Monday, 27 July 2020

క్రేన్ పక్షి



  గాలిలో  తేలుతూ
  ఎప్పుడైనా ఒంటరిగా నర్తించావా
  వాన చినుకులు పడినప్పుడు 
  పాదాలతో మట్టిని తాకుతూ
  లోపలి గానానికి బీజాలు వేస్తూ
  ఆకాశం వైపు చేతులు చాస్తూ
  పాటని ప్రకృతికి వొప్ప చెప్పీ చూసావా

   ఆకుపచ్చని పాట  నునులేత చిగురుతో
   కాంతితో జంట సర్పల్లా పెనవేసుకుంటుంది
   శ్వాస జీవితం నిద్ర ఉలికిపడతాయి

  సన్నిని సవ్వడితో మొదలైన గానం
  గుమ్మడి తీగలా అల్లుకున్న పచ్చనిపూలు
  తాటాకు కప్పుమీద నగ్నంగా నిల్చునట్టుగా
  మట్టిని  నీరుని ఆకాశాన్ని తడుముతుంది
  ఆకాశంలో  గానం నాట్యం కలుస్తున్నప్పుడే
  గాలితో, కొండలతో  ఇసుకతో పరిచయం

  పరిచయం ఒక పిలుపు కోరిక ఒక వాగ్దానం
  నిశ్శబ్ద తాకిడికిలో పాదం వెనక పాదం
  పాటని నింపుకున్న వేణువతుంది....

Friday, 24 July 2020

అస్పస్ట కల

కొన్ని సార్లు కలలు జ్జాపకం ఉంటాయి తెలివి వచ్చినా అలాంటిదేఈ అస్పష్ట  కల !

    కలల పిట్టలు
రెప్పల తీగ మీద వరుసగా కూర్చుని
రెక్కలు సరిచేసుకుంటూ
ఊహల్ని పోగుచేసి కూత పెడితే
కూతల సందడిలో లోయలోకి జారిపోతూ పట్టు తప్పి
కొత్త రహదారులు వెంట నడుస్తూ తప్పిపోతూ
ఎవరిదో చేయి!అందుకుని
నవ్వుకుని ,దుఃఖపడిన ముఖం మీదనీటి చినుకులు...
మసక వెన్నెలలో ఊయల ఊగీఊగీ
తెగిన గొలుసు శబ్దానికి మెలకువ తలుపు తెరుచుకోగానే రెప్పలతీగనుంచి జారిపడ్డ పిట్టలు ఎగిరిపోయాయి.......

Sunday, 19 July 2020

టీ కప్ # డైరీ_



  టీ కప్ # డైరీ__



      ఉదయం 6 గంటలు

రాత్రి ఆరోగ్య సూత్రం మందలించింది
నలుపు తెలుపు సున్నాలున్న మగ్లో
గ్రీన్ టీ  యోగా క్లాస్ గుర్తుచేసింది.

    ఉదయం 11 గంటలు

నిన్నటి కలతతో రుచిగా లేదు
రంగు వాసన అలాగే ఉంది
తెల్లటి కప్పులో వేడి పొగలతో
మసాలా టీ
నిర్లిప్తంగా ఉంది..

మధ్యాహ్నం 3 గంటలు


వాన తుంపర్లలో తడుస్తూ
హృదయాన్ని తాకిన వాట్సాప్ మేసేజ్ అనందంలో
అల్లం వాసనతో చిక్కటి టీ
పింగాణీ కప్పులో ఉత్కాహంగా వేడిగా
గొంతులోకి దిగింది...

   సాయంకాలం 6 గంటలు


స్నేహితుడి చేతిలో
గూలాబి పూసిన  తెల్లటి కప్పు సాసర్లో
ఇలాయిచి  టీ
రుచి ఎలా ఉంది ?
నీ అంత అందంగా సమాధానంలో
గులాబీల గుల్దాస్తా అందుకుంది

     రాత్రి 12 గంటలు .

నిద్ర రాని కళ్ళ మీద

రెప్పల విసనకర్రలకి వినిపించని గడియారం

మూసిన తలుపు వెనుక

 గడ్డకట్టిన  సంతోష  సమయం

అల్లం మిరియాల పుదినా టీ

ఆలోచనలో గోంతు దాటి ఎప్పుడు వెళ్ళిందో

నీలం రంగు మగ్ ని చేతులు

టీపాయి మీద ఎప్పుడు పెట్టాయో!

పాల పేకెట్ వాడి బెల్ చిలకలా పలికింది ....
      

Thursday, 2 July 2020

telugu poem : Renuka Ayola kannada translation : S D Kumar ತೆಲುಗು : ರೇಣುಕಾ ಅಯೋಲಾ ಕನ್ನಡಕ್ಕೆ : ಎಸ್ ಡಿ ಕುಮಾರ್


telugu poem : Renuka Ayola
kannada translation : S D Kumar

ತೆಲುಗು : ರೇಣುಕಾ ಅಯೋಲಾ
ಕನ್ನಡಕ್ಕೆ : ಎಸ್ ಡಿ ಕುಮಾರ್

ಈ ನಿರ್ಬಂಧ ಕೆಲವೇ ದಿನಗಳು ಮಾತ್ರ

ನನ್ನ ಬೆಳಗನ್ನು ನೇರ ನೋಡಲಾಗದವರು
ಗೋಡೆಗಳ ಹೆಚ್ಚಿಸಿ ಕಾವಳ ಮೂಡಿಸಿದವರು
ಕಂಗಳಲ್ಲಿ ಬೆಳಕಿನ ಪತ್ತಲು ಇಲ್ಲದವರು
ಗಂಟಲದುಮುವ ಹಾದಿಯನ್ನೇ ಆಸರೆ
ಯಾಗಿಸಿಕೊಂಡವರು
ಸುಳ್ಳೇಸುಳ್ಳು ಧರ್ಮವ ಹೊರುತ್ತಿರುವವರು
ನನ್ನ ತಿರಸ್ಕಾರಕ್ಕೆ ಮುಖಾಮುಖಿಯಾಗಿ
ನಿಲ್ಲಲಾಗದವರು

ಅವರ ಇರುಳು ರಾತ್ರಿಗಳಲ್ಲಿ... 
ಯಾವುದೋ ಒಂದು ದೀಪವ ಬೆಳಗಿಸಲಿ

ನಂಬಿಕೆ ದ್ರೋಹದ ಕತ್ತಿಗಳಿಂದ
ಸ್ವೇಛ್ಚಾ ಗಂಟಲು ಒತ್ತಿಬಿಡುವ
ರುಂಡಗಳ ಬೆದಕಾಡುವವರಿಗೆ
ನನ್ನ ಧೈರ್ಯಕ್ಕೆ ಕೊಡಲಿಪೆಟ್ಟು ಹಾಕೋದು
ಸುಲಭವಲ್ಲ - ಅಷ್ಟಾಗಿ

ಬದುಕುವೆ ನಾನು ನನ್ನ ದೇಶದಲ್ಲೇ
ಪ್ರವಾಸಿಯಾಗಿ
ಈ ದೌರ್ಜನ್ಯ ಇದೆಯಲ್ಲ ಇದು
ಟೆಂಪೊರರಿ ಅತಿಥಿ
ಅನಾಮಿಕವಾದ ಸೇಡು ಸೆಡವುಗಳ
ಕಾಟ
ನನ್ನನ್ನೇನು ಮಾಡುತ್ತವೆ ಅಪರಿಚಿತ ಹಸ್ತಗಳು

ನನ್ನ ಸ್ವೇಛ್ಚೆಯನ್ನು ಚೆಲುವನ್ನು ಅಮರುವ
ಧೂಳೊಳಗಿಂದ.. 
ನನ್ನ ಪ್ರಿಯ ಕವಿಗಳ ಗಂಟಲ ಪದ್ಯಗಳು
ಕೇಳಿಸುತ್ತಲೇ ಇರುತ್ವೆ ನನಗೆ

ಈ ನಿರ್ಬಂಧ ಇನ್ನು ಕೆಲವೇ ದಿನಗಳು
ಮಾತ್ರ
Show quoted text

Friday, 26 June 2020

Telugu Poets Demand VV's Release - 10

Telugu Poets Demand VV's Release - 10

As the tenth installment in the series of Telugu poems against VV's incarceration and demanding his release, today I present a translation of 'This captivity is short-lived' by senior poet Ms Renuka Ayola.

This captivity is short-lived
Renuka Ayola

They cannot look straight into my dawn
Build walls to spread darkness
They have no brightness in their eyes
Depend on the path that slits throats
They carry the destiny of lies
Do not dare face my defiance

A light has to be lit
In these dark nights

It is not easy for them
To hack my courage
As they are in search of executioners
To behead liberty
With swords of betrayal

I persist in my country as an exile

This belligerence is a short-lived guest
Anonymous harassment and
Unknown paws cannot harm me

I continue to hear
Verses and voices of my poet friends
From the thick smog that covers
My freedom and beauty today

This incarceration lasts only a few days.

(Translated by N Venugopal)

Tuesday, 22 October 2019

   పి.జ్యోతి ( spreading లైట్ )


రేణుక అయోల గారి కవితా సంపుటి “ఎర్రమట్టి గాజులు” ఒక స్త్రీ మనసులోని మ్యూజింగ్స్ కి అద్దిన పదాల సొగసులు. దీన్ని కవిత్వంగా చదవాలి కాని ఇందులో ఇజం ని వెతకడం వల్ల కవిత్వాన్ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేం. సాధారణంగా కొందరు రచయిత్రులకు ఒక బ్రాండ్ ఆపాదించడం జరుగుతుంది. అందులోకి కుదించి వారి కవిత్వాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చాలా మంది విమర్శకులు చేస్తూ ఉండడం నాకు తెలుసు. ప్రొఫెషనల్ విమర్శకుల స్థాయి లో నేను లేకపోవడం కొన్ని సార్లు నా అదృష్టంగా భావిస్తూ ఉంటాను. ఎందుకంటే ప్రతి పుస్తకాన్ని ఒక సరికొత్త భావ వ్యక్తీకరణగా చదివి అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందువల్ల విషయాన్ని ఇజాలకు రచయిత్రులకు అంటగట్ట బడిన వాదాలకు దూరంగా కేవలం విషయంగా చదవడం నాకు అలవాటు. అందువలన వీరి కవిత్వంలో కొందరికి కనిపించినట్లు కుల, వర్గ, లింగ పరిమితులు నాకు అంతగా కనిపించలేదు. స్త్రీవాద కవిత్వంగా ఇది ఉంటుంది అనే ఆలోచనతో నేను ఈ పుస్తకం చదవలేదు. ఎటువంటి ఇన్హిబిషన్స్ లేకుండ చదవడం వలన నాకు ఇది అర్ధం అయ్యిన విధంగా ఇక్కడ ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను.
ఈ సంపుటిలో నాకు చాలా నచ్చిన మొదటి కవిత “నీలి రంగు హాండ్ బ్యాగ్” ఈ కవిత పై వాడ్రేవు చినవీరభద్రుడు గారు రాసిన వ్యాసం చాలా గొప్పగా ఉంది. ఆధునిక మహిళ జీవన విధానాన్ని, ఇంత చక్కగా సింపుల్ గా ప్రెజెంట్ చేయడం సాధ్యమని ఈ కవిత చదివే దాకా నాకు తెలీయలేదు. స్త్రీ జీవితంలో మారే ఇష్టాలు ప్రయారిటిలను చాలా గొప్పగా ఈ కవిత చెబుతుంది. ఇందులో ఒక్క వాక్యాన్ని కోట్ చేయలేం, మొత్తం కవితను చదవాలి అందులోని నిర్వేదాన్ని, అనుభవాన్ని అర్ధం చేసుకోవాలి. ఇక మరో కవిత “ఎర్ర మట్టి గాజులు”, దీన్ని చదవగానే హిందీ కవి నాగార్జున్ గారి “గులాబీ చూడియా” అనే కవిత గుర్తుకు వచ్చి తీరుతుంది. 60 సంవత్సరాల నాటి ఈ కవితలోని వాక్యరచన శైలి రేణుక గారి “ఎర్ర మట్టి గాజులు” లో అతికినట్టు కనిపిస్తాయి. అయితే నాగార్జున్ గారు తన కవితలో ఒక తండ్రీ కూతురు మధ్య అనుబంధాన్నిఅలాగే స్త్రీ కి సంబంధించిన వస్తువులను చూసి సమాజం చూపే చులకన భావాన్ని చాలా గొప్పగా అవిష్కరించారు. ఈ గాజులు మీరూహిస్తున్నట్లు ఎవరివో కాదు నా కూతురివి అన్నప్పుడు మారే భావాలు, ఈక్వేషన్సు, వారి కవితలో గొప్పగా కనిపిస్తాయ్. అయితే అదే విషయాన్ని ఒక స్త్రీ జీవన పరిమాణంలో స్త్రీ ధరించే వివిధ పాత్రల ద్వారా చూపుతూ ఆ ఎర్ర మట్టి గాజులతో స్త్రీ కున్న అనుబంధాన్ని అవి గుర్తుకు చేసే సున్నితమైన భావాల్ని అద్భుతంగా పలికించారు రేణుక గారు తన కవితలో. రెండు భాషలలో ఒకే సన్నివేశాన్ని ఒక పురుషుడు, ఒక స్త్రీ తమ భావాలకు అనుకూలంగా రాసినప్పుడు ఉండే వైవిధ్యంలో John Gray “Men are from Mars, Woman are from Venus” అనే పుస్తకంలోని ఫిలాసఫీ కనిపిస్తుంది. నిజంగా స్త్రీ పురుషుల ఆలోచనలలో ఎంత వ్యత్యాసం ఉందో, చాలా భావలలో వారిరో సారూప్యత ఉన్నా ఒకటిగా ఎందుకు ఉండవో చెప్పడానికి ఈ రెండు కవితలను ఉదాహరణగా తీసుకుని ఒక పేపర్ ప్రెజెంట్ చేయవచ్చు.
“ఒక సండాసు కథ”లో కొన్ని వాక్యాలు స్త్రీల పరిస్థితికి అద్దం పడతాయి. “రాత్రి ముట్టుకొట్టులో ఆక్రమించుకున్న భర్త నూతి మీద చేదడు నీళ్ళతో పవిత్రమై తెల్లవారి “అసుంటా వుండూ” అంటూ తప్పుకు తిరుగుతున్న మగడి చేష్టల నుంచి పుట్టిన రవ్వ” ….. ఈ వాక్యాలలో కొంత అగ్రకుల స్త్రీల బాధ కనపడుతుంది. ఏ కులానికి చెందినా స్త్రీ పురుషుని చేతిలో వస్తువుగా మిగిలిపోవడం వెనుక ఉన్న పురుషాధిక్యతను తలచుకుని అయినా ఇప్పటికీ స్త్రీలందరూ ఒక జాతిగా ఎందుకు సంఘటితం కాలెకపోతున్నారో అని వేదన పడుతుండటం సమాజాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటి నుండి నాకో అలవాటు.
ఇందులో నాకు నచ్చిన మరో కవిత “రెండు ముఖాలు” 1920 లో పికాసో చిత్రీంచిన “Weeping Woman,Head of a Woman” చిత్రాలు గుర్తుకు వస్తాయి. “నిజానికి భయపడేది అసలు ముఖంతో ఆ ముఖం దాచడానికి మాటల మట్టి గుట్టుమీద బిడారం వేసుకుని కూర్చుని మాటని పావురాయి చేసి రుమాల్లోంచి తీసి ఎగురవేసి యుద్దవ్యూహాలు రచించి మనిషిని పరాయివాడిగా చేద్దామని పిలుపునిచ్చి అసలు ముఖాన్ని వెనక్కి తిప్పి చూస్తూ వుంటుందీ’ ఈ వాక్యాలన్ని పికాసో మదిలోవా రేణుక గారి మదిలోవా లేదా ద్విముఖాలను చూస్తూ పరిశిలించే మన అందరి మదిలోనివా…. ఆలోచించే మేధ కు ఒక కనెక్టివిటీ ఉంటుంది. ఒక మాట, ఒక చిత్రం, ఒక ఆలోచన ఎప్పుడు ఎక్కడ ఎవరితో కలుస్తాయో చెప్పలేం. అందుకే వాటిని చాలా జాగ్రత్తగా సృష్టించాలి అని మేధావులు అంటూ వుంటారు. వీరి కవిత్వంలో గుంపులో ఒంటరితనం అనుభవించే ఇంటేలెక్చ్యువల్ బాధ కనిపిస్తుంది. “జనం మధ్యలో మనం మనకి మనమే అపరిచితులం” అని ఒక చోట అదే కవితలో “ఏదో సందర్భంలో ఒక ముఖం చేరువ అవుతుంది ఏ సందర్భం లేకుండానే మనసులో ప్రతిష్టింపబడుతుంది, దాన్నే గుండెల్లో మోస్తూ ఆలోచనల్లో పెనవేసుకుంటూ”…..అని మనల్ని ఏవి ఎందుకు ఎప్పుడు ఆకట్టుకుంటాయో ముందుకు నడిపిస్తాయో తెలీని కారణాన్ని వెతికే ప్రయత్నం చేయకుండా అది జీవన రహస్యం అని ఒప్పుకుని జీవించే ఒక తాత్వికురాలు కనిపిస్తుంది.
కొన్ని కవితలు వీరు చదివిన పుస్తకానికి ఇన్స్పైర్ అయ్యి, లేదా ఒక సినిమా చూసి లేదా కొన్ని చిత్రాలకు స్పందించి రాసుకున్నారు, ఈ కవితలు రాయడం వెనుక నేపద్యం వివరించినా పాఠకులు ఈ కవితలతో రచయిత్రిలా కనెక్ట్ కాలేరు ఆ పుస్తకాన్ని లేదా సినిమాని చూడకపోతే. ఇలా రాసిన కవితలలో భావ సౌందర్యం మాత్రమే నేను ఆస్వాదించ గలిగాను. అందుకే ఇవి చాలా వరకు రచయిత్రి మ్యూజింగ్స్ లాగానె అనిపించాయి. డైటింగ్ కాన్సెప్ట్ పై రాసిన కవిత ఇప్పటి స్త్రీలందరూ చదవవలసిందే. శరీర లావణ్యం కోసం పెద్ద పెద్ద రిస్కులు తీసుకోవడం సాధారణమయిపోయింది, దీనికి వీరంటారు “ఈ శరీరం సమాజానికి అప్పచెప్పినట్టుగా ఉంది కులాసాగా ఉన్నారా? ఎవరూ అడగటం లేదు, వెయిట్ ఎంత? ఏ డైట్ ప్లానులో ఉన్నారు? “ ….. నిజంగా మన జీవితాలలో ఎంత నాటకీయత వచ్చేసింది? మార్కెట్ మనల్ని ఎలా ఆక్రమించేసింది అన్న విషయం పై ఈ కవిత చదివి ఆలోచించకుండా ఉండలేం. మాతృత్వాన్ని గ్లోరిఫై చేయడం మన భారతీయ సంస్క్రుతిలో ఒక అతి పెద్ద అలవాటు. పిల్లలను పెంచి వారితో కాంప్రమైజులయ్యి మళ్ళి వారి పిల్లలకు అన్నీ చేయవలసి రావడం భారతీయ తల్లుల అదృష్టం. ఇది ఎంత మంది పూర్తిగా ఇష్టపడి చేస్తున్నారు అన్నది మనం అడగకూడని ప్రశ్న. నాపీ వీసాలకు ఎగబడే భారతీయ మాతృత్వాన్ని నా లాంటి వారు విమర్శిస్తే మమ్మల్నీ మాత్రుత్వ సౌందర్యం లేని స్త్రీలుగా అటు తిరిగి చెప్పుకోవడం నాకు తెలుసు. కాని నా లాంటి స్త్రీల కోసం వీరు “కొత్త ఉద్యోగం” అనే కవితను చాలా చక్కగా పాము చావకుండా, కర్ర విరగకుండా రాసారు. ఈ కవితలో ని ఆఖరి వాక్యాలలో నాకే వెదన నిర్వేదం కనిపించాయా… అందరికా అన్నది ఇంకా కనుక్కోవాలి “ ఎప్పుడు పెంచామో, ఎలా పెంచామో జ్ఞాపకాల పూలతోట నుంచి కొన్ని పూలూ ఏరుకోవాలి కొత్త వుద్యోగం కోసం”……
“ఏకాంతం” అనే కవితలో నాకు పూర్తిగా రమణ తత్వం కనిపించింది. “పక్షుల పాటలకి పల్లవి అందించాలంటే లోపలి రాగాలకి శ్రుతి నేర్పి తీరాలి ఒక్కళ్ళమే వెన్నెలలో స్నానం చేయాలంటే దాని నగ్నత్వాన్ని పంచుకోవాలి” “లోపలి మహా సముద్రాలు ఏకంకాగానే ఒడ్డున చేరుకున్న శవమై పోవాలి” “కళ్ళు తెరవగానే మూగుతున్న ముఖాలకి అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం లేని చరిత్రగా మిగిలిపోవాలంటే అరణ్యమై పోవాలి” అనే వాక్యాలలో రమణుడు కనిపిస్తాడు. చెత్తకుండీ పక్కన తాగి పడిపోయిన వ్యక్తిని చూసి స్పందించి వీరు రాసిన “కన్నీటి గుంటలో శవం” అనే కవితలో “ఎదురు చూసే కళ్ళలోతుల కన్నీటీ గుంటలో ఈదుతూనే ఉంటాడు” అనే వాక్యం లో ఎందరి తల్లుల, భార్యల, బాధ దాగి ఉందో….”ఒక దుఖం ఒక కన్నీటి చుక్క” అనే కవితలో మత సామరస్యాన్ని ప్రస్తావిస్తూ వీరు రాసిన ఆఖరి వాక్యాలు చాలా గొప్పగా ఉన్నాయి “ పెళ్ళికూతుళ్ళ చేతిలో రాళ్ళ గాజులు గలగలమన్నాయి రాజ్యలక్ష్మి, మెహరున్నీసా ఒకేలా సిగ్గుపడ్డారు మెహందీలో పాట ఢోలక్తో కలిసి నాట్యం చేసింది” “సైకిల్ బెల్లు” అనే కవిత వనజీవి రామయ్యగారిని ఉద్దేశించి రాసింది…. వన సంజీవయ్య అని తప్పు ప్రింట్ అయ్యింది ప్రతి వాక్యం నిశితంగా చదువుకునే వాళ్ళు దీన్ని సవరించుకో మని మనవి. “గోడ చెప్పిన కబుర్లు” అనే కవితలో రచయిత్రి రాసిన వాక్యాలు Roman Polanski 1965 లో తీసిన Repulsion అనే సినిమాలో ని పాత్ర గోడలను చూసి భయపడే సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చింది. “ముఖం లేని గోడలు గోడలలో వెతుకుంటున్న జీవితం ముఖాన్ని అణిచేసి దేహంమీద నుంచి పరుగెడుతున్న కాలం అడుగులు అడుగుల పగుళ్ళ నుంచి ఓ నిజం కళ్ళయెదుట నిలబడుతుంది” స్త్రీల suffocation ని తక్కువ పదాలతో ఆవిష్కరించబడ్డ కవిత ఇది. రేణుకగారి కవిత్వంలో Symbolisms ఎక్కువగా కనిపిస్తాయి, “వెలిసిన ఆకుపచ్చని చీర కొంగుని నడుముకు దోపుకుని” “స్కూలు పిల్లల పసి బుగ్గల మీద మందారంలాగ పూసి” “జ్ఞాపకాల పాత చెక్క బీరువా తెరిచి పల్లెటూరి గుమ్మంలో వొదిలిపెట్టింది” “పాడి నేల మీద రాలిన పెద్ద చినుకులా నన్ను తడిమింది” లాంటి expressions చాలా కనిపిస్తాయి.
వీరి కవిత్వానికి ఉన్న పెద్ద ఎసెట్ కనెక్టివిటి. ఇది మన అందరి ఆలోచన అనో మన మనసులోని భావం అనో మనచేత అనిపించేలా చేసే గుణం ఈ కవిత్వానికి ఉంది. కవిత్వంలో విషయం కన్నా feeling ఎక్కువ. Subjective or objective poetry కాదు వీరిది. Its an expression… pure expression and response towards the world around. అందుకే విషయం కన్నా భావం, భావ వ్యక్తీకరణ ప్రధానంగా రాయబడిన కవిత్వంలా దీన్ని అర్దం చేసుకోవాలి.

Friday, 4 January 2019

వాడ్రేవు చిన వీరభద్రుడు గారు నేను రాసిన "నీలి రంగు హ్యాండ్ బ్యాగ్" కవిత్వం మీద రాసిన విశ్లేషణ మీముందు ఉంచుతున్నాను ...


   కవిత్వం వొక కవికి ఏమిస్తుంది ? దుఃఖాన్ని జయించే శక్తీనిస్తుంది ,వొంటరి తనంలోంచి విముక్తి నిస్తుంది.ఇవేవి కాక పోతే ఎవరైనా కవిత్వాన్ని మెచ్చుకుంటే  కొండంత థైర్యానిస్తుంది ... కాని వొక్కోసారి చుట్టూ ముసురుకున్న చీకటిలోంచి ఇలాంటి విశ్లేషణ లే వెలుగు నింపుతాయి అనడంలో ఏ మాత్రం  సందేహం వుండదు....
వాడ్రేవు చిన వీరభద్రుడు గారు  నేను రాసిన   "నీలి రంగు హ్యాండ్ బ్యాగ్"
కవిత్వం మీద రాసిన విశ్లేషణ మీముందు ఉంచుతున్నాను ...

నాలుగైదు వారాలకిందట సి.వి.కృష్ణారావు గారి అమ్మాయి పార్వతి గారు 'నెల నెలా వెన్నెల' సమావేశం ఏర్పాటు చేసారు. ఒకప్పుడు కృష్ణారావుగారు ఆ వెన్నెలను నెలనెలా కిందకు దింపేవారు. ఈ మధ్య కొన్నేళ్ళుగా ఆ సమావేశాలు జరగడం లేదు. కాని, 'నాన్న మా ఇంటిదగ్గరే ఉంటున్నాడు, ఒకసారి నెలనెలా వెన్నెల మీటింగ్ పెట్టమంటున్నాడు, మీరు కూడా రండి' అని పార్వతి గారు పిలిస్తే వెళ్ళాను. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళా కృష్ణారావుగారి సన్నిధిలో కొందరు కవులు, కవయిత్రులు తమ రచనలు వినిపించారు.

ఆ సాయంకాలం రేణుక అయోల కూడా ఒక కవిత వినిపించారు. నెలనెలా వెన్నెల సమావేశాల్లోనే, దాదాపు ఇరవయ్యేళ్ళ కిందట, ఆమె  నాకు పరిచయమయ్యారు. 'లోపలి స్వరం' అనే తన కవితాసంపుటికి నాతో ముందు మాట  రాయించారు. ఒక ట్రాన్స్ జెండర్ ఇతివృత్తంగా రాసిన 'మూడవమనిషి' పుస్తకం ఆవిష్కరణ సభలో నాతో మాటాడించారు కూడా. కాని, ఆ సాయంకాలం ఆమె వినిపించిన కవిత నేనింతదాకా చదివిన ఆమె కవితలన్నిటిలోనూ గొప్ప పరిణతి చెందిన కవితగా వినిపించింది. అంతేకాదు, ఇంతదాకా నేను తెలుగులో చదివిన వచనకవితల్లో అగ్రగణ్యమైన కవితల్లో ఆ కవిత కూడా ఒకటనిపించింది.

ఆ కవిత, ఇంతదాకా ప్రచురితమయ్యిందో లేదో తెలీదుగాని, ఇక్కడ మీతో పంచుకోలేకుండా ఉండలేకపోతున్నాను.

*

నీలి రంగు హ్యాండ్ బ్యాగ్ .....
___________________

అల్మారా  సద్దుతుంటే జారిపడ్డ
పాత నీలిరంగు  హ్యాండ్ బ్యాగు
అటు ఇటూ  తిరుగుతున్న  సమయాలని
సందర్భాలని వో  దగ్గర పడేసి  వెళ్లిపోయాక
హ్యాండ్ బ్యాగ్ తో పాటు  ప్రత్యక్షమైన
కాలం  నాచేతిలో  పునర్జీవించింది. 

బరువైన స్కూల్  బ్యాగ్ నుంచి
బుజాలమీద వాలిన  హేండ్ బ్యాగ్ లో
ఇష్టాయిష్టాలు మనసుకి  దగ్గరగా  ఒక రహస్యం
దాచుకోవడానికి  ఒక చోటు  దొరికింది.
పుస్తకాలు, టిఫిన్ డబ్బా , లిపిస్టిక్ , దువ్వెన
కొత్తగా కొనుకున్న కాంపెక్ట్  పౌడర్, స్టేఫ్రీ తో
భయంగా  సిగ్గుగా  సిగ్గుగా
ఎన్నో  ఊహలని  దాచిపెట్టే
కాలేజీ  అమ్మాయిలా  ఉండేది .

పెళ్లి శుభలేఖలతో సిగ్గుపడుతూ బుజంమీద ఒదిగింది
మొదటి  బహుమతి  డియోడరెంట్ ,
చేతి రుమాలు , ఇంటి తాళాలు, బిల్లులతో
ఇష్టాలని  మరచి పోయిన  బాధ్యతలతో
కోడలిలా  ఉండేది.

తల్లి కాబోతున్న ఆనందంతో  బరువుగా ఊగింది
పాల బుడ్డీలు, డైఫర్లు, సిరప్ బాటిల్స్,
ఎగస్ట్రా చెడ్డీలతో  పాలవాసనలతో  చాలీ చాలకుండా
సెంటిమెంట్లతో  కొత్త బ్యాగ్ లోకి  మారకుండా
ఆచ్చం అమ్మలా ఉండేది ..

పిల్లలు చదువులంటూ
విదేశాలకి రెక్కలు కట్టుకుని ఎగిరినప్పుడు
ఖాళీగా బుజం మీద  వేళ్ళాడింది,
మనసు బరువుని తొలుస్తూ  వచ్చే కన్నీళ్ళని ఆపుకుని
తడి రుమాలుతో   ఓ పిచ్చి తల్లిలా  ఉండేది.

శుభలేఖలతో, కుంకుమ భరిణితో  చుట్టాల లిస్టుతో
హడావిడిగా సంతోషంగా  అల్లుడికోసం, మరోసారి కోడలి కోసం
బరువుగా బాధ్యతగా  భుజాలమీద సంతోషంగా
అచ్చం అత్తగారిలా ఉండేది.

కొన్నేళ్లుగా  బుజాలమీదనుంచి  చేతుల మీదకి  వచ్చేసింది.

నిశ్శబ్దాన్ని మౌనాన్ని ఛేదిస్తూ
రమణ లేఖలతో, కళ్లజోడు, సెల్ ఫోనుతో
మతిమరుపుతో  చిన్నదై, సంతోషాన్ని వెతుకుంటూ
అరచేతిలో  ఇమిడిపోయింది.

నీలంరంగు హ్యాండ్  బ్యాగు  అల్మారాలో  పాతబడి
రాలిపడి  గతాల  కావడిలా  ఉంది.

*

ఈ కవిత ఆధునిక మహిళ జీవితకథ అనవచ్చు. ఇందులో ఆమె పాటించిన శిల్పం నన్ను ముగ్ధుణ్ణి చేసింది. చేరా గారు ఉండి ఉంటే, ఈ కవితలో ఆమె పాటించిన వ్యూహాలమీద, ఒక విశ్లేషణ చేసిఉండేవారనిపించింది.

సాంప్రదాయిక లాక్షణిక శాస్త్రాల ప్రకారం చూసినా ఈ కవితలో రసనిర్వహణ సమర్థవంతంగా ఉంది. ఇందులో ఒక ఆధునిక మహిళ తాలూకు ఆరు దశల్ని ఆమె వర్ణించింది. ప్రతి దశలోనూ ఒక రసరేఖ స్ఫురణకోసం ఎటువంటి పదాల్నీ, ప్రతీకల్నీ వాడాలో అటువంటి విభావానుభావ సామగ్రినే ఆమె ఎంతో పొదుపుతో, ఎంతో సునిశితంగా ప్రయోగించింది. అంతిమంగా కవిత మనలో ఉద్దీపింపచేసే రసం కరుణ అని మనకు తెలుస్తూండటమే కాదు, కరుణకి స్థాయీభావమైన శోకాన్ని ఆమె దిగమింగుకుంటూండటం కూడా మనకు కనిపిస్తూనే ఉంది. ముందు చదివినప్పుడు, శోకాన్ని దిగమింగుకునే ప్రయత్నం వల్ల, కవయిత్రి శమం స్థాయీభావంగా శాంతరస ప్రధానమైన పద్యం చెప్తున్నదా అనే భావన మనకి కలగకపోదు. కాని, 'గతాల కావడి' అనే మాట వల్ల ఈ కవిత చివరికి కవయిత్రి మనసింకా స్తిమిత పడనేలేదనీ, ఇంకా శోకాకులంగానే ఉంటున్నదనీ మనం చెప్పవచ్చు.

అలా కాక ఆధునిక కావ్యానుశీలన ప్రకారం చూసినా ఈ కవిత మనలో రేకెత్తించే స్పందనలు అపూర్వం. ముఖ్యంగా, ఈ కవితా శిల్పం లో మాంటేజి నిర్వహించిన పాత్ర అసామాన్యంగా ఉంది. కవయిత్రి జీవితంలో మొదటిదశను వర్ణించిన పంక్తులు చూడండి:

'బరువైన స్కూల్  బ్యాగ్ నుంచి
బుజాలమీద వాలిన  హేండ్ బ్యాగ్ లో
ఇష్టాయిష్టాలు మనసుకి  దగ్గరగా  ఒక రహస్యం
దాచుకోవడానికి  ఒక చోటు  దొరికింది.
పుస్తకాలు, టిఫిన్ డబ్బా , లిపిస్టిక్ , దువ్వెన
కొత్తగా కొనుకున్న కాంపెక్ట్  పౌడర్, స్టేఫ్రీ తో
భయంగా  సిగ్గుగా  సిగ్గుగా
ఎన్నో  ఊహలని  దాచిపెట్టే
కాలేజీ  అమ్మాయిలా  ఉండేది'

ఇక్కడ బాల్యం, కౌమారం, నవయవ్వనం మూడూ కలగలిసిపోయాయి. కవయిత్రి తానెవరన్న ఐడెంటినీ గుర్తుపడ్డటానికి హాండ్ బాగుని ఆసరాగా తీసుకున్నప్పుడు స్కూలు బాగు హాండ్ బాగుగా మారిందెప్పుడో ఆమెకే తెలీదు. కాని హాండ్ బాగ్ గా మారినప్పుడు ఆమె ప్రపంచం ఎంతగా public ఆవరణలోకి అడుగుపెట్టిందో, అంతగానూ private కూడా అయింది. ఒక బాలిక స్త్రీగా మారడంలో, తనకు తెలియకుండానే వ్యక్తిగత, సామాజిక వలయాలెట్లా వేరుపడతాయో, ఆ రెండింటినీ తనకై తాను, తనలో తాను పొదువుకునే క్రమంలో ఆమె ఒక personal space కోసం ఎట్లా వెతుక్కుంటుందో-

'పుస్తకాలు, టిఫిన్ డబ్బా , లిపిస్టిక్ , దువ్వెన
కొత్తగా కొనుకున్న కాంపెక్ట్  పౌడర్, స్టేఫ్రీ తో '

అనే ఆరు పదాలతో ఆమె వివరించింది. ఒక కవిత నిర్మించడంలో అనుభూతి తీవ్రత ఒక్కటే చాలదు, ఆ అనుభూతిని తిరిగి మనకి అందిస్తున్నప్పుడు ఎంత సంయమనం ఉండాలో కూడా ఈ రెండు వాక్యాలూ సాక్ష్యమిస్తున్నాయి.

పేరుపొందిన మన వచనకవులు పైకి చెప్పరుగాని, వాళ్ళు విట్మన్ నీ, నెరూదాని అనుకరించడమే సాధన చేసినవాళ్ళు. కాని వాళ్ళు విట్మన్ నుంచి నేర్చుకున్నదంతా జాబితాలు రాయడమూ (listing), నెరూదా నుంచి నేర్చుకున్నదంతా వక్తృత్వమూ మటుకే. వట్టి జాబితా ఎప్పటికీ కవిత్వం కానేరదు, ఆ జాబితాలో ఏ కీలక సామగ్రిని ఎంపికచేస్తే రసోత్పత్తి అవుతుందో అది మటుకే కవిత్వం అవుతుంది, ఈ వాక్యాల్లాగా:

'పాల బుడ్డీలు, డైఫర్లు, సిరప్ బాటిల్స్,
ఎగస్ట్రా చెడ్డీలతో  పాలవాసనలతో  చాలీ చాలకుండా
సెంటిమెంట్లతో  కొత్త బ్యాగ్ లోకి  మారకుండా
ఆచ్చం అమ్మలా ఉండేది .. '

కాలేజీ అమ్మాయి, కోడలు, అమ్మ, పిచ్చి తల్లి, అత్తగారు-వీళ్ళంతా లోకంలో స్త్రీలు నిర్వహిస్తున్న వివిధ పాత్రలు. ఆ పాత్రల్ని మామూలుగా రచయితలూ కవులూ స్టీరియో టైపులుగా మాత్రమే చూపించడానికి అలవాటు పడ్డారు. కాని కవయిత్రి ఇక్కడ ఆ అన్నిపాత్రలనీ తనలోనే చూకుంటున్నది.అలా చూసుకోవడంలో ఒక తాదాత్మ్యం కూడా అనుభవిస్తున్నది. హేండ్ బాగుని వర్ణిస్తున్న నెపం మీద తన గురించి తానే చెప్పుకుంటున్నప్పుడు, ఆమె చెత్పున్నది ఒక స్త్రీ కథ మాత్రమే కాదు, ఆర్థిక స్వాలంబన పొందిన ఒక మహిళ కథ కూడా. చదువు, ఆర్థిక స్వావలంబన వల్ల ఆమె పరిథి విస్తరించింది. నెరవేర్చవలసిన కుటుంబ బాధ్యతలన్నీ నెరవేర్చింది. ఆ ప్రయాణంలో చివరికి చేరుకున్నది మళ్ళా ఒంటరితనాన్నే. తనకు తాను ఒంటరిగా మిగిలిపోయిన దృశ్యాన్ని ఆమె ఎంత ఆర్తిగా చిత్రించిందో ఈ పంక్తులు మరోసారి చూడండి:

'నిశ్శబ్దాన్ని మౌనాన్ని ఛేదిస్తూ
రమణ లేఖలతో, కళ్లజోడు, సెల్ ఫోనుతో
మతిమరుపుతో  చిన్నదై, సంతోషాన్ని వెతుకుంటూ
అరచేతిలో  ఇమిడిపోయింది. '

అలాగని ఈ శోకం దేన్నో పోగొట్టుకున్న శోకం కాదు, గడిచిన జీవితపు అనుభవాల తలపోతవల్ల కలిగే దిగులు.

ఈ కవిత విన్నాక సమకాలిక తెలుగు కవిత మీద గౌరవం పెరిగింది. ఈ కవితని ఏడెనిమిది నిమిషాల లఘుచిత్రంగా తీయొచ్చనిపించింది. అందుకు కావలసిన స్క్రీన్ ప్లే కవితలోనే ఉంది. మరి వెంకట్ సిద్ధారెడ్డి, కరుణ కుమార్, మహేష్ కత్తి ఏమంటారో!

_____________________

Image courtesy: dreamstime.com