పృథ దీర్ఘ కావ్యం ఎంతో ఇష్టంగా రాసాను మధన పడ్డాను
ఇవాళ దాట్ల Datla Devadanam Raju గారు మనసుపెట్టి
రాసిన ఈ సమీక్ష నీ చూసాక చాలా సంతోషం వేసింది
దేవదానం రాజుగారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు..
Datla Devadanam Raju is with Anil Dani and 10 others.
అంతరంగం లోకి లోతుగా తొంగి చూడటం కూడా ఒక అన్వేషణే
రేణుక అయోల ప్రయోగశీలి. కవిగా తీసుకున్న ఇతివృత్తాలు ప్రత్యేకమైనవి. అందులో ‘పృథ’ దీర్ఘకవిత లో ఒక పురాణ పాత్రను తీసుకుని పరిశోధించి రాయడం ఆ కథకే పరిమితమవ్వడంగా అనుకోను. వర్తమాన స్రీ జీవితాల్లో సంకల్పితంగా మోస్తున్న ఒకానొక ఆవేదనను చిత్రించడంగా భావిస్తాను. అణచివేతకు గురైన ఆడవాళ్ల భాష, ఆలోచనలు, అనుభూతులు గురించి రాయడమంటే తిరుగుబాటు చేయడం తప్ప మరొకటి కాదని ప్రసిద్ధ రచయిత ఓల్గా అన్నారు. సీత, మండోదరి, శూర్పణక, అహల్యల అంతరంగ కథనాల్ని స్వతంత్ర భావనలతో ఆలోచించే విధంగా ఓల్గా అద్భుతమైన కథలే రాశారు.
డా. ఎస్. ఎల్. భైరప్ప ‘పర్వ’ చదివినపుడూ ఇతరులచే చదివించినపుడూ అమితానందం పొందాను. నాకెన్నో ప్రశ్నలకు సమాధానాలు అందులో దొరికాయి. ఆ కథ అసలు జరిగుంటే అచ్చం ఇలాగే జరిగుంటుందనీ సంవత్సరాల తరబడి ఎంతో పరిశోధన చేసి భైరప్ప రాయడం వల్ల ‘పర్వ’ అంత గొప్పగా ఆకట్టుకుందని అనుకుంటున్నాను. రేణుక అయోల ‘పర్వ’ను ప్రేరణగా రాశారని చెప్పడంతో మరింత ఆతురత పెరిగింది. దీర్ఘకవిత శీర్షిక అలా కాకుండా ఆత్మగౌరవ ప్రతీకగా ఉంటే బావుండేదనిపించింది. పేరును బట్టి కొంతకాలం మరికొన్ని ప్రయాణాల వల్ల మరికొంత కాలం చదవడం ఆలస్యమైంది. చదవడం మొదలెట్టేక ఏకబిగిన చదివేను. ఎందుకంటే ఫలానా కుంతి కథ అని తెలిసాక చకచకా సాగిపోయింది. తెలుసున్న జీవితాన్ని దగ్గరగా చూస్తున్నట్లుగానే ఉంది. ఏదో కొండగుర్తుగా కుంతి, మాద్రి లను తీసుకున్నారు గానీ నిజజీవితంలో ఎదురుపడే అనేకమంది స్రీల స్వభావాల్నే చిత్రించినట్టుగా అనిపించింది.
చరిత్ర జాతరలో వంశం కోసం తెచుకున్న బలమైన పెయ్యి దూడలు ఆడవాళ్లు. సంతానోత్పత్తి తద్వారా వంశోద్ధారకుని కోసం వెంపర్లాటను సూచించడానికి పెయ్యదూడల పోలిక. ముడికట్టిన జడలు పీచులా బిగుసుకున్న గెడ్డం విల్లులా వంగిన శరీరం గల ఆ రుషికి సేవ చేయాలి. ఎక్కడెక్కడో తిరిగొచ్చే మట్టి పాదాలను కడగాలి. ఎంతటి దుర్భరమైన సేవ...జుగుప్స కలిగించే ఆకారం? ఎవరిని తలుచుకుంటే వారు ప్రత్యక్షమౌతారు. ఇదొక వరం? అలాంటి వరం ఇవ్వాలని ఎందుకనిపించిందో? సూర్యగ్రహం యోజనాల దూరంలో ఉంది. గ్రహం మనిషి వేషం వేసుకుని వరంతో దిగొస్తుందా? కాంతి వేగం పయనించి వచ్చాక ‘ నీ దేహం నా బీజం మోయాల్సిందేనని వయసుని అనుభవించే ఆనందంతో వచ్చినవాడు బెదిరే కళ్లని చూడలేదు అసహాయతని భయాన్ని సరదాగా తీసుకున్నాడు. తండ్రి ఎవరంటే మండే సూర్యుడ్ని చూపించాలి. మొగుడనేవాడు అశక్తుడై నువు సరైన ఆడదానికి కాదంటే వచ్చిన తిప్పలు ఇవి. పోనీ మరో ఆడది శృంగార పౌరుషంతో సుఖపడిందా?
దూది బొమ్మనైనా అలంకరించితే చాలు విరిచేయడానికి రెండు చేతులూ మీద పడేసి ఆక్రమించుకోడానికి సిద్ధంగా ఉండే మొగ సామ్రాజ్యం ఇది. నాకొక కొడుకును కని ఇవ్వమని కొండ దిగి వచ్చే బీజ దాతలతో ఎలా నడుచుకోవాలో చెప్పడం కూడా ఉంది. బీజం నాటించుకుని కడుపు పండగానే వాడు పితృసమానుడిగా అనుకోవాలట. నియోగం పేరుతో తార్పుడు వ్యవహారమే ఇదంతా. కొండ దిగి వచ్చిన వైద్య దేవుళ్లు మాద్రికి బీజాలు అంటించారు. మొత్తమ్మీద అణచి పెట్టుకున్న భావాల్ని ప్రదర్శించడానికి చాలా ధైర్యం కావాలి. జీవితాల్ని నియంత్రించవచ్చు మనసులను కాదు. జీవితం ముగిసిందీ లేదు బతికిందీ లేదు కేవలం సమాధి కట్టబడిరది. నిజానికి వరం అనుకుంటే అది దుఃఖ కారణం కాకూడదు కదా. ఈ అన్వేషనంతా పురుషంకారపు నీడలో తను పోగొట్టుకున్న సొంత ఉనికిని వెతుక్కోవడం కోసమే.
రేణుక అయోలా వస్తువు దృష్ట్యా ప్రయోగం చేయాలనే కుతూహలం ఈ కావ్యం రాశారు. గతంలో పెద్దగా ఎవరూ స్పృజయించని మూడోమనిషిని ఆవిష్కరించారు. పురాణ పాత్రల్ని నిశితంగా పరిశీలిస్తే తప్పకుండా కొన్ని ఖాళీలు కనిపిస్తాయి. ఆనాటి సమాజానికి నేటి సమాజ తీరుతెన్నులకు జీవన విధానానికి వేయి రెట్ల తేడా ఉంటుంది. వాటినే ప్రామాణికంగా తీసుకోవడం ఆదర్శంగా మలుచుకోవడమంత వృధాప్రయాస మరొకటి
ఉండదు.
కుంతి, మాద్రిల అంతరంగ చిత్రణను తనదైన శైలిలో రేణుక ఆవిష్కరించారు. ఇట్టాంటి పాత్రల చిత్రణ చేయాలంటే వాటిలో నిమగ్నమవ్వడం లేదా పరకాయప్రవేశం చేయాల్సి ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే పేలవంగా తయారవుతుంది. కాలం అనేక విశ్లేషణలకు ఆస్కారం ఇస్తుంది. అనేక ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోమంటుంది. కొందరు సృజనకారులు బాధ్యత తీసుకోవాలి. ఇపుడు ఆ బాధ్యతను రేణుక అయోలా తలకెత్తుకోవడం సంతోషించదగ్గ విషయం. రేణుక అయోలా పురాణ పాత్రకు పునర్వ్యాఖ్యానంగా నేటితరం వారికి అన్వయం చేస్తూ తన ప్రణాళికను దిగ్విజయంగా పూర్తి చేసి ఫలవంతమైన దీర్ఘకవితను అందించారు. ఇందులో రాసిన భావాలు కేవలం నా అభిప్రాయం లోంచి వచ్చినవనిగా గమనించగలరు. రేణుక గారికి అభినందనలు. పుస్తకం పంపినందుకు ధన్యవాదాలు--
No comments:
Post a Comment