Friday, 16 September 2022

 కొన్ని సార్లు అనుకోని సంతోషాలు ఇదిగో ఇలా పలుకరిస్తాయి..

. రాధేయ గారు ఎంతో అభిమానంతో " పృథ "గురించి మీరు ఇచ్చిన విశ్లేషణకి నా హృదయ పూర్వక ధన్యవాదాలు..
May be an illustration of 1 person and text that says "పృధ ఒక అన్వేషణ రేణుక అయోల దీర్హ కవిత"
ఒక స్త్రీ మూర్తి
అంతర్జ్వలనమ్- 'పృథ'
----డా.రాధేయ------
ప్రాచీన కావ్యాలను,పురాణాలను
మారుతున్న కాలం లో వర్తమాన సామాజిక విలువల నేపథ్యంలోంచీ
పునర్మూల్యాంకనం చేసుకుంటూ ముందుకు
సాగాలి అన్నారు విజ్ఞులు.
భారత,భాగవత,రామాయణ కావ్యాలు కూడా ఇందుకు మినహాయింపు కాదు.
నిత్యం మనచుట్టూ విస్తరిస్తూ, కల్లోల పరుస్తూ, మనల్ని వేదనకు గురిచేస్తున్న విధ్వంసాల్ని తట్టుకుని నిలబడటమే
ఒక సాహసం.ఈ క్రమంలో వస్తున్న అనేకానేక సామాజిక మార్పుల్ని అనివార్యం గానో
అయిష్టంగానో అంగీకరిస్తున్న
జీవితాలు మనవి.
ప్రాచీన పాత్రల్ని ఆధునిక రచనలు పునర్వ్యాఖ్య చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆ వ్యాఖ్యలు లేదా కల్పనలు వాస్తవ భూమిక మీద ఆయాపాత్రల అంతరంగాన్ని ఆవిష్కరించే లాగా, సానుకూలంగా ఉండాలి. మూలచ్చేదం చెయ్యకూడదంటారు డా.పాపినేని శివశంకర్
(16.10.2017 ఆంధ్రజ్యోతి వివిధలో మహాభారతం లో ద్రౌపది
అంతరంగాన్ని విశ్లేషిస్తూ..)
"అహల్యా ద్రౌపదీ కుంతీ తారా మండోదరీ తథా
పంచకన్యా స్మరేన్నిత్యం,మహాపాతక
నాశనమ్"
ఈ పంచ కన్యల్లో"కుంతి" పాత్ర మన కవయిత్రి రేణుకా అయోలా గారిని బాగా సంఘర్షణకు గురిచేస్తూ వచ్చింది. భారతంలో కుంతి,మాద్రి పాత్రలు తన్ను బాగా ఆలోచనలో పడేసిన స్త్రీలుగా వారు చెప్పు
కున్నారు .
మహా భారత పాత్రల స్వభావాన్ని డా.భైరప్ప గారు కన్నడ భాషలో రచించిన 'పర్వ' నవల,ఆ తర్వాత
ఇదే నవలని డా.గంగిశెట్టిలక్ష్మి నారాయణ గారు తెలుగు లోకి అనువదించడంతో తన ఆలోచనలను మరింతగా
పరిపుష్టం చేశాయని కూడా చెప్పుకొచ్చారు.
అందుకే కుంతి అసలు పేరైన పృథ సంకేతంగా 'పృథ' ఒక అన్వేషణ గమనం గా దీర్ఘ కావ్యమై అవతరించింది.తన ఆలోచనా అన్వేషణా మగ్నతలో సాగిన ఈ కావ్యం ఒక స్త్రీ మూర్తి కురువంశం కోసం చేసిన త్యాగం,ఆ త్యాగం వెనుక ఆమెఎంతటి తీవ్ర మానసిక వేదనకు కవితాత్మక రూపమేఈ 'పృథ'
నిజానికిది తర తరాలు గా మనం అనుభవిస్తూన్న
సామాజిక దుర్నీతి కి ఈ కావ్యం రన్నింగ్ కామెంటరీ
లాంటిదే.
నిజానికి అనాదిగా ఈ కర్మభూమిలో తన జీవితం స్త్రీల చేత ఎప్పుడూ అవమానింపబడని పురుషులు ఉంటారు కానీ పురుషుల చేత ఎన్నడూ అవమానం పొందని
స్త్రీలు మాత్రం ఉండరు.
మహా భారతంలో కుంతి ఎక్కడా తన ధిక్కారస్వరం విన్పించదు.తనదైన స్వతంత్ర భావ ప్రకటన చెయ్యదు.ఇప్పటికీ
ఆమె గాయాల సలపరింపు
త్యాగాల వేదన ఈ రచయిత్రిని వెంటాడుతూనే ఉందని చెప్పడానికే ఈ 'పృథ' ఒక అన్వేషణ.
సహజంగానే వస్తువుతో తాదాత్మ్యం చెందే అనుభూతి ప్రియత్వం రేణుకా అయోలా గారి కవిత్వం.గతంలో వచ్చిన వారి కవితా సంపుటాలన్నీ
ఇలాంటివే.మూడవ మనిషి దీర్ఘకావ్యం కూడా మనలో ఒకడు గా మెలగ లేని థర్డ్ జెండర్ యొక్క మానసిక వ్యథ ను చిక్కగా కవిత్వం చేశారు అయోలా గారు.
పృథ వారికిది మరో మలుపనే చెప్పాలి. మొదట గా కుంతి బాల్య యవ్వన నేపథ్యంలోకి మనల్ని నడిపిస్తారు.
అందమైన దేహం చుట్టూ కథ
కథ చుట్టూ నమ్మకాలూ బానిసత్వాలూ
చరిత్ర జాతరలో వంశం కోసం తెచ్చుకున్న బలమైన
పెయ్యి దూడలు ఆడవాళ్లు
ఆమె చరిత్ర ద్వారాలు బార్లా
తెరిచి స్పష్టంగానే చెపుతోంది..
పుట:12
రాచరికపు మర్యాద దాటలేదు.తండ్రి తనపై పెట్టిన బాధ్యత మరువలేదు
ఊహించని మలుపు లో జీవితం చిక్కుబడింది.
మనిషి గా వచ్చిన మగవాడు వయసుని అనుభవించే ఆనందంలో ఉన్నాడు
మీ దేహం నా బీజం వేయాల్సిందే అంటాడు
తీరిపోయిన కోరిక మెట్టు ఎక్కి వెళ్ళిపోయాడు
పుట:20
మాతృవాసన అయోమయంగా శరీరాన్ని తడిమింది.ముందుచూపు లేని పిచ్చిలో కాలం తొమ్మిది నెలలు మోసుకొచ్చింది
కాలం తీర్పు కంటే రాచరికపు శాసనం బలీయమైనది,చేజారిన స్వప్నాలు రాలిపోతాయి..
ఎంతో నిర్దయగా కొన్ని పూలని దీపం పడవని నదిలో వదిలినట్లు పసిబిడ్డను వదిలేయగానే న్యాయం జరిగినట్టేనా?
పుట:22
ఒక్కోసారి కొన్ని మాటలు జీవితం కింద మంట పెడతాయి ఆ మంటల్లో కాలిపోయిన ఒక హృదయం సమాజానికి అద్దం లా నిలబడుతుంది
కురువంశంలో
మగవాడి బలం మీద నమ్మకం
గుడ్డి చూపులో అనంతమైన గర్వం
అసంకల్పిత దుఃఖ దొంతర లో
బీజం కట్టని క్షేత్రం వొణికి
ఖాళీ కడుపు మంట ఆర్పుకోలేని
నది అయింది
ఆమె గాయాలతో ఎవరికీ
సంబంధం లేదు
పుట:37
పిల్లలు పుట్టించలేని రాజు తనను గట్టు అంచున వదిలేశాడు. అంతః పుర పరదాల్లోకి మాద్రి యవ్వనం ప్రవేశించింది.
మిగిలిన శూన్యమంతా తానై
కూలిన మాద్రి
తోట అంతా తిరిగొచ్చిన సీతాకోకచిలుకలా
తన బాధనంతా చెప్పుకొంటూ కుంతి ఒడిలో ముడుచుకుని పడుకుంది
పుట:47
పొడి మేఘాలకి ఎంత రాపిడి కల్గించినా నిప్పులే కానీ నీళ్లుండవని
తేలిపోయింది.జారి పోయిన మనస్సుతో కుంతి కౌగిలి లో పాండురాజు వెక్కి వెక్కి ఏడ్చాడు పాండురాజు..
ఒంటరి గా అలసటగా మట్టినేలమీద పడుకుని ఎప్పటికైనా నా ఈ జన్మ రహస్యాన్ని చెప్పుకోగలనా?
చూడు ఈ జీవితం ఎన్ని రహదారులను సృష్టించి వదిలేసిందో ఎండ వేసిన అద్దంలో కనపడిన రూపాన్ని కోపగిస్తూ అడుగుతోంది ..
ముసురుతున్న వాడి లేత జ్ఞాపకం మెరిసే కళ్ళు నున్నని బుగ్గలు
నదిలో అనాధగా ప్రవహిస్తూ ఏడుస్తూ కదిలే ఆ పసిబాలుడి కథ ఎప్పటికైనా చెప్పుకోగలనా?
దుఃఖపు పొరతో మసకబారుతున్న ప్రతిబింబం కుంతితో పోట్లాడుతోంది
పుట:63
ప్రపంచం నిన్ను వదిలేసినా చెప్పాల్సింది చెప్పాలి..కుంతి
అంతర్మథనం
ఓ చిన్న బీజం నాటుకోవాలి అంటే నా దహం తో నేనే యుద్ధం చేయాలి అనుకుంటున్న కుంతి అడుగుతోంది
గాయలమీద లేపనాలు,పసరు పూతలు
మాద్రి నిస్సహాయత చూసింది కుంతి.
సతీసహగమన వేదనలో
కొలిమిలా మండి పోయిన మాద్రి ని తలుచుకొని తల్లడిల్లి పోయింది.
దేవలోకంలో వైధవ్య రహిత జీవితాన్ని వదులుకొని మంచుకొండల్లో తప్పిపోయి జీవితం తెలుసుకునే అర్హత కోల్పోయి ఐదుగురు పిల్లల కన్నీళ్ళకి తడి కట్టి హస్తినాపుర జీవిత ప్రయాణంలో జీవితం ముగిసింది లేదు బతికింది లేదు కేవలం సమాధి కట్టబడింది
పుట:84
ఒకనాటి మాతృస్వామ్యం, ఈ నాటి పితృస్వామ్యం స్త్రీని కట్టుబానిగానే చూసింది.వరాలు,శాపాలు,భవిష్యత్ దర్శనం కింద నలిగి పోయిన
ఒక స్త్రీ మూర్తి కుంతి మానసిక భావోద్వేగాన్ని 'పృథ' ఎంతో ఆర్ద్రంగా వినిపిస్తుంది.
రాచరిక హద్దుల పరదాలు వెనుక జరిగే శృంగార పౌరుషంలో భంగపడి ఓడిపోయిన రాజు వాస్తవం రాజ్యానికి తెలియకుండా అంతః పుర గోడలు అడ్డుకుంటాయి.
ఎవరికో ఇచ్చేదేహం మంటలో
పచ్చటి బీజం నాటు కోవాలి
కోరిక పగుళ్ళతో
రక్తం ఓడుతున్న మనసు ఆక్రోశిస్తోంది ..
ఇదీ కుంతి మానసిక స్థితి.
ఒకే వస్తువును పైగా భారత కాలం నాటి స్త్రీపాత్రను, పాత్రౌచిత్యానికి భంగం కలగని రీతిలో ఆద్యంతం చక్కటి అభివ్యక్తితో కవితాత్మకంగా నడిపించడం కవయిత్రి రేణుకా అయోలా గారికే చెల్లింది.
కథనాత్మకంగా సాగిన వ్యాఖ్యానం సాదా సీదా గా
అన్పించినా కుంతి
అంతరంగ,మానసిక, నిర్వేదం లో పలికిన
కవిత్వం మాత్రం పఠితను
కదిలిస్తుంది.కుంతి పాత్ర ఔన్నత్యాన్ని చాటుతుంది
ఒక చారిత్రక సత్యాన్ని స్త్రీ దృక్కోణం లో వర్తమాన సామాజిక వాస్తవంగా
మలిచిన తీరు ప్రశంసనీయం.
ఒక దీర్ఘ కావ్యానికి
ఉండ వలసిన స్పష్టత,
అభివ్యక్తి,శిల్పం పరిధి దాటలేదు.
ఒక మంచి కావ్యాన్ని చదివిన తృప్తి నాకు కలిగించి నందుకు కవయిత్రి కి
అభినందనలు
,
ధన్యవాదాలు.
డా. ఉమ్మడిశెట్టి రాధేయ
అనంతపురం
సుభాషిణి తోట

No comments:

Post a Comment