Friday 16 September 2022

 గారు పొద్దున్నే కాఫీ తో పాటు మీ విశ్లేషణ చాలా బాగుంది... ధన్యవాదాలు...

May be a close-up of 1 person
*కాఫీ విత్…"రేణుకా అయోలా" పొయెట్రీ…163.
*అవును…ఓ సామాన్య గృహిణికి యుద్ధమంటే
భయమే మరి..!!
యుద్ధం అంటే రక్తపాతం..యుద్ధమంటే మృత్యు కుహరం
యుద్ధమంటే కష్టం..యుద్ధం మంటే నష్టం….ఇవన్నీ ఓ దేశానికి..మరి సామాన్య గృహిణికి మాత్రం యుద్ధమంటే
మరో రకం భయం.‌!
ఓ గృహిణికి ఇల్లే ప్రపంచం.తన ఇల్లే స్వర్గం.తన ఆశలు,
తన వర్తమానం,భవిష్యత్తు,సుఖం,సంతోషం,బాధలు
అన్నీ తన ఇంటి గురించే..మరి యుద్ధం వస్తే ఆమెకేంటి
బాధను కుంటున్నారు కదా.! ప్చ్ ! సీత బాధలు సీతవి
పీత 🦀 బాధలు పీతవి.
అదేంటో తెలుసుకునే ముందు మీరొక సారి రేణుకా
గారి కవితను చదవండి.!!
"నాకు యుద్ధం అంటే భయం
నా నెత్తిమీద బాంబులు పడతాయని కాదు
నా పర్సులోకి ధరల పురుగులు చేరుతాయని
అరకొరగా వచ్చే జీతాల కింద గుడ్లు పెట్టీ
పిల్లల్ని కంటాయని భయం
గోధుమ పిండి డబ్బాలోకి
బియ్యం సంచిలోకి
ఇష్టపడి ఎప్పుడూ పడితే అప్పుడు తాగే
టీ డబ్బాలోకి
పిల్లల స్కూటీలో
పెట్రోలులోకి కనపడకుండా దూరిపోతాయి
వాటిని ఎలా దులపాలో
ఎల్లాంటి మందు పెట్టాలో తెలియదు
వాటిని మట్టు పెట్టే ప్రయత్నంలో
నాకొచ్చే జీతం…
అలసి ప్రాణాలు పోగొట్టుకుంటుంది
అలసట ప్రాణ భయంతో
రోజు చదివే పేపరులో
నాదేశం ఇవ్వని చదువు కోసం
పరాయి దేశాలు పట్టిన పిల్లల
కన్నీళ్లకి భయపడతాను
నాకు యుద్ధం అంటే భయం
నా జీవితంలో నేను ఇస్టపడే
ప్రకృతిలోకి నిప్పులా వస్తుందని భయం
ఎక్కడో వున్న ఆ యుద్ధ మేఘాలు
రాజకీయం అర్ధంకానీ నాయింట్లో..
తిష్ట వేస్తాయని భయం
నా భయాలన్ని చెప్పుకోవడానికి
నాకే అవకాశం లేదు
నా ఇంటి గుమ్మం వైపుఎవరూ చూడరు
నేనొక సామాన్య గృహిణిని
నాకు యుద్ధం అంటే భయం.."!!
యుద్ధం ఎప్పుడూ అనర్ధదాయకమే..అది దేశానికి కావ
చ్చు..ప్రపంచానికి కావచ్చు..చివరకు ఇల్లే తన ప్రపంచ
మనుకునే ఓ సాధారణ గృహిణికి కూడా యుద్ధం అనర్ధ
దాయకమే..!
రెండు దేశాల మధ్య యుద్ధంలో రక్తపాతం జరుగుతుంది.
వేలమంది మరణిస్తారు.యుద్ధం చేసే దేశాలకు ఆర్థికంగా
కోలుకోలేని దెబ్బతగులుతుంది.ఊహించని నష్టం వాటిల్లు
తుంది.ఇది ఏడాదికో,రెండేళ్ళకో కాదు.యుద్ధం వైపరీత్యా
లు చాలా కాలం కొనసొగుతాయి.అలాగే ఓసాధారణ‌
గృహిణి కి కూడా యుద్ధ వైపరీత్యాలు ఊహించని నష్టం కలుగజేస్తాయి.‌ ఇది ప్రథమపురుషలో, ఆత్మాశ్రయంగా
రాసిన కవిత..వర్తమాన సంక్షుభిత పరిస్థితుల్లో సామాన్య
గృహిణి మనస్తత్వానికి అద్దంపడుతోంది.
రేణుక గారి లాంటి సామాన్య గృహిణికి యుద్ధం అంటే ఊహించని భయం. తన నెత్తిమీద బాంబులు పడతా
యని కాదు సుమా!
తనపర్సులోకి ధరల పురుగులు చేరుతాయని..అవి అర
కొరగా వచ్చే జీతాల కింద గుడ్లు పెట్టీ‌ పిల్లల్ని కంటాయని ఒకటే భయమట. ఈ పురుగులు ఒకటీ రెండు చోట్ల కాదు
అనేక చోట్ల గుడ్లుపెడతాయి.ఉదాహరణకు గోధుమ పిండి డబ్బాలోకి, బియ్యం సంచిలోకి ,మనం ఇష్టపడి ఎప్పుడు పడితే అప్పుడు తాగే టీ డబ్బాలోకి,పిల్లల స్కూటీలో
పెట్రోలులోకి కనపడకుండా దూరిపోతాయి. వాటిని ఎలా దులపాలోఎల్లాంటి మందు పెట్టాలో మనకు తెలియదు
వాటిని మట్టు పెట్టే ప్రయత్నంలో తనకొచ్చే జీతం అలసి
ప్రాణాలు పోగొట్టుకుంటుందట. అంటే… నిత్యావసరాల ధరలు పెరిగి, వచ్చే జీతం సరిపోక పడే ఇబ్బందన్నమాట.
ఇదో రకం భయమైతే..‌మరో రకం భయం కూడా వుంది.
మనదేశంలో సీట్లురాక, వచ్చినా చదివే స్తోమత (ఫీజుల
భారం) లేక డాక్టరీ, ఇంజనీరింగ్ చదువులకోసం పరాయి దేశాల బాటపట్టిన పిల్లలు,అక్కడ అనుకోకుండా యుద్ధం
లో ఇరుక్కుపోతే..ఇక్కడ తల్లిదండ్రులు ,అక్కడ పిల్లలు పడే బాధ,వాళ్ళ కన్నీళ్ళు చూసినా కూడా భయమే… కలుగుతుందట.
తన జీవితంలో ఎంతో ఇష్టపడే ప్రకృతిలోకి యుద్ధం
నిప్పులా వస్తుందన్న భయం కూడా ఇంకోటి వుంది.
అలాగే ఎక్కడో వున్న ఆ యుద్ధ మేఘాలు,అర్థంకానీ
ఆ రాజకీయం యింట్లోతిష్ట వేసి,ఇబ్బంది పెడతా
న్న భయమూ లేకపోలేదు.
ఈ భయాలన్నీ ఎవరికీ చెప్పుకోవడానికి వీలుకూడా
లేదు.అసలు అటువంటి అవకాశమూ రాదు కూడా..
కారణం …తన ఇంటి గుమ్మం వైపు ఎవరూ కనీసం
తొంగి కూడా చూడరు.
తానొక సామాన్య గృహిణి మాత్రమే…
తనకు యుద్ధం అంటే భయం..అంతే.!!
నిజానికి ఈ కవయిత్రి రేణుకా అయోలాకు మాత్రమే
కాదండోయ్.! .ఏ సామాన్య గృహిణికైనా ' యుద్ధం
అంటే భయమే..ఎక్కడ ధరలకు రెక్కలొచ్చి ఆకాశానికి
ఎగిరిపోతాయోనని, చాలీ చాలని జీతంతో ,పెరిగిన
ధరలతో రోజులు దొర్లించడం కష్టమన్న సంగతిని యే
సాధారణ గృహిణిని అడిగినా చెబుతుంది.
రేణుక గారుకూడా ఇందుకు మినహాయింపు కాదు.!!
*ఎ.రజాహుస్సేన్..
హైదరాబాద్..!!
Srinivas Vasudev, Abdul Rajahussain and 3 others
1 comment
Like
Comment
Share

1 comment

No comments:

Post a Comment