నన్నుఎత్తుకుని లాలించిన
చేతులనుండి గాజులు,
చేతులనుండి గాజులు,
పడుకోపెట్టి నలుగుపెట్టి స్నానం చేయించిన కాళ్ళనుండి
కడియాలు వాటాలు పంచుకున్నాక.
అమ్మ వెళ్ళిపోయింది .
ఎవరికీ అక్కరలేని సందుగపెట్టె మాత్రం మిగిలిపోయింది
పాతవాసనలతో రంగువెలసిన చెక్కపెట్టె ,
అపురూపాలనుండి విడిపోయిన శరీరంలా
పాతసామానుల కొట్టులోకి జ్ఞాపకంలా వెళ్ళిపోయింది.
ఇంకాఏమైనా మిగిలిపోయాయా?
సందేహాలతో సందుగ కిర్రుమని తెరుచుకుంది
మాడిపోయిన జరీతో పెళ్లి పట్టుచీరలు
వాడి రాలిపోతున్నమొగలిపొట్టలు
కరిగిపోతున్న కర్పూరదండలు
ఎప్పుడో నాన్నరాసిన పీలికలైన ఉత్తరం...
అమ్మగుండె సందుకలో రెపరెపా కొట్టుకుంది..
ఆమె జ్ఞాపకం సూదిమొనలా గుచ్చుకుంది
ఏనాడు అమ్మను ఆప్యాయంగా పేరుపెట్టి పిలవలేదు నాన్న-
''ఏ మే' ,'ఒసే '' అధికారాల అహంకారాలే తప్ప
ఆ పిలుపులలో తన అందమైన పేరునే మరచిపోయింది
శుక్రవారంనాడు నానుతాడు పెరిగిపోతే
బాధపడే అమ్మకి,వెటకారం! వేళాకోళం!
నేను పోయాక దిబ్బరొట్టె వేసుకో!
ఉచితసలహాలు పారేసిన నాన్న-
కూరలో ఉప్పు ఎక్కువైతే
ముఖంమీద పళ్ళాలు విసిరేసినా
ఉప్పు సరిచూసుకున్నాను కానూ-అనుకునే అమ్మకి
అభిమానాలు ఆప్యాయతలు పంచిఇవ్వడమే తెలుసు
పెట్టెమూసేసినా చిత్రమైన స్థితి
మరొకసారి ఇప్పుడు మళ్లీ అమ్మని చూడాలని కోరిక -
వాస్తవికతకు దూరంగా నిల్చుని కుమిలిపోయాను .
మేనాలో పెళ్లికూతురిగా అమ్మఫోటో చూస్తూ అనుకున్నాను
గతానికి దగ్గరగా నిల్చున్నానా..?
*.*
*.*
చెమర్చిన కళ్ళతో అక్షరాలు అల్లుకుపోయినట్టు కనిపిస్తున్నాయి.... జ్ఞాపకంలాగే ......
ReplyDelete