పృథ ఒక అన్వేషణ గురించి కవితా ఓ కవితా శీర్షిక లో Anil Dani నేను పృథ గా మారిపోయి రాసాను అన్నాడు, నిజమే
నా బాధని అర్ధం చేసుకుని సమీక్ష చేసాడు.. నిజానికి పుస్తకం
ఆవిష్కరణ రోజు సభలో మాట్లాడాలి అనేక కారణాల వలన రాలేకపోయాడు.. అయినా ఇన్ని నెలల తరువాత
మనసు పెట్టీ రాసినందుకు అనీల్ ధన్యవాదాలు...
కవితా... ఓ...కవితా.... 63
--- అనిల్ డ్యాని
పాదాల క్రింద నలిగిన ఆమె..
ఒక భూమి... ఒక ఆకాశం....
రేణుకా అయోలా కవిత్వం రాశారు, కథలు రాశారు, ఎన్ని చేసినా , ఏం రాసినా ఇంకేదో రాయాలనే కోరిక తనలో బలంగా నాటుకు పోయింది. ఆమె లోపల అంతర్మథనం ఆమె తో పాటు పెరిగిపోయింది. ఎక్కడైనా ఏదన్నా వాక్యం కనబడినా ఆ వాక్యం తనలో ఉండే రాయాలనే తపనకి కాస్త నచ్చినది ఏదైనా అంకురార్పణ అవుతుందా అని చాలా గాలించారు.. ఆమె కవిత్వాన్ని వెతుకుతుందా...? ఆమె కథలో సేదదీరాలి అనుకుంటుందా..? ఆమె ఆమెలో ఉండే ఇంకో ఆమెని ప్రపంచానికి చూపాలి అనుకుంది.. అప్పుడు దొరికింది ఓ సముద్రం.. అదే భైరప్ప గారు రాసి గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారు తెలుగులోకి అనువాదం చేసిన కన్నడ నవల " పర్వ". ఆమె ఆ పుస్తకంలోకి మారిపోయింది. ఆమెకి ఆమె దొరికే పాత్ర ఒకటి కనబడింది. కొన్నాళ్ల పాటు ఆమె "పృథ" గా మారిపోయింది.
కుంతీ కుమారీ తన నోరు జారీ రాసింది ఒక భారతం అని సినిమా పాట కూడా ఆమె పాత్రని నిందిస్తూ చరిత్ర మరిచి పోయి మాట్లాడుతున్న తరుణంలో రేణుక ఒక కొత్త పృథ ని మన మధ్య నిలబెట్టి ఆమెని కొత్తగా ఆవిష్కరించారు.
ప్రముఖ కన్నడ రచయిత ఎస్ ఎల్ భైరప్ప రాసిన పర్వ మహాభారతాన్ని కొత్తకోణంలో చూపెడుతుంది.ఇప్పటికి ఈ పుస్తకం చాలామంది ఫెవరెట్. అందులోనుంచి కుంతీ ని మాత్రమే తీసుకున్నారు, చారిత్రాత్మక పురాణ పాత్రని దీర్ఘ కవిత గా మార్చడం అంత సులువైన పని కాదు. అసలే మనకి భక్తి అంటేనే ఎలాంటి ఖర్చు లేకుండా మనోభావాలు దెబ్బతినే ఈ కాలంలో రేణుక చాలా మొండిగా ఈ కావ్యాన్ని రాసే పనిపెట్టుకున్నారు. నిన్నటి విషయాలే ఈరోజు కే మారి వినబడుతున్న రోజుల్లో అసలు జరిగిందో లేదో తెలియని ఒక కాల్పనిక కథనం లోని ఒక పాత్రని తీసుకుని అందులో గుణగణాలు వర్ణించడం వాటిని ఈనాటి స్త్రీలకు అన్వయించి చర్చకు పెట్టడం అనేది రేణుక అయోలా చేసిన ధైర్యం.
తొమ్మిదో పేజీలో మొదలై ఎనభై నాలుగో పేజీలో ముగిసి పోతుంది ఈ పృథ కథ.అంటే మొత్తం గా డెబ్భై అయిదు పేజీల్లో ద్వాపరయుగంలో జరిగిన ఒక స్త్రీ జీవితాన్ని మన కళ్ల ముందు నిలబెడుతుంది రచయిత్రి. స్త్రీకి మనసు ఉంటుంది కానీ వయసు పెరిగే కొద్దీ సమాజం ఆమెమీద ఆంక్షలు విధించడం వల్ల ఆమె తనను తాను పట్టించుకోవడం మానేసి మెల్లిగా మరొకరి మీద ఆధారపడి బతకడానికి అలవాటు పడిపోతుంది. తనపేరే తాను మర్చిపోయిన ఇల్లాలి వ్యధని పి.సత్యవతి గారి కథ ఇల్లలకగానే అనే కథ ని యావత్ దేశం అంతా మా కథే అనుకున్నారు అంటే ఈ దేశంలో స్త్రీ ల ఉనికి ఎలావుందీ అనే ఒక స్పష్టత వస్తుంది.అలాంటి ఇంకో కథ మన పురాణాల్లో రేణుక గారికి దొరికింది.
అంటే ఆనాటి నుంచి ఈనాటికి మనకి పరిస్తితుల ప్రభావాల్లో వచ్చిన గణనీయమైన మార్పులు సున్నా .
ప్రారంభం ఆ వాక్యాలతోనే మొదలు పెడుతుంది కవయిత్రి.
" ఎప్పటికప్పుడు
ఎంతో తేలికగా ఒక నింద
వాళ్ళమీద వాలుతూ ఉంటుంది
ఎవరిదో ఒకమాట వీపుమీద అద్దానికి తగిలి
ముక్కలవుతూనే ఉంటుంది
వందలు వేలుగా ఆమె ముఖం
చరిత్ర రహదారి లో నాపరాళ్లుగా
పరచబడుతూనే ఉంటుంది."
దీర్ఘ కవితలో వస్తువును దాచి పెట్టే వీలు ఉండదు. ఒకే వస్తువును రాస్తూనో, లేదా కథలా చెప్పుకుంటూ పోవడం వల్ల దాని మీద పాఠకుడికి ఇష్టం పుట్టించడానికి భాగాలుగా విభజించి లీనమయ్యేలా చేయడం దీర్ఘ కవితలో ఒక పద్ధతి అనుకుంటాను నేను. అయితే రేణుక మాత్రం ఆఖరుగా రాయాల్సిన మాటలు ముందుగానే చెప్పి లోపల ఇంకేం చెప్పారో అనే ఒక కుతూహలం కలిగించారు. అదే ఈ పృథ విజయానికి నాంది. ఏమి మారాలని మనం కోరుకున్నామో అది ఆ కాలంలో నుంచి ఎలా మారకుండా అలాగే ఈ తరానికి వచ్చేసిందో చాలా వివరంగా చెబుతారీ రచయిత్రి.ఒక రకంగా దీర్ఘ కవితల ఒరవడిలో పృథ ని కొత్త శైలిలో రాశారు అని చెప్పొచ్చు.
కుంతీదేవి మహాభారతంలో పాండవుల తల్లి. పాండురాజు భార్య. యాదవుల ఆడబిడ్డ. వసుదేవుని చెల్లెలు, శ్రీకృష్ణుని మేనత్త. ఆమె అసలు పేరు పృధ. కుంతిభోజుడనే రాజు సంతానము కనుక అందుచేత ఈమెకు కుంతీదేవి అనే పేరు వచ్చింది.
కుంతీదేచి చిన్నతనంలో దుర్వాసుడు ఆమెకు ఒక వరం అనుగ్రహించాడు. ఈ వరం ప్రకారం, ఆమె తాను కోరుకున్నప్పుడు ఏ దేవుడైనా ప్రత్యక్షమయ్యి వారి వలన ఆమెకు సంతాన ప్రాప్తి కలిగేలా ఒక వరం ప్రసాదించాడు. ఆమె వరం నాకెందుకు ఉపయోగపడుతుందని అడగగా భవిష్యత్తులో అవసరమౌతుందని బదులిస్తాడు.ఆ వరం వల్ల ఆమె పాండవుల తల్లైపోతుంది. ఇది స్థూలంగా కథ. ఇది చాలామంది పుక్కిట పురాణం అని వదిలేయవచ్చు, దీన్ని గురించి మాట్లాడ్డం అనేది సమయ హరణం అనే నిందనూ వేయవచ్చు కానీ రేణుక చెప్పదలుచుకున్నది ఈ కాల్పనిక కథ వెనకున్న స్త్రీ అంతరంగాన్ని .కవితా రూపంలో మన ముందుకు తీసుకు వచ్చి తరతరాల స్త్రీ వేదనను మన కళ్ళముందు కు తీసుకు రావడం ఆమె ప్రధాన ఉద్దేశం గా కనబడుతుంది.
తండ్రి పెళ్లి చేసేశాడు, నాన్న మాట జవదాటారాదు పెళ్లి అయిపోయింది. పాండురాజు షండుడు.సంసారానికి పనికిరాడు. ఆ విషయం తెల్సి కుంతీ తల్లడిల్లిపోతుంది పైగా అప్పటికే "మాద్రి" బహిష్టు వార్తలతో గుసగుసలు పోతున్న రాచరిక వీధులు కుంతీ వార్త తో మళ్ళీ గుసగుసలు పోతాయి. ఇక్కడ రచయిత్రి చాలా గొప్ప మాటలు రాశారు.
" సరే
ఆడది పెట్టిన భిక్షకి
ఒక రాజు దీపమై వెలిగాడు
కానివ్వండి..."
అని పాండు రాజు చేతకాని తనానికి బలైపోయిన ఆనాటి స్త్రీల గురించి ఈమె మాట్లాడుతుంది. ఈ నష్టం వీరుణ్ణి ఏం చేసుకోవాలి అని ప్రశ్న వేస్తుంది. శృంగార ఆర్భాటాలు వలవేసిన ఈ వీరుడి సంకెళ్లు ఎలా తెంపుకోవడం అనే పృథ అంతర్మధనాన్ని రేణుక చాలా గొప్పగా రాశారు. ఒక పక్క కోట గదులన్ని రాణీ వాసపు వైభవాన్ని చూస్తుంటే లోపల రాణులు మాత్రం పాండు రాజు అహాన్ని ప్రశ్నించి నందుకు దెబ్బలు తో అలరారుతున్నారు. ఏది ఏమైనా కోటలో రహస్యం బయటకి పొక్కరాదు కదా..
ముని ఇచ్చింది వరమో శాపమో అర్ధం కాని పరిస్థితి లో ఉన్న కుంతీ ఒకనాడు భర్తతో నాదగ్గర ఏదీ దాచలేవు , నువ్వు ఎంతమంది ఆడవాళ్ళతో రమించినా వాళ్ళ నెలసరి ని ఆపే శక్తి నీకు లేదు అని గట్టిగా నిలదీసింది, ఆ సమయంలో పాండు రాజు గురించి ఆమె ఇలా అంటుంది.
" బాతు రెక్కలతో ఆకాశాన్నీదే రాజా
ఎన్నో రాత్రుళ్లు తీరం చేరని అరణ్యాలయ్యాక
పొడి మేఘాలకి ఎంత రాపిడి కలిగించినా
నిప్పులే కానీ నీళ్లుండవు" . గంగాద్వారాలు ఎన్ని గెలిస్తే ఏముంది రాజా.. పక్కనే ఉన్న ఆడదాని దాహన్ని తీర్చలేవు కానీ సంతానం కోసం యాగాలు, యజ్ఞాలు చేస్తే మాత్రం ఉపయోగం ఏముంటుంది అని కన్నీళ్లు తో మాట్లాడిన పృథ మనకి ఈ పుస్తకం లో దర్శనం ఇస్తుంది.
" రాజ్యాధికారాల మీద
అహంకారాల మీద ఉమ్మివేయాలి
నియోగం పేరుతో పర పురుషులని తార్చే
తార్పుడు గాళ్లని సమాధి చేయాలి
స్త్రీల ఒంటి మీద పతివ్రత సాద్వీమణి
పచ్చ బొట్లు వేసే వాడి కాళ్ళు చేతులు కట్టేసి
గాలీ, వెలుతురు లేని గుహలోకి నెట్టేయాలని
ద్వేషం, అసహనం అసహ్య సరోవరంలో
అగ్నిపూల తెప్పతో ఈదుతుంది "
ఈ వాక్యాలు మొత్తం కుంతీ ఆలోచనలు ఎలాఉన్నాయి అని రచయిత్రి తర్జుమా చేసి చెప్పడం లో సఫలం అయ్యారని చెప్పొచ్చు. నిజానికి ఇది అంత త్వరగా అర్ధం కాని విషయం . అనుభవాన్ని చెప్పడం వేరు, వేరే వాళ్ళ జీవతానుభనాన్ని మనం ఆకళింపు చేసుకుని రాయడం వేరు. దాన్ని చాలా సులువుగా దాటేశారు రేణుకా.. మధ్య మధ్యలో ఆమె కుంతీ జీవుతాన్ని వర్తమనానికి కనెక్ట్ చేసే నేపద్యంలో వాడిన కొన్ని మాటలు మనకి అలా ఎప్పుడూ గుర్తుండి పోతాయి. మగ అహంకారపు చేష్టలు స్త్రీ జీవితం మీద ఎంత ప్రభావం చూపిస్తాయో ఆ అంశాలని ఆవిడ ఎక్కడా వదలకుండా రాశారు.
" ఇష్ట పడితే లాక్కోవడానికి
పరిమితులు హద్దులు ఉండవు
అడిగేవాళ్ళు, ఓదార్చే వాళ్ళు ఎవ్వరూ ఉండరు.
అంతా బాహాటంగా కొనుగోలు అయిపోతుంది. "
ఇప్పటికి మనం పెళ్లి లో ఆడపిల్ల ఇష్టా ఇష్టాలతో సంబంధం లేకుండానే పెళ్లి చేసేస్తున్నాం , అవి ఎలా వికటిస్తున్నాయో చూస్తూ కూడా మనం ఆడపిల్లల మనసు తెలుసుకోకుండా ఇంకా వాళ్ళని మనం ఏదో తెలియని రొంపి లోకి నెట్టేస్తున్నాం. ఇప్పటికి భర్తల ముందు నోరు తెరవడానికి కూడా భయపడే స్త్రీలని చూస్తున్నాం. ఎదిరించలేని స్వభావంతో రోజూ చస్తూ బతికే మాద్రి లు ఇంకా మనముందే ఉన్నారు కదా. కానీ మన కళ్లకి కనబడరు కనబడినా సర్ది చెప్పుకోవడానికి మనదగ్గర పాండు రాజు దగ్గర ఉన్నట్టు బోలెడు కారణాలు ఉంటాయి. మాటవినకపోతే అవమానాలు, అక్రమ సంబంధాలు అంటకట్టే ప్రక్రియ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దర్జాగా చెలామణి అవుతూఉంది. అదే రేణుక అడుగుతారు
" ఏ యుగంలో అయినా ఆడపిల్లలకి అవకాశాఉండవా?
వొద్దు కావాలి రెండు మాటలకి చోటెక్కడ ఉంది?
దూది బొమ్మనైనా అలకరించితే చాలు కదా
కింద పడేసి ఆక్రమించుకోవడానికి
బూతులతో నోట్లో చప్పరించుకోవడానికి
సిద్ధంగా ఉండే మగ సామ్రాజ్యం ఇది"
అని కళ్లెర్ర చేస్తారు రేణుక.
బయట ప్రపంచానికి తెల్సిన కొడుకులు పాండవులు, కర్ణుడు తనకి మాత్రమే తెల్సిన కొడుకు జీవిత కాలం తాను అనాథను అని చెప్పుకు తిరుగుతూ తనకళ్ల ముందే యోధుడై యుద్ధం చేస్తుంటే కన్న తల్లిగా మనసు ఉప్పొంగాలి కాని కుంతీ తనలో తనని దహించి వేస్తున్న అంతర్మధనాన్ని ఆపుకోలేక పోయింది.కానీ బయటకు చెప్పుకోలేదు.
" ప్రపంచ సౌందర్యంలో
స్త్రీ దేహానికే మరక అంటుకుంది
తవ్వి తవ్వి బయట పడ్డ పుర్రెలకి
వ్యభిచారి అనో హాంతకి అనో
పతివ్రత అనో బిరుదులుంటాయి." ఇది కదా పృథ ది ఆమెలాంటి ఆడవాళ్ళది అనిపిస్తుంది. ఈ దీర్ఘ కవితలో చాలా భాగం స్త్రీ అంతర్వేదన కనబడుతుంది. శరీరానికి లోపల ఉండే మనో ధైర్యానికి, మధ్య నలిగే ఒక మహిళ అంతరంగపు క్షోభ అనొచ్చు. ఆనాటి పరిస్థితుల్లో వరం వల్ల అయినా పిల్లల్ని కని పాండు రాజు పేరు చరిత్రలో నిలిచిపోయేలా చేసింది కుంతీ కానీ ఆ మొత్తం పనిలో తనని తాను పోగొట్టుకుంది. ఈనాటి స్త్రీ అదే పని చేస్తే ఆమెకుండే బిరుదులు ఏమిటీ..? కుంతీ కుమారులని ఆరాధించే చరిత్ర వర్తమానపు కుంతీ గురించి ఆలోచనే చేయడం లేదు. అందుకే పృథ కట్టుకథ కాదు. చరిత్ర లో పురుష పాత్రలే కాక అన్యాయం కాబడిన స్త్రీ పాత్రల చుట్టూ ఉండే బాధని పట్టుకుని మళ్ళీ సరికొత్త భాష్యం రాశారు రేణుక. బహుశా తెలుగు సాహిత్యం లో ఇది ఒక స్త్రీ కవయిత్రి చేసిన ప్రయోగం గా చెప్పొచ్చు. అది సఫలం అయింది.
చాలా గొప్ప ప్రయత్నం చేశారు రేణుక. ఎత్తుగడ నుంచి ముగింపు దాకా ఎక్కడ పాఠకుడు పక్కకి తప్పుకునే అవకాశం లేని భాషని వాడారు. అక్కడక్కడా మధ్యలో ఆమె కాస్త వచనాన్ని ఆశ్రయించారు. అది సహజం కుంతీ బాధని తర్జుమా చేసే క్రమంలో ఆ బాధాతప్త హృదయాన్ని వర్ణించాలంటే మాటలు చాలవు కదా. చాలా చోట్ల కుంతీ విరహ వేదనని రేణుక ఎక్కడ బ్యాలన్స్ తప్పిపోకుండా రాశారు. అది చెప్పుకుంటే తీరే బాధ కాదు, అక్షరాల్లోకి ఒదిగే మెత్తటి సందర్భమూ కాదు అందుకే రేణుక దీన్నిఒక అన్వేషణ అన్నారు. ఎక్కడికి ఈ అన్వేషణ ఆమె కి కావాల్సిన తీరం వైపా.. ఆమెకి ఆమె దొరికే ఒడ్డుకా.. ఆమెలా ఇంకొకళ్ళు మారకూడదు అనే తెగింపు లోకా ఈమె అన్వేషణ అనే పాయింటు మనల్ని చాలా దూరం ఆలోచన చేసేలా చేస్తుంది. కుంతీ తర్వాత గుర్తుండిపోయే మరో పాత్ర ద్రౌపతి. కుంతీ తల్లయితే ద్రౌపతి భార్య. తరానికి తరానికి మధ్య ఉండే బాధలో కేవలం స్త్రీ పావు మాత్రమే అని ఈ పృథ చెబుతుంది మనకి.
ఇప్పుడీ అన్వేషణ అవసరమా అని రాసిన పి.జ్యోతి గారి ముందు మాటలు ఆలోచింప జేస్తాయి. వాసుదేవ్, రాజారాం , శ్రీరామ్ లు రాసిన మాటలు రేణుక రచనా శైలిని పట్టిస్తాయి. రేణుక గారు గొప్ప కవయిత్రి అనడంలో సందేహం లేదు. ఈ పృథ రాయడం వల్ల ఆమె ఇంకో మెట్టు ఎక్కారు. వాస్తవిక కోణంలోనుంచి రచనలు చేసే స్త్రీ వాద కవయిత్రిగా మనం రేణుక గారిని ఈ పుస్తకంలో చూడొచ్చు. ఆమె అందరి స్త్రీల అస్థిత్వాలకి సంబంధించి ఈ పుస్తకం లో చాలా ప్రశ్నలు వేశారు. అవి ఒక్క తెలుగు నేలకు మాత్రమే ఆగిపోకూడదు.ఇతర భాషలకు కూడా అనువాదం అయితే బాగుంటుంది. పృథ భారతీయ స్త్రీ పాత్ర కాదు అనేక
పాదాల క్రింద నలిగిన ఆమె..
ఒక భూమి... ఒక ఆకాశం....
పుస్తకం కావాలంటే రేణుక గారిని అడగండి.
1Rajaram Thumucharla
No comments:
Post a Comment