Friday 25 November 2011

గతాల పిట్టలు



తడి ఇంకిన  పొడి పొడి జ్ఞాపకాలు
నా చుట్టూ  పిట్టల్లా ఎగురుతుంటాయి
భుజంమీద వాలాలని వాటి  ప్రయత్నం

పట్టించుకోనట్లే తిరుగుతుంటాను

రెక్కల కొనలతో  రాచుకుంటూ
పదే పదే చుట్టుతా  ఎగురుతుంటాయి
అంచులు నిమిరి  పంపిచేస్తుంటాను

పాతకధలు  గుర్తుచేయాలని  పాటనందుకుంటాయి
గతపు ఆకాశంలో రెక్కలతో  ఎగురుదాం - రమ్మంటాయి
తుడిచిపెట్టిన  స్మృతిచిహ్నలను
పొడిబారిన కళ్ళకు చూపిస్తాయి
నీటిచెలమలను చూపించి కంటిపాపలను ఊరిస్తాయి


సుఖాలని అందుకోబోయి  కష్టాలని ,
శాంతి కోసంపరుగులు పెట్టి  అశాంతిని,
చిరకాలపు  స్థితిగతుల్ని
మనసుని మెలిపెట్టే రహస్యద్వారాలని
తెరిచి చూపిస్తుంటాయి.

సతమతమయ్యే  జీవితాన్ని  కళ్ళఎదుట పెట్టి
గతాలపిట్టలు మళ్లీ మళ్లీ వచ్చి వాలుతుంటాయి
ఇంకా ఏవో చెప్పాలని చుట్టూ తిరుగుతుంటాయి

నిద్రని ఆహ్వానించి కలలతో  సాన్నిహిత్యం పెంచుకుంటే
సూటిగా  మాట్లాడలేని ఆ జ్నాపకాలపిట్టలు
కలలచెట్టు మీద కూర్చుని రాగాలు అందుకున్నాయి

వద్దు వద్దు అనుకుంటూనే
కలలుకూడా  ఆ రాగాలమత్తులో
రాత్రంతావింటూనే ఉండిపోయాయి.

కలల అలసటలో తెలివివచ్చాక కూడా
గతాలు-  గాయాలుగా  మారిపోయాయి ...

!*!

















No comments:

Post a Comment