ఉదయం కిటికి తెరవడానికి రాత్రిని అనుభవించి
ఒంటరి నడకలకి పెట్టుకున్న పేరు
మార్నింగ్ వాక్ .
రోజు చూసే చెట్లు, మెత్తటి గడ్డి
పొగమంచు తెరలో చిక్కుకున్న వెలుతురు
సిద్దంగా వుండే్ పచ్చగన్నేరు పూలమడి
అలవాటుగా చిరునవ్వులు సంతరించుకున్న పలకరింపుల ముఖాలు
* * *
ప్రతీ ఉదయం అక్కడ కొన్ని పూలు కొత్తగాపూస్తాయి
అందానికి అర్ధాలు చూపిస్తాయి
పచ్చికలో పసుపురంగు పూల మొక్క
తన్మయత్వంలోకి జారి-
ఒక్కసారి చేతుల్లోకి తీసుకుంటే
లేత రెక్కల అనుభవం
ప్రకృతి అరచేతిలో ఒదిగి
పరిమళాలు నింపిన కొత్తదనం
అప్పుడొక పాట మనసులో సుడి తిరిగి
బయటికి రావడానికి మొహమాటపడి
ఆ నిశ్శబ్దరాగం గొంతులోనే పాటపాడుకుంటుంది
నన్నో అతిధిలా కాకుండా తోటమాలి అనుకుంటాయి
ప్రతీ ఉదయం ఎన్నో దృశ్యాలు
గడచిన రాత్రిని మరుగునపడేస్తాయి.
రోజు వచ్చీ వెళుతున్నాసరే
కొత్తగా చెప్పవలసింది ఇంకా మిగిలిపోతుంది
వినడానికి మళ్ళీమళ్ళీ రావాలి
ప్రతీఉదయం కొన్ని సంగతులు
రాలిన ఆకుదొన్నెలోనో
పచ్చగన్నేరు పూలలోనో
వేప గాలిలోనో మిగిలిపోతాయి
కొత్త ఉదయం కిటికి తెరవడానికి
రాత్రికోసం నిరీక్షీంచాలి.
Beautiful!
ReplyDelete