Wednesday, 15 February 2012

అమ్మ నది

 
నిశ్ఛలమైన  నీటిని కదల్చితే వలయాలు
కదులుతూ కనుమరుగైపోతూ
నీటిఅద్దంలో ముఖం

నదిఒడిలో వెదుక్కునే బాల్యం
అలసిన మనసు ,శరీరం సేదదీరేదిక్కడే
నదితో ముడిపడ్డ సంస్కృతి-
నదివెంట పల్లెజనం , నదిఒడిలో గ్రామం

నది ఒడ్డున నిల్చుని ఒంటరిగా
నదిలోతులని పాదాలతో కొలవలేక
ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు
          నది అమ్మలా పలుకరిస్తుంది.
        2
నదిని కార్తీకదీపాలతో అలంకరిస్తే
పున్నమి అద్దంలో  దీపాల పట్టుచీరతో
అమ్మలా, దేవతలా గుండెలో నిండిపోతుంది

నది నాఆత్మ ,నది నా బాల్యం
ఇసుక తనువులో చిన్నతనం
అమ్మమీద అలిగి నదిగట్టుమీద కూర్చుంటే
అలలరెక్కల మీద నీటిపిట్టలని పేర్చీ నవ్వించేది
తోటలోని పిల్లగాలిని పిలిపించి
        ముంగురులను సవరించి మురిసిపోయేది.

నదిలోకి చేపపిల్లలా జారుతే
వెచ్చగా కౌగలించుకునేది
అలల సంగీతంలో మునిగిపోయి
గొంతులో్కి పాట వుబికి నదినంతా నింపేస్తే
            నది నవ్వేది అమ్మలా-

రుతువుల చీరకోంగులో పల్లెని దాచుకున్న నది
పగలు రాత్రీ  వెంట వెంట నడిచీ
 మంచుదుప్పటి పక్కకిపెట్టీ ఏడారి ఆత్మలానిల్చుంది.
ఇసుక మేటలు వేడిగాలులు-

పల్లెమీద అలిగి దూరంగా జరిగి
తనకుతానుగా నిశ్చలంగా పాయలా పారుతుంటే్
వర్షపు గొడుగులేక మండుటెండలొ నిల్చునట్లుంది!
ఇసుక గొంతులో నీటిచెలమల తడి
                            పల్లె  దాహంతీరుస్తూ.

ఆ ఊరి పడవ ఈ ఒడ్డుకి చేరలేక  ఊగుతోంది
చిన్ని అలలకి చిరుమువ్వలా శబ్ధంచేస్తూ-

ఆకులు రాల్చిన తోట  ధ్యానంలొంకి వెళ్ళిపోయింది
నదితొ పాటుగా నేను  ఎప్పటికప్పుడు కొత్తదాన్ని-
పరీక్షీస్తూ నదిలొకి  ప్రవే్శిస్తూ వుంటాను.

ఒక కొత్త వేకువలో
కోకిల గొంతువిడి తోటతలుపులు తట్టీ
నదిలోపలికి  పాటల చిరుజల్లు కురిపించగానే
వేకువ దిగంతాలను చుట్టీ లోకం చెవులలొ ఒదిగి
నిశ్శబ్ధాన్ని చేధించి నిద్రలేపింది.

ఉగాది  కొత్త, జీవితం పాతది అనుకుంటూనే      -
ఇక్కడికి వచ్చిన ప్రతీసారీ  ప్రేమతో పలుకరిస్తూ
ఇంటిగుమ్మంలో ఎదురు చూసే నాన్న, అమ్మ
మామిడి చెట్టునీడలా అనిపిస్తారు

ఇప్పటికీ  ఆ పొదరింట్లో వాళ్ళనీడలో
మనసునిండా అ జ్నాపకాలు నింపుకుని
నీకోసం వచ్చాను  ఏకాంతం కోరుకుంటూ
నీతీరంలో వినిపించే నీ ఆప్యాయత, కొత్త ఉత్సాహం

మళ్లీ నగర ప్రపంచంలోకి పయనమవ్వాలి
ఈ వేకువలు,సాయంకాలాలు,వెన్నెలరాత్రులు
కొంగులో మూటకట్టుకుని-
ఇసుకపొరల్లొ నన్ను నేను దాచుకొని వెళుతున్నాను

నిన్నువిడిచి వెళ్ళలేని తనంలో,
ఇప్పుడిప్పుడే నేర్చుకొన్న చిత్రకారుడి చిత్రలేఖనంలా
నీ తనువుని చిత్రించడానికి ప్రయత్నిస్తూ-
మిగిలిపోయాను ఒక కొండ, ఒక కోన చిత్రిస్తూ
మళ్ళీ గుర్తుకొచ్చింది నిన్ను చిత్రంగా మలచుకుంటే
నీ ఒడిలో్కి రాలేనని
అందుకే ఒదిలి వెళ్ళిపోతున్నాను

నన్ను నా గుర్తులని
నాభావాల  స్పర్సలు  అనుభవించినందుకేమో
                                    నదికన్నులో నీటితడి....!





























1 comment: