనకు తారసపడే సందర్భాలే. ప్రతీదీ అద్భుతంగా ఈ పుస్తకంలో కవిత్వ ప్రవాహమై పారింది. చదువుతూ ఆలోచనలోకి వెళ్ళిపోయి ఎవరికి వారే ఏదోక సందర్భంలో తమకు అన్వయించుకోకుండా వుండరు. మొత్తం మీద ఇందులోని ప్రతి సందర్భం ఆలోచించాల్సిన చర్చించాల్సిన అవసరానికి రేణుక తెర తీసారు.
చివరగా ఒక్క మాట...
స్త్రీల మౌనం అర్ధాంగీకారం అంటే నేనొప్పుకోను. మౌనం చెప్పుకోలేని అణచివేతకు ప్రతీక. మగాడి పెత్తందారీతనానికి ఉదాహరణ.
నో అని చెప్పలేని అశక్తత..
నో అంటే పర్యవసానమేమిటోనన్న భయం..
ఏ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భీతి...
కనీసం ఈ పృథ చదివాక స్త్రీల మౌనాన్ని అర్ధం చేసుకుంటారని, వాళ్ళ “నో” ని గౌరవిస్తారని బలంగా నమ్ముతున్నాను.
ఈ అన్వేషణను మీరూ శోధించాలనుకుంటే ప్రతుల కోసం..
రేణుక అయోల
గూగుల్ పే/ఫోన్ పే – 96768 53987
See less
— feeling happy with Renuka Ayola.
No comments:
Post a Comment