Sunday 7 August 2011

కిటికీ

కిటికీ తెరిస్తే
ఏపుగా పెరిగిన చెట్టొకటి కనిపిస్తుంది 
అపుడే విరిసిన యెర్రని పువ్వొకటి నవ్వుతుంది. 

జీవితపు కిటికీ తెరచిచూస్తే
అనుభవాల వెలుతురు ,గాయాలధూళి మీద పడుతుంది 
వాలిపోతున్న వ్రుద్ద్యాప్యం ,చెల్లిపోతున్నకాలం 
నెమరువేస్తున్నపుడు
తియ్యటి బాల్యం హాయిగా,పసందుగా 
గడిచిపోయిన గుర్తులు బయటపడుతుంటాయి.

*

యవ్వనం పాములా జరజరా పాక్కుంటూ జారిపోయింది 
ఓటికుండలా వ్రుద్ధాప్యం మిగిలిపోయింది
చిన్నప్పటి ఆదర్శాలు,అహంకారాలు నశించి
భయాలమాటున ,అనారోగ్యపు చాటున
జీవితం గొంగలిపురుగులా మెల్లగా నడుస్తుంది

నిద్రిస్తున్న ఆయుష్షు 
సిగ్నల్లేని రైలులా ఆగిపోయింది
కిటికీలోంచి చూస్తుంటే అపుడే విరిసిన పువ్వు 
ఎండలో ఎర్రగా మెరిసి
అంతలోనే చటుక్కున రాలిపోయింది

*
ఈ జీవితం ఇంతే కదా?-
అనే స్మృతి మిగిలిపోయింది
కిటికిమూసేస్తే అనుభూతులు ఆగిపోయాయి 
ఆకుతింటున్న గొంగళిలా జీవితం
మెల్లగా  నడుస్తోంది 

+.+

3 comments: