2019లో వచ్చిన "ఎర్రమట్టి గాజులు " పుస్తకం మీద ఇవాళ
కవితా వరణంలో పలమనేరు బాలాజీ గారు అందించిన సమీక్ష చూసుకున్నాక చాలా అనందం వేసింది... చక్కటి సమీక్ష ని అందించిన బాలాజీ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు...
కవితావరణం(69): పలమనేరు బాలాజీ,9440995010.
"మార్పును కోరేదే మంచి కవిత్వం "
యుద్ధం లాంటి, శాంతి లాంటి, ధ్యానం లాంటి ఏకాంతం లాంటి, మౌనం లాంటి కవిత్వం.. మనసును ఇట్టే ఆకట్టుకుంటుంది.
నిజానికి మంచి కవిత్వానికి మంచి కాలం ఇది. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పాఠకులు కవిత్వాన్ని అకవిత్వాన్ని వేరు వేరు చేసుకుంటూ వస్తున్నారు. ఎవరో చెప్పారని ఎవరు నమ్మటం లేదు. ఎవరో చెప్పారని ఎవరూ ఇష్టపడటం లేదు. ఎవరికి వాళ్లు పాఠకులు తమంతట తాము కవిత్వాన్ని తూకం వేసుకుంటున్నారు. కవిత్వం నాణ్యతను లోతుగా పరీక్షించుకుంటున్నారు. మంచి కవిత్వాన్ని ఊరేగిస్తున్నారు. అందుకే మంచి కవులకు ప్రపంచం నలుమూలలా ఎందరో అభిమానులు.!
దేశ విదేశాల్లో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న మంచి కవులలో రేణుక అయోల ఒకరు.
"పడవలో చిన్ని దీపం"(2012), లోపలి స్వరం మూడవ మనిషి, ఎర్ర మట్టి గాజులు ఆమె కవితా సంపుటాలు." రెండు చందమామలు"ఆమె కథా సంపుటి (2008).
మనుషులు, మానవ సంబంధాలు అనుబంధాలు, జ్ఞాపకాలు, దుఃఖభరిత సందర్భాలు, ప్రకృతి ,మౌనం ధ్యానం, ఆధ్యాత్మికం, స్త్రీల హక్కుల పట్ల పోరాట స్వరం.. ఈమె కవిత్వంలో అన్నీ ఉన్నాయి.
రేణుక అయోల గురించి ఇప్పుడు కొత్తగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. సుదీర్ఘమైన సాహితీ ప్రయాణంలో ఆమె ఎందరో పాఠకుల విమర్శకుల ప్రశంసలు పొందింది.ముఖ్యంగా సున్నితమైన వస్తువులను, సున్నితమైన సందర్భాలను, సున్నితమైన మానవ సంబంధాలను ఆమె కవిత్వీకరించిన తీరు అపూర్వం.
*
నేను ప్రకృతిని
- రేణుక అయోల
కొన్ని ఏళ్లుగా మోసిన నీళ్ల కావిడి గుర్తులు
కనిపించకుండా నువ్వు వేసిన పచ్చబొట్టు
రంగురంగుల నెమలి కన్నుల చిత్రం
భుజాలమీద పుట్టమచ్చ...
ఓ శిల్పీ...!
రాత్రి పగలు నువ్వు ఉలితో చెక్కి పగులగొట్టి
రాయిని ఏరి మలిచి శిథిల పరిచిన శిల్పం
సగం సగం దేహంతో వరాలిచ్చేదేవత...
ఓ తోటమాలి ...!
అంటుకట్టిన లేతమొక్కని
నువ్వు పెరడులో వదిలేస్తే
తీగై పాకి చెట్టు మొదలుని చుట్టుకుని
నీలం పూలు పూసి వెన్నెల్లో
నీలం గొడుగులు పట్టుకున్న పిల్లలున్న అమ్మ...
ఓ చెలికాడా...
నువ్వు ప్రేమించిన ప్రేయసి
కళ్ళమీద కాటుక గీతలు చెరిపేస్తే
వర్షించిన కళ్ళు నల్లనేరేడు పళ్ళు
ఆనకట్ట వేసుకున్న చేతుల గోరింటాకు రంగు
తెల్లటి చీర మీద అద్దకాలు నిండిన అగ్నిపూల మడి...
ఓ మనిషీ...
నిద్రలో మెలకువలో నీ ముందు నిలిచి
నీ ఆనందాలకి నీడనిస్తే
మోడుని చేసి మంటల్లోకి
అవమాన పరిచి ఎడారిలోకి
విసిరేసిన బంతిపూల తోరణం
ఎండిన నది వొడ్డున నీటి చెలమ!
(ప్రాకృత గాథాసప్తశతి చదివాక)
*
చాలా ప్రసిద్ధి చెందిన ఆమె కవిత "నీలిరంగు హ్యాండ్ బ్యాగ్".మహిళ వాస్తవ కథను, వ్యధను ఈ కవితలో ఎంత చక్కగా చెప్పారో చూడండి.
"నీలిరంగు హ్యాండ్ బ్యాగ్"
అల్మారా సర్దుతుంటే జారిపడ్డ
పాత నీలిరంగు హ్యాండ్ బ్యాగు
అటు ఇటూ తిరుగుతున్న సమయాలని
సందర్భాలని ఓ దగ్గర పడేసి వెళ్లిపోయాక
హ్యాండ్ బ్యాగ్ తో పాటు ప్రత్యక్షమైన
కాలం నాచేతిలో పునర్జీవించింది.
బరువైన స్కూల్ బ్యాగ్ నుంచి
బుజాలమీద వాలిన హేండ్ బ్యాగ్ లో
ఇష్టాయిష్టాలు మనసుకి దగ్గరగా ఒక రహస్యం
దాచుకోవడానికి ఒక చోటు దొరికింది.
పుస్తకాలు, టిఫిన్ డబ్బా, లిపిస్టిక్, దువ్వెన
కొత్తగా కొనుక్కున్న కాంపెక్ట్ పౌడర్, స్టేఫ్రీతో
భయంగా సిగ్గు సిగ్గుగా
ఎన్నో ఊహలని దాచిపెట్టే
కాలేజీ అమ్మాయిలా ఉండేది.
పెళ్లి శుభలేఖలతో
సిగ్గుపడుతూ భుజంమీద ఒదిగింది.
......వివిధ దశలలో వివిధ సందర్భాలను, ఆమె కోల్పోయిన స్వేచ్ఛను, ఆమె వెతుక్కుంటున్న తనదైన జీవితాన్ని ఈ కవితలో చెబుతూ కవిత ఇలా ముగుస్తుంది.
శుభలేఖలతో కుంకుమ భరిణతో చుట్టాల లిస్టుతో
హడావిడిగా సంతోషంగా అల్లుడికోసం, మరోసారి కోడలి కోసం
బరువుగా బాధ్యతగా భుజాలమీద సంతోషంగా
అచ్చం అత్త గారిలా ఉండేది.
కొన్నేళ్లుగా భుజాల మీదనుంచి చేతుల మీదకి వచ్చేసింది.
నిశ్శబ్దాన్ని మౌనాన్ని ఛేదిస్తూ
రమణ లేఖలతో, కళ్లజోడు, సెల్ ఫోనుతో
మతిమరుపుతో చిన్నదై సంతోషాన్ని వెతుక్కుంటూ అరచేతిలో ఇమిడిపోయింది.
నీలంరంగు హ్యాండ్ బ్యాగు అల్మారాలో
పాతబడి... రాలిపడి....
గతాల కావడిలా ఉంది.
*
అబద్ధాలను అబద్దపు నీడలను ఆమె గుర్తించగలదు, ప్రశ్నించ గలదు. ఖాళీ మనుషులను , మనుషులలోని ఖాళీలను ఆమె కవిత్వీకరించగలదు.
నీడకి పేరులేదు
చరిత్ర రంగులు కలిపి
పేరుపెట్టి దేహం అంటుంది
నీడ గోడలమీద పాకుతూ
నేనే అసలు మనిషిని అంటుంది!
( నీడల మనిషి )
మనిషిని ఆహ్వానించలేక
కళ్ళతో లోతుల్ని తవ్వుతుంటే రెక్కలు ముడుచుకుని
గోడ మీద నిల్చుంది
అద్దం కోసం చివ్ చివ్ మంటూ!(చిలుక)
మరో కవిత...
"రెండు ముఖాలు...
అవును రెండు ముఖాలు
మాటలు అమ్ముకుంటూ తిరుగుతుంటుంది."
*
కే.శివారెడ్డి అన్నట్టు సామాన్య వస్తువుల్ని అనుభవాల్ని అశ్రద్ధ చెయ్యని కవి ఈమె .
వాడ్రేవు చినవీరభద్రుడు అన్నట్టు
" నీలిరంగు హ్యాండ్ బ్యాగ్ " అనే కవితను ఏడెనిమిది నిమిషాల లఘు చిత్రంగా కచ్చితంగా తీయవచ్చు. జి. లక్ష్మి నరసయ్య అన్నట్టు విషయాన్ని కవిత్వం చేసే బేసిక్ ఆర్ట్ ఈమె లో ఉందని తెలిపే వ్యక్తీకరణలు ఈ కవిత్వం లో పుష్కలంగా ఉన్నాయి.
*
ఉరుకుల పరుగుల జీవితంలో అపురూపమైన క్షణాలు కొన్నే ఉంటాయి. స్నేహంలో కావచ్చు ప్రేమలో కావచ్చు ధ్యానంలో కావచ్చు, యుద్ధంలో కావచ్చు శాంతి లో కావచ్చు.. అలాంటి ఒక సందర్భంలోని కవిత..
" ఏకాంతం "- రేణుక అయోల
మౌనాన్ని ఆశ్రయించి
ధ్యానంలోకి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు
అడవిలా మారిపోవాలి!
బయట అరణ్యాలతో మాట్లాడలేనప్పుడు
జీవించాలంటే ఒక సమయం కావాలి.
లోపలి వేళ్లతో చరిత్రను కదిలించాలి.
పచ్చదనం మెత్తటి గడ్డిలాగ...
మైదానంలాగ ఆవరించగానే...
లోపలి నీడలు మసకగా కదులుతూ.
మొహాలని బయట పెడుతున్నప్పుడు.
ఒక్కళ్ళమే వికృతాలని చూసుకుని
నిర్మొహమాటంగా
మెడమీద కత్తిపెట్టి వధించుకోవడాన్ని
స్వచ్ఛమైన నీటి నీడని
ఏకాంతంలో ధ్వనిస్తున్న గొంతులో
జీరలు కడగడానికి అరణ్యమై పోవాలి
పక్షుల పాటలకి పల్లవి అందించాలంటే
లోపలి రాగాలకి శ్రుతి నేర్పి తీరాలి.
ఒక్కళ్ళమే వెన్నెలలో స్నానం చేయాలంటే
దాని నగ్నత్వాన్ని పంచుకోవాలి!
మనలో ద్వేషానికి చల్లటి గీతాన్ని అందించాలి.
లోయలోని తెల్లటి పూలని తడమాలి
నెత్తురు స్రవించే దేహాలని కడగాలి!
పులులతో సావాసం చెయ్యాలి.
నెమలి ఆటలో మబ్బులని దర్శించాలి.
కఠినమైన చీకటిలో
కళ్ళలో వెలుతురు వెలిగించి
చీకటి జంతువుని చూడగలగాలి!
లోపలి మహా సముద్రాలు ఏకంకాగానే
ఒడ్డున చేరుకున్న శవమై పోవాలి!
కళ్ళు తెరవగానే మూగుతున్న ముఖాలకి అడుగుతున్న ప్రశ్నలకి సమాధానంలేని చరిత్రగా మిగిలిపోవాలంటే అరణ్యమైపోవాలి!
(రమణాశ్రమంలో ధ్యానమందిరంలో కూర్చున్నపుడు)
అరణ్యమైపోవడం అంటే మాటలు కాదు..
ఇలాంటి కవితలు ఈ మధ్యకాలంలో చాలా అరుదుగా కనిపిస్తుంటాయి.
*
ఖాళీ అయిన ఇల్లు, అరణ్యం అవుతున్న మనుషులు, నేర్పుగా ఒడ్డుకు వచ్చిన పడవలు, ఏమీ లేని ఒక రోజు, ఎర్ర మట్టి గాజులు, అక్షరాల పడవ, చక్రాల కుర్చీ, అమ్మకో ఉత్తరం, గోడ చెప్పిన కబుర్లు, సైకిల్ బిల్లు, ఏకాంతం నీడల మనిషి, పిచ్చుక, ఒక దుఃఖం ఒక కన్నీటి చుక్క, ప్రకృతి ,మైదానం వంతెన, చినుకు స్పర్శ ,కొత్త ఉద్యోగం, సందర్భాలు, రెండు ముఖాలు.. ఇవన్నీ రేణుక అయోలా కవితా శీర్షికలు, కవితా సందర్భాలు..
సాహిత్యాన్ని జీవితాన్ని సమాజాన్ని మనిషి అంతరంగాన్ని అర్థం చేసుకొనే కవులే మొత్తం జీవావరణాన్ని కవిత్వీకరిస్తారు.అలాంటి మానవీయమైన కవి రేణుక అయోల గారికి శుభాకాంక్షలు..
1సుభాషిణి తోట
No comments:
Post a Comment