Thursday 26 January 2023

 

ఒక పాటతో ప్రయాణం
"ఏజోహల్కా హల్కా సురుర్ హై"
ఎప్పుడైనా ఒంటరిగా నర్తించావా
పాదాలతో మట్టిని తాకుతూ
లోపలి గానానికి బీజాలు వేస్తూ
ఆకాశం వైపు చేతులు చాస్తూ
పాటని ప్రకృతికి వొప్ప చెప్పీ చూసావా
పాట నునులేత చిగురులా మొలకెత్తి
లోపలి ప్రేమని
ప్రియుడి స్పర్శల్ని
జంట సర్పల్లా పెనవేసుకుంటుంది
శ్వాస జీవితం నిద్ర ఉలికిపడతాయి
సన్నిని సవ్వడితో
మొదలైన గానం
గుమ్మడి తీగలా అల్లుకుని
పచ్చనిపూలు
తాటాకు కప్పుమీద
నగ్నంగా నిల్చునట్టుగా
నిన్ను నాట్యంలోయలోకి తోసేస్తుంది
నాట్యం నువ్వు కట్టుకున్న
ఇసుక గుడిలోకి
అలల తెప్పమీదకి
పాదాలని ఉంచమని బతిమాలుతుంది
మట్టిని నీరుని ఆకాశాన్ని తడమంటుంది
గొంతు దాటి రాని
పాట నాట్యం కలుస్తున్నప్పుడే
వేడి ఊపిరి మెత్తటి కౌగిలి
పరిచయం ఒకపిలుపు
ఒక కోరిక ఒక వాగ్దానం
నిశ్శబ్ధ తాకిడికిలో
పాదం వెనక పాదం
పాటని నింపుకున్న వేణువతుంది


No comments:

Post a Comment