Tuesday, 28 July 2015

గజల్స్ లో చందన్ దాస్ పాడిన గజల్స్ ఆప్పుడప్పుడు విన్నప్పటికి కొన్ని చాల ఇష్టపడతాను అందులో ఈ గజల్ నాకు చాల ఇస్టం.


కొన్ని జ్జాపకాలు ,కొందరు మనుషులని మరచిపోలేము ,మరచిపోవాలి అనుకుంటూ
మళ్ళి మళ్లీ వాళ్ళ గుర్తులతో ,వాళ్ళ రహదారులని కొలుచుకుంటూ ఆగిపోతాము ఆగిన 
ప్రతిసారి ఇది యింక ఆఖరు యింక తలచుకొను అన్నట్లే అనిపిస్తుంది ఈ గజల్ వింటుంటే
నా భావాలతో ...
Aakhri khat hai mera
Lyrics -- Ibrahim Asq
Composed by -- Chandan Das
Aakhri khat hai mera, Jispe hain naam tera.
Aaj ke baad koi khat na likhoonga tujh ko.
ఇదే నా ఆఖరి ఉత్తరం,దాని మీద నీ పేరు వుంది
ఇంక ఇవాల్టి నుంచి నీకు ఎలాంటి ఉత్తరం రాయనిక
Bhool jaoonga tujhe yeh to nahin keh sakta
Dil pe chalta hain kahaan zor mohabbet karke.
Phir bhi is baat ko leta hoon Kasam-E-Humdum
Main na tadpaoonga tujh ko kabhi nafrat karke.
Bewafa too hain kabhi main na kahoonga tujhko.
Aaj ke baad.....
నిన్ను మరచిపోతానా? ఇది మాత్రం చెప్పలేను
మనసు మీద ప్రేమ జోరు ఉండనే వుంటుంది
అయినా నా ప్రాణమా ఒట్టు వేసి చెప్తున్నాను
ద్వేషిస్తూ నిన్ను కష్ట పెట్టను ఎప్పటికి ,నమ్మించి దూరం
జరిగావని ఎప్పటికీ అనను .
Yaad bhegee huye lamho ko sataayage agar
Aap apne se kaheen door nikal jaoonga.
Ittefaqan heen agar tujhe mulaquaat hui
Ajnabi ban ke teree rah se tal jaoonga.
Dil to chaahega par aawaz na doonga tujhko
Aaj ke baad.....
జాపకం తడిపిన ఆ క్షణాలు నన్ను సతాయించినా
నాకు నేను దూరంగా వెళ్ళిపోతాను .పొరపాటున
నిన్ను కలవడం జరిగితే ,పరాయి వ్యక్తిలా నీ దారిలో నుంచి
తప్పుకుంటాను ,మనసు నీకోసం తపిస్తుంది కాని నిన్ను పిలవను
ఇవాల్టి నుంచి ఎప్పటికీ ...
Ye tera shahar ya caliyaan baro deewaar ye char
Mera tute huye khabon ko yahi jaanat hai.
Kal ye sab chhod ke janaa hai bahut door mujhe
Jis jagaah dhoop hai, sahera hai, metri kismat hain.
Yaad mat karna mujhe ab na miloonga tujhko.
Aaj ke baad
ఈ నీ నగరం ఈ దారులు జ్జాపకాలు నిండిన గోడలు
ముక్కలైన నా కలలు వాటికి తెలుసు ,రేపు ఇవన్నీ వదిలి
చాల దూరం వెళ్ళాలి నేను నేను వెళ్ళే. చోటులో ఎండ, నీడ
కొలతలకి అందని అదృష్టం వుంటాయి ,నన్ను యింక గుర్తు పెట్టుకోకు
ఇవాల్టి నుంచి నిన్ను ఎప్పటికీ కలవను ..
ఇదే నా ఆఖరి ఉత్తరం,దాని మీద నీ పేరు వుంది ..
A

Tuesday, 30 June 2015

Haath Chhute Bhi Toh Rishte Nahi Chhuta Karate Movie: Pinjar (2003) Singer(s): Jagjit Singh, Preeti Uttam Singh Music By: Uttam Singh Lyricist(s): గుల్జార్


ఈ గజల్ నాకు చాలా ఇష్టమైన. వాటిల్లో ఒకటి .
కొన్ని బంధాలు ఎంత బలీయమైన వంటే వదులుకో లేక వాటివెంట పరుగులు తీస్తూనే వుంటాము , అందని వాటి నీడలో సేద తీరాలని ఆశపడుతూ కలలో బతికేస్తూ ఉంటామని పిస్తుంది
ఇది వింటున్న ప్రతిసారి .
Haath chhute bhi toh rishte nahi chhuta karate - (2)
Waqt ki shaakh se -2 lamahe nahin tuta karate
Haath chhute bhi toh rishte nahi chhuta karate
Chhut gaye yaar na chhuti yaari maula - (3)
ఎన్నాళ్ళో కలిసి నడవాల్సిన చేతులు విడిపించుకు వెళ్ళిపోయినా
బంధాలు మాత్రం విడిపోవు
కాలం నీడలో ఒదిగిన కొన్ని క్షణాలు మాత్రం ముక్కలవకుండా
మిగిలిపోతాయి
స్నేహితుడు ఒదిలి వెళ్ళిపోయినా మౌలా స్నేహం మాత్రం ఒదలలేదు
Jisane pairon ke nishaan bhi nahi chhode pichhe - (2)
Uss musaafir ka -2 pata bhi nahi puchha karate
కనీసం అడుగుల జాడలు కుడా ఒదలి వెళ్ళని ఆ బాటసారి
చిరునామాని అడగాల్సిన అవసరం కుడా లేదు .

Tune aawaaj nahi di kabhi mudakar warana - (2)
Hum kayi sadiyaan -2 tujhe ghumake dekha karate
నువ్వు వెనక్కి తిరిగి పిలవను కుడా పిలవలేదు
అయినా ఎన్నో ఏళ్లుగా నిన్ను పోగొట్టుకుని కుడా చూస్తూనే వున్నాను
Beh rahi hai teri jaalib hi jameen pairon ki - (2)
Thak gaye daudate -2 dariyaao ka pichha కరాటే
నీ వైపుకే ప్రవహిస్తోంది పాదాలకింద నేల
అలసిపోయాను వెతికీ వెతికీ ఒడ్డు చేరుకోవడం కోసం.
Haath chhute bhi toh rishte nahi chhuta karate - (2)
Waqt ki shaakh se -2 lamahe nahin tuta karate
Haath chhute bhi toh rishte nahi chhuta కరాటే
ఎన్నాళ్ళో కలిసి నడవాల్సిన చేతులు విడిపించుకు వెళ్ళిపోయినా
బంధాలు మాత్రం విడిపోవు
కాలం నీడలో ఒదిగిన కొన్ని క్షణాలు మాత్రం ముక్కలవకుండా
మిగిలిపోతాయి
స్నేహితుడు ఒదిలి వెళ్ళిపోయినా మౌలా స్నేహం మాత్రం ఒదలలేదు .....
(మీరు కుడా ఈ గజల్ ఒకసారి వింటారు కదూ....)

Thursday, 18 June 2015

అఫ్సర్ గారు రాసిన " ఇద్దరి చీకటి " చదువుతుంటే ఇలాగే అనిపించింది ... ఇద్దరి చీకటి

ఎందరో ప్రముఖుల కవిత్వాలు చదువుతూ వుంటాము ,వాళ్ళతో పాటు అమ్మతనంలోకి
ఊరిలోకి ,ప్రకృతిలోకి ,ఉద్యమాల ఉద్రేకాలలోకి వెళ్ళిపోతూ వుంటాము ,కొన్ని సార్లు ఏదో
చెప్పాలను కుంటాము ,కాని చెప్పలేకపోతాము రోజువారి జీవితంలో మునిగి పోతాము
అప్పుడప్పుడు కొన్ని కవితలు మాత్రం ఇలా అనిపిస్తాయి ...

ఒక పాట వేటాడుతుంది పాడుకుని ,పాడుకుని అలసిపోయి ఒక సంతృప్తిని
మిగుల్చు కుంటాము . అదే ఒక కవిత్వం వెంటాడితే మనసులోపలే మాట్లాడుకుని
అక్షరాల్లో మునిగి పోయి ఒకో సారి దారి దొరకని చౌ ర స్తాలో నిలబడిపోతాము.
అఫ్సర్ గారు రాసిన " ఇద్దరి చీకటి " చదువుతుంటే ఇలాగే అనిపించింది ...
ఇద్దరి చీకటి
1
చాలా సార్లు నువ్వొక గుహలాంటి చీకటి
లేదూ, చీకటిలాంటి గుహ.
కళ్ళు చికిలించుకొని అన్ని చూపుల్నీ వొక్క చోటే గుచ్చుకొని
ఎంత సేపని చూస్తానో
నీలోకి వొకింత కూడా రాలేను, నువ్వూ రానివ్వవు
నీ ఎత్తాటి గోడల మధ్యకు-
వొక్క చినుకయ్యీ రాలలేను, నువ్వూ రాలవు
ఎవరి ఎడారిలో వాళ్ళం!
అయినా గానీ
ఎంత ఆశగా చూస్తూ వుంటానో పసి కళ్ళ దాహంతో-
* * * *
* * * *
చీకటి మనసు లాంటి గుహలోకి కళ్ళ దాహంతో ఎంతసేపైన చూడగలను అంటారు
మరోసారి ఎత్తటి గోడలాంటి నీ మనసు ఎడారిలో ఒక చినుకై రాల లేను అంటారు
మనసుని చీకటి చేసుకుని ,ఎడారి చేసుకుని ప్రేమించుకున్నాము అనుకోవడం ఎంత
వెర్రి తనం అనిపిస్తుంది చదువుతుంటే ,అయినా ఒక ఆశ పసి మనసుతో అమాయకపు
కళ్ళతో ప్రశ్నిస్తుంది నీకోసం ఎదురు చూస్తూ ఉంటానని ...
మనసుని పసితనం చేసుకోవడం చాల కష్టం అందుకే కవి పసితనపు నీడలని జారవిడుస్తారు
ఇక్కడ .
2
వద్దు వద్దని నువ్వు చెప్తూనే వుంటావ్ కానీ
ఇసక కంటే పొడి పొడిగా వుండే
ఆ కొద్ది మాటల్నే వొకటికి పదిసార్లు చదువుకుంటూ వుండిపోతాను
మునిమాపు చీకట్నించి నట్టనడి రాత్రి దాకా
నీ వాక్యాల చుట్టూరా మూగ దీపమై వెలుగుతూ వుంటాను,
ఎంత చలి నెగడునై కాలిపోతూ వుంటానో
తెగే నరాల ఉన్మత్తతలో-
వద్దు అనడం కంటే పొడి పొడిగా సందేహలలో రాలిన మాటలు ఏరుకుని
చదువుకోడం ఎంత కష్టం ,అయినా కవి వాటిని ఏరి వాక్యాల మధ్య దీపంలా
వెలుగుతాను అంటారు , ఇసుక మాటలు పట్టుకుని చలి చుట్టుకున్న మనసులో
నెగళ్లు వెలిగిస్తారు ,ప్రేమకి ఇంతటి బలమా ఇంత సహనమా,అనిపిస్తుంది చదువుతుంటే
ఒకింత ధైర్యంగాను వుంటుంది ...
3
సమూహలకేమీ కొదువ లేదు యిక్కడ
పలకరింపుల వానలకూ తెరపి లేదు
యింకాస్త గుండె ఖాళీ చేసుకొని
వూరికే వచ్చెళ్ళే తడినీడలూ కొన్ని.
అయినా గానీ,
అన్నిట్లోనూ అందరిలోనూ వొక్క నువ్వే నా కళ్ళకి-
యీ చుట్టూ శేష ప్రపంచమంతా గుడ్డి గవ్వయిపోతుంది నాకు.
అందరు వుంటారు సమూహంగా పలకరిపులో తడి వుంటుంది పొడిగా
ఆ తడిలో నువ్వు లేవు అంటారు , ఏ ఒక్క కళ్ళలో నువ్వు లేవు అంటారు
ఒక్క సారిగా ఈ వాక్యాలతో పాటు మనం ఎటో వెళ్లిపోతాము ,ఒక్క క్షణం ఆగిపోతాము.
ప్రపంచమంతా గుడ్డి గవ్వగా మార్చిన ఆ అందమైన కళ్ళని మనం కుడా వెతకడం
మొదలు పెడతాము ...
నిజమే, కలిసి చూసే వెలుగులూ వుంటాయి,
అడుగులు కలిపే మలుపులూ వుంటాయి
మరీ ముఖ్యంగా
యిద్దరమూ వొకే చీకట్ని కలిసి చూస్తున్నప్పుడు
వొక నమ్మకమేదో వెలుగై ప్రవహిస్తుంది
రెండు దేహాల నిండా-
అవునా? కాదా?
అవుననో కాదనో కూడా చెప్పవా?!
ఇప్పుడు ఈ వాక్యాలలో కవి హృదయం ఒక నమ్మకమై ప్రవహిస్తుంది
కలిసి చూసే చూపులకి చీకటి అంటినా రెండు దేహాలు ఒకటే అనే నమ్మకాన్ని
బలంగా చెప్తూనే ,నీ మాటే నా మాట అని చెప్పే ప్రేమ వేసవి నీడలా వుంటుంది
ఏ కవి హృదయాన్ని తేలిగ్గా అంచనా వేయలేము ఒక అక్షరంలో వేల చిత్రాలు వుంటాయి
నేను. అఫ్సర్ గారి ఈ చిత్రానికి పై పై రంగులు వేస్తూ నిజమైనవి అనుకున్ననేమో ?



Tuesday, 5 May 2015

/./ ఈ పుస్తకాన్ని గురించి ఎంత రాసినా తక్కువే !

   
      ముఖ పుస్తకాన్ని  తెరిచి 
      వెలుగు తలుపు మీద
      ఆడే ఆటని చూడగలగాలి 

     గోడల మీద  రాతలు రాస్తూ 
     అక్కడే వుంటూ  ఎవరికి వారే 
     గొప్పగా  మౌనంగా మిగిలి పోవడం  చూడాలి 

     నవ్వే చిరునవ్వులో  నవ్వులేకపోవడం చూడాలి 
     బయట మాటలో  లోపలి మాటలో 
     దట్టంగా  అల్లుకున్న  నాచు కదలడం 
     నాచులో పూలు పూయించి 
     రమ్మని ఆహ్వానించే  ఆటని  చూడాలి 

     విరిగిపడే పెళ్లలుగా కొందరు 
     పిట్టల్లా ఎగిరే కొందరు 
   నాటకాన్ని  ప్రదర్శించే కొందరు 
   గోడలనిండా  రాతలు రాస్తూ  వేళ్ళు దాచుకోవడం  చూడాలి 

   ముఖాలకి పొద్దున్న  రాత్రి  తేడా లేదు 
   నిత్యం  వెలిగే బల్బు కింద  ఎగిరే పురుగులు 
    రెక్కలు చూపించిబెదిరించడం  చూడాలి 
    
    కోపం వస్తే  ద్వారాలు మూసి 
    ముఖాలని దాచుకుని  రహస్యంగా 
    గోడలమిద  రంగు నీళ్ళు  జల్లడం చూడాలి 

     విసుగు ముఖాలు  చూపిస్తూ 
    తిట్టుకుంటూ  రాతలు  పులిమి 
    వేళ్ళ ముద్రలు  గోడలమీద  వుంచి 
    గొప్పలు పోయే  ఆటగాళ్ళని  చూడాలి 

   ఈ కిటికీ ఎన్ని సార్లు  తెరిచి మూసి చూసినా
   చదివే  కంటికి అక్షరాల  కబాడీ ఆట కనిపిస్తూనే వుంటుంది 

  




   

Wednesday, 22 April 2015

 

   
ఎం.నారాయణ శర్మ's photo.
రేణుకా అయోల -నా నడకలో నగరం
______________________________________
యూంగ్ సాహిత్యానికి రెండు పార్శ్వాలుంటాయన్నాడు.ఒకటి మనస్తత్వాత్మక మైంది రెండు దర్శనాత్మకమైంది.(Psycologocal and Visionary)మనస్తత్వానికంటే మించిన సామూహిక చేతన ఒకటి మనిషిలో ఉంటుందని యూంగ్ నమ్మాడు.
ఆధునిక కాలంలో ఫ్రాయిడ్ అతని అనుయాయులువేసిన మార్గాలు సాహిత్యాన్ని అర్థం చేసుకోడానికి కొత్తమార్గాలనన్వేషించాయి,ఆవిష్కరించాయి.రేణుకా అయోల కవితలో సాహిత్యతత్వమూ,మనస్తత్వమూ రెండూ ప్రత్యక్షంగా కనిపిస్తాయి.వేరొక ప్రదేశంలో ఉండి అక్కడి ప్రకృతిని చూసి తన దేశపు ,ప్రాంతపు ఉనికిని కవితలో రికార్డ్ చేయటం ఇందులో కనిపిస్తుంది.
"ఏరుకోగలిగినంత ఏకాంతంలో ఎర్రగులాబీల గుత్తులు చూస్తు నడుస్తాను
పల్చటిగాలి చుట్టుకుని అక్కడి మట్టిని గుర్తుకి తెస్తుంది
ధూళి రేగుతున్న జ్జాపకం ఒకటి పక్కనుంచి వెళ్ళిపోతుంది "
ఈవాక్యాన్ని చూస్తే ఇందులో ఙ్ఞాపకం రూపంలో తనను వెంటాడుతున్నదేదో అర్థమవుతుంది.ఫ్రాయిడ్ "ప్రాక్ చేతనా"న్ని గురించి చెబుతున్నప్పుడు ఙ్ఞాపకాలను గురించి చెప్పాడు.ప్రాక్చేతనలోని అంశాలు దమనానికి లోనుకావు కాబట్టి అవి గుర్తుకు వచ్చే అంశాలు సంఘటనలు తారస పడినప్పుడు అవి చుట్టుముడుతాయి.ఫ్రాయిడ్ దీన్ని సంసర్గ విధానం(Associative Process)అన్నాడు.సన్నిహితంగా ఉండే రెండు అంసాలలో ఒకటి కనిపిస్తే మరొకటి గుర్తుకు రావటం.దమన శక్తులుగనక ప్రభావం చూపిస్తే అంశాలు స్వప్నాలుగా ప్రవేశిస్తాయి.
ఎర్రటి గులాబీలు,పల్చటిగాలి ,మట్టినిగుర్తుకు తేవడం ఇలాంటిదే.ఇలాంటి చేతన గురించి "మాండూక్యోపనిషత్తు" కొంత చెప్పింది.
"జాగరితస్థానొ బహిష్ప్రఙ్ఞ:"-ఇది జాగరితమై బహి: అంటే దేశ కాలస్పృహతో ఉంటుంది..ఇందులో కనిపించేది ఇదే...ఈ అంసాన్ని ప్రత్యక్షంగా వ్యక్తం చేసే అంశాలు కవితలో ఉన్నాయి.
"మనుషులు మనుషులు తగులుకుని వేడిగాలిలో మగ్గిపోయే ఒక వేడి జాపకం
నాదేశంలోకి తీసుకు వెళుతుంది
కూలిపోతున్న పచ్చదనం ఆకులు నామీద రాలుతాయి
ద్వారాలు వేరవుతున్న చప్పుడు
అమాయకంగా ప్రాణాలు తీసుకున్న చప్పుడు
వాగ్దానాలు గుప్పిస్తున్న చప్పుడు
ఆనందంలో ఎరుపెక్కిన కళ్ళు
ఆశల పల్లకీలో ఊరేగుతున్న చప్పుడు"
ఇవన్నీ ఈమధ్యకాలంలో రాష్ట్రంలో జరిగిన సంఘటనలని ప్రతీకాత్మకంగా చెబుతున్నాయి."ద్వారాలు వేరవటం""ప్రాణాలు తీసుకున్న చప్పుడు"-ఇలాంటివన్నీ ఆతరహా కాలిక స్పృహ కలిగిన అంశాలే.
ప్రతీవారిలో ఒకస్థిరమైన మానసిక వాతావరణం ఉంటుంది.అయోలాగారిలోనూ ఉంది.ఇది కొన్ని పద బంధాలద్వారా వ్యక్తమౌతుంది.
ఆకుపచ్చని గడ్డి అలలపై/ఆకుపచ్చని నిశ్బబ్ధం / ఆకుపచ్చని నీడ/ఆకుపచ్చని లోయ/ పచ్చదనం ఆకులు /ఈ పదాలు ఆ బౌద్ధిక వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి.-ఒక శుభకరమైన ఆశంసని కోరుతూ ఈ కవిత ముగుస్తుంది.
ఇవి కూడా ఫ్రాయిడ్ చెప్పిన మనోనూర్తిమత్వ నిర్మితి(Anotamy of mental Personality)సంబంధించినవే..మంచికవిత అందించినందుకు అయోలా గారికి ధన్యవాదాలు.
Like · Comment · 

Tuesday, 21 April 2015


జుగల్బంది



      


కాలచక్రంతో యుధం ముగిసాక
గూటికి చేరుకున్న పక్షిని

సమస్యలు నాతోపాటూ ముగింపులేని తూనీగ గుంపులు
పరిష్కారం కావని హెచ్చరిస్తున్న మనసు
ఆశలని ఎక్కడో వదిలేసుకుంటూ విడిచే చెప్పులు

ఇంట్లో పనికి రోబోట్ గూటీలో దూరగానే
వేయిచేతుల వందల సంజాయీషీల ష్యామే ఎ గజల్ ముదలవుతుంది
జుగల్బందీలో అందరూ గాయకులే
ఆగని పాటకి రాత్రీతెర అడ్దం పడుతుంది
నిద్ర తలగడఊయల వేసి జోకోడుతుంది
శరీరం బంధాలలేని నావలో తేలికపడుతూ
కలల సముద్రుని ఒడిలొ గారాలుపోతుంది

మొదటీ సూర్యకిరణం
ప్రకృతిని అల్లుకుంటూ వెలుగు చాపని గదిలో పరుస్తుంది
సరిగ్గా అప్పుడే వందల పక్షులు నాతోపాటూ గాలిలోకి ఎగురుతాయి

కాఫీ ఫిల్టర్లో చేరుకున్న మరుగుతున్ననీళ్ళు
నిన్నటి ఉదయాలని
మొదటి కప్పు కాఫీలోకి
చెక్కరతో కలిపేసి పాలలోకి జార్చేస్తాయి

కొత్త ఉదయం రంగులగజిబిజిలో అలావాటు పడిన ప్రాణం
ఆశల పల్లకీ మోస్తూ చనిపోయిన సమస్యలకి ప్రాణదానం చేస్తుంది.
ఉద్యోగం బందీఖానాకి హజరుపట్టీ వెసుకోవడానికి
చెప్పులుతో మొదలైన అడుగు వెలుగుతోపాటూ ప్రయాణిస్తుంది..

Sunday, 19 April 2015

చదివిన కవిత్వ సంపుటి -27
(కవి సంగమం)
కవిత్వ సంపుటి :- " లోపలి స్వరం "
పరిచయ కర్త : Rajaram Thumucharla
కవిసంగమం పొయెట్రీ గ్రూపునుంచి............
...See More
చదివిన కవిత్వ సంపుటి -27
(కవి సంగమం)
పరిచయమవుతున్న కవిత్వ సంపుటి :- " లోపలి స్వరం "
కవిత్వ సంపుటి రాసిన కవయిత్రి :- "రేణుక అయోల "
సంపుటిని పరిచయం చేస్తున్నది :- "రాజారామ్.టి "
"చూసిన దాన్నో,చదివినదాన్నో,విన్నదాన్నో 'లోపలిస్వరం"తోకవిత్వం చేసింది రేణుక అయోల నే"
"The day I burn" ఆరోజు పదే పదే వెంటాడుతోంది "
ఆనందమో,సందేహమో
మెదడుని మొద్దుబారుస్తుంది
విన్నదే విని,వినీ వినీ
పక్షవాతం వచ్చినవాళ్ళలా
సొఫాలకి అతుక్కుపోయాక-
ఆ కరెంట్ వాడికే మనమీద దయ కలుగుతుంది
ఆగిపోయిన టి.వి ముందు నుంచి లేచిన మనం
చెర నుంచి విడిపించుకున్న ఖైదీలం..
మన కోసమే మనం కొంత మిగుల్చుకున్న జీవితాలం"
ఆ రోజు నిజంగా విన్నదే విని వినీ,చూసిందే చూసి చూసీ సోఫాలో పక్షవాతం వచ్చినవాడిలా అతుక్కూపోయి,ఇది తప్ప మరేదీలేదా? నాకోసం నేను కేటాయించుకొనే జీవితకాలం లేదా?-అని కాలి కాలీ,మరగి మరగి కరగిపోయిన రోజు కరెంట్ పోయి ఆగిపోయిన టి.వి ముందు నుంచి లేచి చెర నుండి బయటికొచ్చి స్వేఛ్చ పొందిన ఖైదీలా హాయిని పొందిన నాకు వినబడిన "లోపలి స్వరం"లోంచి వినబడిన మాటలు ఇవి. రేణుక అయోల గారి వాక్యాలివి.
ఆవిడది విద్వత్కవి కుటుంబం.ఆమె ముత్తాత శ్రీ కావ్యకంఠ గణపతిమహాముని. కవిత్వపు జిలుగులు తెలిసిన కవితా హృదయం గల కవయిత్రి.ఒఠ్ఠి హృదయం గలిగిన కవయిత్రే కాదు గట్టి కవిత్వం రాయగలిగిన నేర్పరి ఈమె.ఆమె ఏ చూసిందో,ఏం వినిందో, ఏం చదివిందో వాటిని తన హృదయం ఎట్లా కంపిస్తే అట్లా, జీవితంలోని అతి సాధారణ అనుభవాల్ని సైతం అతి చిన్న వాక్యాలతో,అత్యంత ప్రతిభావంతంగా కవిత్వం చేసిన కవయిత్రి ఎవరంటే రేణుక అయోల గారు.
"కాటుక లాంటి అడవి
నన్నెవరు చూడరనుకుంది
కారు మబ్బులు కమ్ముకొని
గాలి అందించిన చినుకు వరదలో
అడవి సేద తీరుతోంది"-
అడవి తీసుకొనే విశ్రాంతిని ఇంత అందంగా ఎవరు చిత్రించగలరు?
"చిన్న విత్తు
తనకు తానే భూమిలో ఒదిగి
కాలాని నమస్కరిస్తూ లేత చిగుళ్ళతో
గున గున ఎదిగి పలరిస్తుంది"
విత్తనం అంకురించడం కాలానికీ నమస్కరించడంగా ఎవరూ ఊహించగలరు?
"నాగలి పట్టిన చేతులు
ఎడ్ల బండిని అదలించిన చేతులు
ధాన్యం,కొట్లో నింపిన చేతులు
పట్టె మంచం,తెల్లటి బొంత
కాళ్ళ దగ్గర రాగి చెంబు
తాతయ్య వెంటాడే ఙ్ఞాపకంలా ఉండేవారు"
ఇలా తాతయ్య రూపాన్ని మనస్సులో ముద్రించుకపోయేటట్లు రూపవర్ణన చేసిందెవరు?
"జనం మధ్యలో మనం,జనంలో ఒకరైన మనం
మనకే మనమే అపరిచుతులం
పరిచయాల్లేని ముఖాల మధ్య
మన ముఖమే మనకి అపరిచితం"
సమూహంలో ఒంటరైన మనిషి, తనను తానే గుర్తుపట్టలేని,తన అస్తిత్వాన్ని తానే తెలుసుకోలేని మనిషిని గూర్చి ఇంత తాత్వికంగా చెప్పిందెవరు?
అడవి విశ్రాంతిని అందంగా చిత్రించింది,విత్తనం మొలకెత్తే దృశ్యాన్ని కాలానికీ నమస్కరించడంగా ఊహించింది,తాతయ్య ఙ్ఞాపకాలతో ఆయన రూప చిత్రణను కళ్లముందు నిలబెట్టింది,ప్రజా సమూహంలో ఒంటరి అయిన మానవుని అస్తిత్వం ఆ మానవుడే గుర్తు పట్టలేనంత మారిన వైనాన్ని తన "లోపలి స్వరం"తో చెప్పింది రేణుక అయోల గారే.
చిన్నప్పటి నేస్తం ఇంట్లోంచి గుర్తు తెలీకుండా వెళ్ళిపోవడమో,సహాధ్యాయి అకస్మాత్తుగా తిరిగిరాని లోకాలకీ చేరుకోవడమో, ఏదో ఒక వ్యసనపు మత్తులో అయినవార్ని,వున్న వూర్ని వీడి వెళ్ళిన వ్యక్తి ఙ్ఞప్తికి రావడమో,శిథిలమైన వూరి ఆనవాళ్ళు కళ్ళ ముందు నిలబడటమో,ఇంట్లోని పాత ఫోటొ గతించిన గుర్తులను తిరిగి తీసుక వచ్చి వొక దుఃఖపు వ్యధను కలిగించడమో,జీవితంలో ఎన్ని మాధుర్యపు అనుభూతులున్నా ఏదో తెలియని ఒంటరితనపు స్పర్శని అనుభవించడమో,చిన్ని పాపల ముద్దు మాటల మోహాంలో మునిగిపోవడమో,వూర్లోని చెరువు అద్దంలో ముఖాన్ని సరిదిద్దుకోవడమో ఎపుడైనా ఎవరికి వారు తమలోకి తొంగిచూసుకోవడమో,ఏదో ఒక రోజు వేసవి సాయంకాలం వర్షానికి తడవడమో,మన మతం కాని వారితో వున్న స్నేహాన్ని బేరీజు వేసుకోడమో,అభివృద్ది పేరిట జరిగే రోడ్డు మార్పుల్లో రూపు కోల్పోయిన చెట్లను చూసి వేదన పొందడమో,ఇంట్లో వున్న పాత సామానును చూచిపారేద్దామా?వుంచుకుందామా?అనేసంశయానికిగురికావడములాంటిఅనుభవాలు,అనుభూతులు అందరి జీవితాల్లోను వుంటాయి.అయితే వీటన్నిటిని కొందరు ఙ్ఞాపకాల బీరువాలో భంద్రంగా దాచుకొంటారు.కొందరు విస్మృతపథంలో వదిలేస్తారు.ఒకరో ఇద్దరో వాటిని మెరిసే అక్షరాలు చేసి నెమలీకలా బతుకు పుస్తకంలో దాచి పదే పదే చూసుకొంటుంటారు.
నేటి కాలంలో జీవితం నదిలా సంక్లిష్టాల,సంక్షోభాల,సుఖదుఃఖాల దరులను ఒరుసుకొంటు ప్రవహిస్తున్నది.అట్లా ప్రవహించే మానవ జీవితపు నదిని ప్రభావితం చేసే పైన చెప్పిన అత్యంత సూక్ష్మాతిసూక్ష్మ అనుభూతులు,రోజువారి అనుభవాలు కొందర్ని తీవ్రంగా స్పందింపచేసి అడ్భుత కవిత్వాన్ని రాయిస్తాయి.తన జీవిత నది యానంలో ఎదురైన అనేకానేక అనుభవాల అనుభూతుల స్పందనల్ని, రేణుకసాగేయేరులా,ఊగే సెలయేరులా,నడిచే నదిలా అందంగా,సాంద్రంగా,గంభీరంగా చిక్కటి అక్షరాలు చేసి వాటిని కవిత్వపు దారాలతోఅల్లింది.ఆగిపోని కవిత్వం చేసి తేమ లేని జీవితాల్లో కవిత్వంగా నాటింది. అందుకే "జీవితాన్ని కవితగా మార్చడంలో నేర్పరి రేణుక అయోల"-అని ప్రముఖ కవి, విమర్శకుడు వాడ్రేవు చిన వీరభద్రుడు గారు అనగలిగారు.
మనుషుల్లో కవులు విభిన్నంగా వుంటారేమోనని కొందరు భావిస్తుంటారు.అయితే కవులు కూడా మానవులే.ఈ కవయిత్రి తన తాతయ్య మాటల్లో కవుల గూర్చి"లోకం చుట్టూ దారాలల్లుకుంటూ సాలెగూడులో ఈగల్లా చిక్కుకుంటారు"-అంటూ వారి కవిత్వ దాహం పుస్తకాల దొంతరల్లో తీరు తుందని చెబుతారు.కవిత్వం మనిషిని మనిషిలా నిలబెడుతుంది,బ్రతికిస్తుంది అనే ఒక భావనను ఈ కవయిత్రి తన "కవిలోకం" అనే కవితలో బలంగా వ్యక్తంచేస్తుంది.అందుకే"ఎండిపోయిన పూల గింజలను ఏరుకొని కవిత్వాన్ని పూయిస్తారు"-అని అనగలిగింది.పాతిన గింజ అంకురించి కొత్త మొక్కనెట్లా యిస్తుందో అట్లాగే కవులు వారు రాసిన కవిత్వంఏ కాలందైనా చరిత్రను చెబుతూ జీవితంపై మనకు నమ్మకం కల్గిస్తారని ఈవిడ విశ్వాసం.దీన్ని కవిత్వమంతా ఒక అంతర్లీన అంతస్సూత్రంగా నిర్మిస్తూ జీవన సారాంశాన్ని కవిత్వం చేసింది.
కవయిత్రి రేణుక గారు తనతో పాటు చదివిన ఉష లేదని తెలిశాక రాసిన 'గాయం"అనే స్మృతి కవిత నిజంగా ఆవిడ మదిలో రేగిన గాయపు బాధంతా ఏకీకృత అక్షరంగా మారితే ఎలావుంటుందో అలా పాఠకుల్ని దుఃఖప్రవాహంలోకి లాక్కెలుతుంది.అందుకే రేణుక తన జీవిత అనుభవాన్ని మన అనుభవంగా మార్చి తన దిశగా ఆలోచింపచేస్తుంది.
"గాయం మానిపోతూ పొరలు కట్టుకుంటూ
ఆనవాళ్ళను మిగులిస్తుంది
ఏ గాలి ఙ్ఞాపకానికో మళ్ళీ చెలరేగుతుంది
నిప్పు రవ్వ వచ్చిపడ్డట్లు గాయం రేగుతుంది
పొరలు విప్పుకొని
నిద్ర జడలు విదుల్చుకొని నాట్యం చేస్తుంది"
ఈ వాక్యాల్లోని భావ చిత్రం రేగిన గాయపు తీవ్రతని గుర్తుకు తెస్తుంది.
పాత గాయం అయినచోటే మళ్లీ గాయం కావడం సహజాతి సహజంగా జరుగుతుంటుంది.ఆ గాయాన్ని మాననీయవు.ఇదే అంశాన్నీ ఈ కవితలో "పాతవి కొత్తవి కలసి కలకలం రేపుతాయి/ గాయాన్ని మాననీయకుండా ఎక్కడెక్కడివో గుర్తుకొస్తుంటాయి"అని అంటూ ఈ గాయం నెత్తురు చిమ్మకుండా లావాలా ఉడుకుతూ కాల్చేస్తుందనే ఊహను చేసి..ఆ మరణపు గాయం మనసులేని శరీరం మీద మాయని మచ్చలా మిగిలిపోతుంది అనిచెప్పడం అంటే చెదిరిపోని గుర్తు అని కవయిత్రి గొప్ప పోలికలతో ఒక స్మృతిని మనముందు నిలుపుతుంది.
మాములుగా ఎవరైన కీర్తిని గడించాలని విపరీతంగా ప్రయత్నం చేస్తంటారు.ఆ కీర్తిని పొందడానికీ ప్రాణాల్నిసైతం ధారపోసిన వాళ్ళని చరిత్రలో చూడొచ్చు. చాల చిత్రంగా రేణుక గారు ఆ కీర్తి అనేది పతనానికీ సంకేతం అని తీర్మానిస్తుంది.ఈ మాట కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు.కానీ ఈవిడ తన భావనని ఎంతో సమర్థవంతంగా తార్కింగా నిరుపిస్తుంది ఈ కింది పంక్తుల్లో.
"కొందరిని కీర్తి బంగారు కీరిటమై
అందరిలోంచి ఒక్కడిగా నిలబెట్టి
అందరినుండి అపరిచితుడిగా లాక్కెళుతుంది
అసూయ డేగలా వెన్నాడితే
కీర్తి రాయిలా బరువై శత్రువులా మారుతుంది
మళ్ళీ నీలో నువ్వు నీ కోసం వెదుక్కునే దాక
కీర్తి వెంటాడుతూనే నిన్ను సంహరిస్తుంది"
కీర్తి దాహం ఆత్మ విశ్వాసపు సంకేతంగా నిలిచే బదులు అది పతనానికి ఎట్లా గుర్తయ్యిందో ఈ కవయిత్రి స్పష్టంగా చెబుతుతుంది.
ఎవర్నైనా చూసినప్పుడు ఏదోఒక భావం కలగడం అందరి అనుభవం.తాను చూసిన దాని వల్ల తాను పొందినానుభవాన్ని కవిత్వం చేయడం అందరు కవులు చేస్తారు.కానీ ఈ కవయిత్రి తన అన్నయ్య తన తాతగారి పాత ఫోటొ చూసినప్పుడు అతనిలో కలిగిన భావాల్ని కవిత్వం చేసిన విధం మాత్రం స్వంయంగా అనుభవించిన అబ్బురంగా అనిపిస్తుంది.ఇట్లాంటి పరమనోభావ గ్రహణ విద్య ఈ కవయిత్రికేట్లా తెలిసిందా అనుకున్నా.
"తాత పోలిక నాదంటారు
నాగలి పట్టి సరదాగా దున్ని
అరచేతులు చాచి చూపించాను
"భడవా"నాలాగే దున్నావురా-అనే తాతయ్య గొంతు
ఎప్పుడు ఈ ఇంటి గడపలో కాలుపెట్టినా ఎడ్లబండి చప్పుడు వినిపిస్తుంది
"వీడిదంతా నా పోలికే"గుండెలకి హత్తుకున్న
చిత్రం కళ్ళముందుంటుంది
పాత గడియారం కింద తాత ఫోటొ
ఒకరోజు ఖాళీగా కనిపించింది
నా చేతిలో నా బుజ్జిగాడి నవ్వులో
"భడవ" ఇక్కడున్నానురా అంటూ-"
ముగింపు కూడా మనలోని ఒక నమ్మకాన్ని బలపరుస్తూ ఊహించని విధంగా చేసింది.
పాత్రలో,సీసాలో ఖాళీగా వుంటాయి.మాటలు ఎట్లా ఖాళీ గా వుంటాయి."నుదుటి మీదకి జరుగుతున్న తెల్ల వెంట్రుకలు,వణుకుతున్న చేతులు ,పట్టుకోసం చేతి కర్ర ఇంకా మిగిలివున్న ఊపిరితో వున్న రంగసాని ఖాళీ ముఖం చూశాక రాసిన"ఖాళీ మాటలు" " తెగిన మువ్వలొ కూడా నాట్యపు తిరస్కారం ఉంది"-అనే వాక్యం ఈ కవితకీ ప్రాణాధార వాక్యం.ఇట్లా కొన్ని మాటల్లోనే ఒక గొప్ప ఊహని చేసే ఆలోచనని పాఠకులకీ కలిగిస్తుంది.
"తేట నీటి చెరువులా అంతరంగం
ఆలోచనల చేప పిల్లలు లేవు
మనసు తొలిచే వింత జంతువులు లేవు
వృక్షాలై పెరిగిన అసూయలు లేవు
పేరు రూపం లేని ఉత్త బొమ్మలా తేలియాడుతున్నాను
మాయమైన రూపం కోసం వెదుకుతూ"
ఎవరికి వారు తమ అంతరంగంలోకి తొంగిచూసుకుంటే ఎట్లా వుంటుందో పై పంక్తులు చెబుతాయి.ప్రతి పంక్తిలో ఒక పోలికను చెబుతూ చెరువును అద్దంగా చేసి రాసిన కవిత "నీటి బొమ్మ"-అనేది.
వొక అందమైన భావాన్ని అక్షరాల్లోకి మార్చే మంత్రజాలం కూడా రేణుక గారికి తెలుసు.
"వాన వెలిసిన రాత్రి
ఆకాశంలో తారలు ఒక్కోక్కటి నడుచుకొంటూ
నీలి తెర మీద చమ్కీల్లా వేలాడుతుంటాయి
సందడి చేసి వెళ్ళిపోయిన వానకి గుర్తులు
ఇంటి చూరుల్లో రాలుతున్న నీటి బుడగలు"
వాన వెలిసిన తరువాతటి దృశ్యాన్ని ఇట్లా ఊహ చేయటం ఈమెకే చేతనయ్యిందేమో! "వెళ్ళిపోయిన వ్యక్తి ఙ్ఞాపకాలు/కళ్ళల్లో మిగిలిపోతాయి/మాటిమాటికి రెప్పలను ఒరుసుకొని/పారే కన్నీటి తడితో/వర్షం వెలిసిన ఆకాశంలా వాళ్ళంతా మిగిలిపోతారు"-ఇట్లాంటి దుఃఖపు తడి నిండిన వాక్యాలు ఈ కవయిత్రి చేతిలో పడి మనకీ మరింత విషాదాన్ని పంచుతాయి.
అదేమి చిత్రమో గానీ ఎందరు కవులు అమ్మను గురించి రాసినా ఇంకా రాయాల్సిందేదోవుంది అని అనిపిస్తుంది నాకు.అందర్ని వదిలివెళ్ళిపోయిన అమ్మ జీవిత ఙ్ఞాపకాలలోని విషాదాన్ని "పల్లకీలో పెళ్ళికూతురు"అనే కవితలో చిత్రిస్తే,చౌరాస్తాలో సిగ్నల్ లైట్ల దగ్గర ఒకచిన్న పిల్లాడిని ఎత్తుకొని అడుక్కొంటున్న అమ్మాయిలో అమ్మ తనాన్ని"వాడితో నా ప్రయాణం"అనే కవితలో చిత్రించింది ఈ కవయిత్రి రేణుక గారు.
అమ్మను ఖననమో,దహనమో చేయాడానికీ ముందు ఆమె చేతులకున్న గాజులు,కాళ్ళకున్న కడియాలను పంచుకొన్న తరువాత 'పాత సామానుల కొట్టులోకి వెళ్ళిపోయిన సందూకపెట్టె గురించి,అందులో అమ్మ దాచుకొన్న అపురూప గుర్తులను నెమరేసుకొంటూ,ఏనాడు పేరు పెట్టి పిలువని నాన్న కారణంగా తన పేరేమిటో మరచిపోయిన అమ్మను మనసులోకి తెచ్చుకొంటూ,కూరలో ఉప్పు ఎక్కువైతే పళ్ళెం ముఖాన విసిరికొట్టిన అభిమానాలు ఆప్యాయతలు పంచి ఇవ్వడమే తెలిసిన అమ్మలో తనను చూసుకున్న స్త్రీ మనో భావాల్ని గొప్పగా ఈ కవయిత్రీ ఆవిష్కరించింది.
"భుజం మీద ముడితో జోలెలా అనిపించే
మెత్తటి చీర ముక్క ఊయలని
ఆమె జోలె అంటుంది
నేను వాడిని మోస్తూ నాలోకి ఒదగనిస్తూ
వాడి అనుభవాలకీ మూగపల్లకీనవుతాను"
ఇలా ఆరంభమయ్యే ఈ కవితలో నాలుగు రోడ్ల కూడలిలో తన చంకనో వీపునో పిల్లాడిని మోస్తూ అడుక్కొంటున్న అమ్మాయిలో అమ్మ తనాన్ని ఈ కవయిత్రి రూపు కట్టించింది.
"ఊయలగా నేను జోరుగా ఊగి-
వాడి దుఃఖాన్ని చెరిపే కొమ్మ మీద పిట్ట కోసం ఎదురుచూస్తాను
వాడికి కావలసింది అమ్మ
అమ్మకి కావలి ఆకలి తీర్చే ఆదాయం
జీవితం ట్రాఫిక్ సిగ్న్ల్ దగ్గర ఆగిపోయింది"
ఈ మాటలు మనలి కూడా అక్కడే ఆపేస్తాయి.వొక అద్భుతశిల్పంతో ఈ రెండు కవితలే ఇంకా చాల కవితలు రేణుక అయోల గారిని ఒక మంచి కవయిత్రిగా నిలబెడతాయి పాఠకుల ఎదుట.
"నన్ను నువ్వు తెలుసుకోవాలంటే యుగాలతో సంభాషణ జరపాలి"-అని అనటంలో కాలాన్ని స్ఫురింపచేస్తూ,నీటి జల్లులస్పర్శ,తడిపూల వర్షం,పిట్టల సయ్యాట లాంటివాక్యాలతో గుండె గుడిలో గిలిగింతలు పెడుతూ, "నది నా ఆత్మ,నది నా బాల్యం "అంటూనదిని అమ్మలా పలకరిస్తూ,ప్రతి కవితలో ఒక అనుభవ ధూళిని పంచుతూ,కెమెరాకందని జీవితం,కాగితాల కందనిఅనుభవన్నీ కవిత్వమంతా పరచిన కవయిత్రి రేణుక అయోల అంటున్నా నేను.రాయవల్సిన వాక్యాలు ఇంకా ఎన్నో వున్నా" రాత్రి ఆకాశంలో అప్పుడే పుట్టిన నెలవంక దాని పక్కనే మినుమినుకుమంటున్న నక్షత్రం"ఇక చాలని అంటున్నాయి కాబట్టి...ఒక మంచి కవితా సంపుటిని అందించిన కవయిత్రికి మనఃస్పూర్తిగా అభినందనలు అందజేస్తు..వచ్చే మంగళవారం మరొక కవితా సంపుటితో కలుద్దాం.అంతవరకు మిత్రులు ఈ కవిత సంపుటి పఠనంలో వుంటారని ఆశిస్తాను.
Like · Comment · 

Tuesday, 17 March 2015

ఖాముఖం

గజల్స్ అంటే ఇష్టం! – రేణుకా అయోల

మార్చి 2015

రంజని-కుందుర్తి అవార్డ్, ఆంధ్రసారస్వత సమితి అవార్డ్, రమ్యభారతి కథా పురస్కారం, ఇస్మాయిల్ పురస్కార గ్రహీత కవయిత్రి రేణుకా అయోల గారితో ముఖాముఖం.
Q: కవిత్వం రాయడానికి కవితాత్మకంగా బతకడానికి తేడా ఎమిటి? దాన్ని మీరెంతవరకు సాధించగలిగారు? మీకు నచ్చిన తెలుగు మరియు తెలుగేతర కవిత్వము, కథలు రచయతలు/త్రులు గురించి చెబుతారా?
కవిత్వం రాయడానికి కవితాత్మకంగా బతకడానికి కావలసింది నిజాయతి, అది నేను సాదించేనని అనుకుంటున్నాను. కవిత్వాన్ని ప్రేమించే నేను అందరి కవిత్వం ఇష్టపడతాను. అనువాదాలు అంతగా చదవలేదు. కధలు, నవలలు విరివిగా చదివినా, నేను ఎక్కువగా ఇష్టపడ్డ రచయతలు; కొడవటిగంటి కుటుంబరావు, యండమూరి వీరేంద్రనాధ్.
ఉద్యోగరీత్య మధ్యప్రదేస్ లో వుండం వల్ల గజల్స్ వినడం, వాటిపై ఆసక్తి పెంచుకుని వాటిని అనువాదం అనేకన్నా అభిమానంతో నాభావాలకి అనుగుణంగా అనువదించడం కూడా నేర్చుకున్నాను. గజల్స్ ఇష్టపడడానికి కారణం, కవిత్వానికి దగ్గరగా వుండడం, ప్రేమ, తత్వం రెండు సమానంగా వుండం వల్ల వాటికి ఇంకా దగ్గర అయ్యాను. ప్రేమిచడం తెలియని వాళ్ళు జీవితంలో గల ఆర్ద్రతని చూడ లేరు. జీవితాన్ని అనుభవించని వాళ్ళు లోపలి కన్నీటిని, తడిని కవిత్వంలో చూపించలేరని అనుకుంటాను.
Q: నచ్చిన గజల్స్, గజల్ కవుల గురించి చెప్పండి? ఎందుకు నచ్చాయో కూడా?
నేను ఎక్కువగా ఇష్టపడి వినే గజల్స్ హింది గజల్స్. జగ్జీత్ సింగ్, పంకజ్ ఉదాస్, మెహదీహసన్, హరిహరన్ ఇంకా ఎంతో మంది ప్రముఖులు వున్నా వీళ్ల గజల్స్ ఎక్కువగా ఇష్టపడతాను. వీటిలో చాలా వాటిని ఫేస్ బుక్ గజల్ గ్రూపులో ప్రతీ శనివారం “నాకు నచ్చిన గజల్” శీర్షికలో తెలుగులోకి అనువదించి పరిచయం చేసాను. అందులో నేను ఎక్కువగా ఇష్టపడినవి
పంకజ్ ఉదాస్-ఏక్ ఐసా ఘర్ చాహియే, మోహే ఆయేనా జగసే లాజ్
జగ్జీత్ సింగ్ గజల్స్ లో మై ఖయాలుహూ కిసి అవౌర్ కా (హరిహరన్ ) పాడినది, హోటోంసే ఛూలో తుమ్, ఛీట్టి నా కొయీ సందేశ్.
Ek Aisa Ghar Chaahiye Mujhako – Pankaj Udhas
“ఒక ఇల్లు నాకు కావాలి
దాని స్వరూపమే ఆనందానికి చిరునామాగా వుండాలి
ఒక ఇల్లు నాకు కావాలి
మానవత్వాని ద్వారాలు మూయనిది
సిఖ్ ,పెహ్ల్వానులు, మదువుని సేవించే వాళ్ళు
అందరు ఆనందంతో వచ్చి వెళ్లే ఇల్లు కావాలి
ఒక ఇల్లు నాకు కావాలి
ద్రాక్ష పళ్ల సింహాసనం దక్కించుకున్న ఆనందంపు మద్య హ్నంలా
వచ్చిన వాళ్ళు మళ్లి తిరిగి వెళ్ళలేనంత ఆనందం వుండాలి
ఓ మూల గజల్ ప్రతిధ్వనించాలి ,సంతోషానికి పుట్టినిల్లు అవ్వాలి
ఆలాంటి ఇల్లు నాకు కావాలి
ఒక ఇల్లు నాకు కావాలి
నా స్వంతంమనుకుని వచ్చేవాళ్ళు నా అతిధులు
బజారులో ఎవరికీ ఖరీదు చెల్లించని అవసరం వుండని ఇల్లు
ఒక ఇల్లు నాకు కావాలి
దాహంతో చెప్పడం ఎంత సులువు వో కదా జాఫర్
కాని కళ్ళతో సంజాయించడం చాలా కష్టం ….”
ఇవన్నీ కూడా నా బ్లాగ్ లో పెట్టాను.
Q: ఫిక్షను ఎక్కువ చదువుతారా? కాల్పనికం ఎక్కువ నచ్చుతుందా? కవితనా? ఇష్టమైన నవల గురించి చెప్పండి? తెలుగు, తెలుగేతర క్లాసిక్ మరియు వర్తమాన కథలు చదువుతారా?
కధలు నవలలు చాలా చదివాను. అనువాదాలు చదవడం చాలా ఇష్టం. ఆదివారం ఆబిడ్స్ లో రోడ్డు మీద దొరికే పుస్తకాలలో అనువాదాలు వెతుక్కుంటూ గంటలు గంటలు గడపడం చాల ఇష్టమైన వ్యాపకం. ఎన్నో అనువాదాలు చదివినా నాకు బాగా నచ్చినవి లజ్జా, చంఘీస్ ఖాన్, ఏడూ తరాలు, క్లియోపాత్ర, పాండవపురం, సంస్కారం, పర్వ ఇలా ఎన్నో! ఇంక కధలు నవలలు తెలుగులో విరివిగా చదివాను. కొన్ని పుస్తకాలు మళ్ళి మళ్లి చదవాలనిపిస్తాయి. అందులో నాకు బాగా నచ్చినవి నేను ఇష్టపడి చదువుకునేవి… మునిపల్లె రాజుగారి “మాజికల్ రియలిజం”, “అంధ్రా నెపోలియన్” కథలు, జి.అర్ మహర్షి సీరీయల్ “మట్టి తీగలు”, “బమ్మిడి జగదీశ్వర రావు, చలం మ్యూజింగ్స్… ఇంకా ఫలానా అంటూ ఏమి లేదు చదివించే పుస్తకం ఏదైనా చదువుతాను. ముఖ్యంగా నాకు హాస్యం అంటే చాలా ఇష్టం, వంగూరి చిట్టెన్ రాజు గారి కధలు చలా ఇష్టంగా చదువుతాను.
Q: కవయిత్రిగా మిమ్మల్ని నిరుత్సాహ పరిచిన అనుభవం ఏవైనా పంచుకుంటారా?!
నన్ను నిరుత్సాహం కాదు గాని ఆశ్చర్యపరిచిన ఒక సంఘటన చెప్పాలి. విపులలో ముషాయరలో వచ్చిన కవిత, దాని నేపద్యం భర్తని పోగొట్టుకున్న స్త్రీ మనోభావాలను రాస్తే తోటి రచయిత్రులు కొందరు వాళ్ళని అవమాన పరిచానని పోలీసులుకి, కోర్టుకి వెళతామన్నారు. అది ఎప్పుడు తలుచుకున్నా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే దానికి భిన్నంగా పరిస్థితులు లేవు గనక.
నాకు ఎక్కువ ఆనందం కలిగించింది నా రెండవ కవితా సంపుటి “లోపలిస్వరం”. ఈ పు స్తకం చదివి శీలాసుభద్రగారు ఉత్తరం రాయడం, ఆదూరి సత్యవతి గారితో పోల్చడం ఎప్పటికి మరచిపోలేని సంగతి.
ఈ కవిత “విపుల” డిసెంబరు 2008 సంచికలో ముషాయిరా శీర్షీకలో ప్రచురితం అయ్యింది
ఓ చినుకు
=======
నాణానికి మరోవైపు
స్త్రీ జీవితంలో నడి వయసులో
వైధవ్యపు ఛాయలు ముసురుకున్నప్పుడు
అంతులేని స్వేచ్చ -మౌన ఎడారిలా
సంప్రదాయాలు చేదించుకుంటూ
అలంకారాలతో తృప్తి పడుతూ
మోసగించుకుంటూ
గుండెలోతుల్లో రగులుతున్న అసహనం
ఆలోచనల్లో నలుగుతున్న స్పందనలు
కారుచిచ్చులా మనసుని తనువుని రగులుస్తున్నా
మంచుముద్దలా వుంచాలని ప్రయత్నిస్తూ ఓడిపోతూ
ఈ కాలాన్ని నమ్ముతూ
తోడు కోరుకున్నప్పుడు
స్నేహాలకే గాని పెళ్ళీకి పనికి రావని నిక్కచ్చిగా వ్యక్తపరచినప్పుడు
గాలనికి చిక్కున్న చేపలా గిలగిల లాడుతూ
మోయలేని ఒంటరితనం తోడుకోరికున్నప్పుడల్లా
మగాడు లేకుండా బతకలేనా?
అసరాలేకుండా జీవితాన్ని వెళ్ళదీయలేనా?
గొంతెత్తి ఆక్రోశిస్తూ
స్త్రీ వాదినని బుజ్జగించుకుంటూ
జీవితాన్ని కాలానికి బలిచేస్తూ
ఓదార్చుకుంటున్న హృదయంపై
మంటలార్పుతూ ఓ కన్నీటి చినుకు…
అప్పుడప్పుడే సాహిత్యంలో అడుగుపెడుతున్న రోజులు, నాతో ఓ స్త్రీ పంచుకున్న అనుభవాలు యధాతధంగా రాసాను కాని అందరు రచయిత్రులు విపరీతంగా స్పందించారు. “స్త్రీ వాదినని బుజ్జగించుకుంటూ” దీని మీద పెద్ద చర్చలు జరిగాయి. “భూమిక” స్ర్తీ వాదపత్రిక ఆఫీస్ లోకి రమ్మన్నారు. నన్ను సంజాయిషీ ఇవ్వమన్నారు. క్షమాపణ చెప్పమన్నారు.
నేను ఆఫీస్ కి వెళ్ళాను వివరంగా చెప్పాలని కాని ఎవరూ నాతో మాట్లాడలేదు, వివరణ అడగలేదు. నేను చెప్పలేదు. అక్కడితో ఆచర్చ ఆగిపోయింది. అయితే ఇప్పుడు కూడా అందరి సమస్య కాదు. అప్పుడు చెప్పలేక పోయాను. మీ ద్వారా ఇప్పుడు చెప్పే అవకాశం వచ్చింది. ఈ కవిత ఓ స్త్రీ మనోభావం మత్రమే. నిజమే సమాజంలో ఎంతో మంది నడివయసులో, చిన్నతనంలో భర్తలని కోల్పోయినా స్త్రీలు ధైర్యంగా పిల్లల కోసమే జీవితాలు వెళ్లదీసిన వాళ్లు వున్నారు.
వాదాలు నాకు తెలియవు. ఒక స్త్రీ గొంతుకకి అరువు ఇచ్చాను నిజాయతిగా కాని 2008 కి 2014 సంవత్సరానికి ఏమి తేడా లేదు. అదే అసహనం, తోటి స్త్రీ అంటే చులకన. సమాజం మారలేదు. విలవల్లో మార్పులేదు. కొత్త మార్పు “సహజీవనం” అంటున్నారు. ఇది స్త్రీలకి, యువతులకి ఎంత మేలు చేస్త్తోంది అని ప్రశ్నించుకుంటే సమాధానం మళ్ళీ వ్యక్తిగత అనుభవం అవుతుంది. సమాజంలో ఇంకా మార్పురావాలి. రాస్తున్న రాతలకి, మనుషుల ప్రవర్తనలకి పొంతనలేదు. అందుకే వ్యక్తిగతం వేరు, రచనలు వేరు అనిపిస్తోంది నాదృస్టిలో.
Q: మీ కథలు అనగానే రెండు గుర్తుకొస్తాయి.
1. కవిత్వ నేపద్యంతో మొదలుపెట్టి జంతువుల మధ్య కథ నడిపారు, రెండు చందమామలు.
2. తోపుడు బళ్ళమీద బాంబులు అమ్మే కథ
ఎలాంటి ప్రేరణ నుండి రాస్తుంటారు? మీకు నచ్చిన కథ, ఇతరులు మెచ్చిన కథ గురించి చెబుతారా?
సమాజాన్ని దగ్గరగా పరిశీలించినప్పుడు, మనుసులో జనించిన ఆవేదనని నలుగురుతో పంచుకోవాలి అనుకున్నప్పుడు కదా కధలు రాయాలని అనిపిస్తుంది. అ నేపద్యంలోంచి వచ్చిన కదలే మీరు అడిగిన రెండు కధలు.
బాంబులు ఎంత తేలిగ్గా మనుషుల ప్రాణాలు గాల్లోకి ఎగరేస్తాయో కదా! వార్తలు చదివినప్పుడు టివి లో చూసే దృశ్యాలు, మనసుని కలిచివేస్తాయి. ఒక్క క్షణం మనం అక్కడ వుంటే?!
రేప్పొద్దున వీటినే కూరగాయల బండిలోపెట్టి అమ్మినా ఆశ్చర్యం లేదు ఎందుకంటే మనం వాటికి అంతగా అలవాటు పడిపోతాం, ఇప్పుడు జరుగుతున్న రోడ్డు, రైలు ప్రమాదాల్లాగా!
రెందవ కధ నేటి సాహిత్య ధోరణులు. అదే నాపుస్తకం టైటిల్ కూడా! మామూలుగా రాయడం కన్నా జంతువులే కథకులు అయితే అనే ఆలోచనలోంచి పుట్టిన కధ. బహిరంగంగా ఎవరు మెచ్చుకోలేదు గాని పత్రికలలో విరివిగా వచ్చిన రివ్యూలవల్ల మంచి కధలు రాసానన్న తృప్తి మిగిలింది. నాకు చాల నచ్చిన కధ, “నాది కాని వెన్నెల”. ఇది చాలా మంది మెచ్చుకున్న కథ. ఇది “నడుస్తున్న చరిత్ర” పత్రిక వారి కదల పోటీలో మొదటి బహుమతి కూడా పొందింది.
Q: మీరు సాహిత్య కార్యక్రమాలలో, సదస్సులలో పాల్గొన్నారు కదా! అభిప్రాయాలు, అనుభవాలు చెబుతారా? స్వదేశంలో జరిగే వాటికి, విదేశాలలో జరిగే వాటికీ మధ్య ఏమైనా తేడా వుందంటారా?
నగరంలో సాహిత్య సభలు, సదస్సులు ఒక రకంగా రోటీన్ గా సాగిపోతాయి. పుస్తకాల ఆవిష్కరణలతో సహా.
కొన్ని సార్లు పుస్తక పరిచయం కన్నా వేరే వాళ్ళ పుస్తకాలు మెచ్చు కోవడం, అసలు విషయం పక్కన పెట్టి వేరే విషయాలు మాట్లాడిన సందార్భాలు ఎన్నో అయినా వాటికి కూడ అలవాటు పడిపోయాము అనిపిస్తుంది.
కవి సమ్మేళనాలలో పాల్గొనడం కూడా రోటీన్ అనిపిస్తుంది ఎవరి కవిత వారు చదవగానే లేచి వెళ్ళిపోవడం. అసలు ఎలాంటి కవిత చదివారు, ఏ భావంతో చదివారు అని పట్టించుకోక పోవడం లాంటి అనుభవాల వల్ల ఆసక్తి పోతుంది. సీనియర్స్ ముందు కవిత చదవాలని వారి అభిప్రాయాలూ తెలుసుకోవాలని వుంటుంది, కాని వాళ్ళు లేచి వెళ్ళిపోవడం చాల బాధగా వుంటుంది. అయినా కవి సమ్మేళనాలు సాగిపోతూనే వుంటాయి.
ఇంక విదేశాల విషయానికి వస్తే నేను ఊహించని అనుభవం ఎదురైంది. ఇక్కడి అనుభవంతో నా పుస్తకాలు నాతో పాటు తీసుకు వెళ్ళ లేదు కాని గురువారం మా అబ్బాయి స్నేహితుల ఇంట్లో పూజకని వెళ్ళినప్పటి పరిచయంలో నేను రచయిత్రిని అని చెప్పాను. వెంటనే వంగూరి చిట్టెన్ రాజుగారికి ఫోన్ చెయ్యడం వారు ఆ పై శనివారం నెల నెల వెన్నెల కార్యక్రమానికి ఆహ్వనించడం సంతోషంగా అనిపించింది. అప్పటికి రాజుగారితో నాకు ముఖ పరిచయం కూడా లేదు.
ఆ సభలో వారి ఆదరణ మరచిపోలేనిది. నేను చదివిన కవిత్వాన్ని చాల శ్రధగా విన్నారు. మొట్ట మొదటి సారిగా కవిత్వ వివివరణ అడిగినప్పుడు అనిపించింది తెలుగు భాష మీద వాళ్ళకున్న మమకారం, అతిధుల పట్ల గౌరవం, సాహిత్యం పట్ల వున్న మమకారం…
రెండవసారి సత్యం మందపాటి గారితో ప్రయాణం. దారిలో వారితో చర్చించిన అనేక విషయాలు విన్న తరువాత ఇప్పటికి అంటే 30 సంవత్సరాలుగా స్వదేశానికి దూరంగా వున్నా తెలుగు మీద మమకారం సాహిత్య సాన్నిహిత్యాన్ని వదలకపోవడం ఆనందంగా అనిపించింది.
Q: ఏదైనా చదివినప్పుడు నేనూ ఇలా రాయగలనా అనిపించడం కానీ రాయడం కానీ జరిగిందా?! వివరిస్తారా?
కవిత్వం పట్ల నాకున్న విపరీతమైన ప్రేమతో నేను ఎక్కువగా అభిమానించే శివారెడ్డి గారి కవిత్వం చదివినప్పుడు ఇలా ఇంత సరళంగా, ఎప్పడు ఎక్కడో తారసపడే మనుషులు గుర్తుకొచ్చేంత అద్బుతంగా కవిత్వం రాయగలనా అని అనిపించిన క్షణాలు ఎన్నో ఉన్నాయి. అలాగే చినవీరభద్రుడి గారిలా ఎప్పుడు అగ్నిపూల చెట్టు కనిపించిన గాజుల మలారంలా వుంది అన్న పదం వెంటాడి నప్పుడు, వర్షం రాత్రి నిశ్శబ్ధం కురిసినప్పుడు ఇలా రాయగలనా అని బెంగ పడిన రోజులు ఎన్నో.. అలా రాయడానికి ప్రయత్నించినా అసంతృప్తే మిగిలింది.
Q: ఇప్పటివరకూ మీ పుస్తకాలగురించి, ముద్రణల గురించిన అనుభవాలు ఏమైనా పంచుకుంటారా? ఎన్ని పుస్తకాలు వచ్చాయి, రాబోతున్నవి.
ఇప్పటి వరకు మూడూ పుస్తకాలూ వచ్చాయి.
ఒక కధల సంపుటి, “రెండు చందమామలు“.
రెండవది కవితా సంపుటి “పడవలో చిన్ని దీపం”.
మూడవది కవితా సంపుటి “లోపలి స్వరం”.
కవితల పుస్తకాలు చెల్లవు అని నిర్మొహమాటంగా పుస్తకాల షాపు వాళ్ళు అన్నపుడు చాలా బాధ వేసింది. అయినా నాకోసం నేను వేసుకుంటూన్నాను అనుకున్నప్పుడు అంత బాధ వుండదు.
**** (*) ****

(వాకిలి కోసం జాన్ హైడ్ కనుమూరి గారు జరిపిన చివరి ఇంటర్వ్యూ ఇది.)
**** (*) ****

Monday, 2 March 2015

ఒక నువ్వు ...


   
   


కాలం రహదారి మీదనుంచి జీవితం 
నిర్దాక్షణ్యంగా నడిచి వెళ్ళాక
 పసితనం చేదిరిపోయాక  ఎం మిగులుతుంది.
 మృదువుగా  నిమిరే. చేతులు  కరువయ్యాక
     
  ఊహలకి  ఊపిరి ఇవ్వని  రాతి ముఖంలో 
తోడు ఎముటుంది
 కోవోత్తుల వాసనలో కరిగే అంకెలు  
చెప్పుకోవడానికి  ఇష్టపడని
 బతుకులో ఎవరికోసమో  నవ్వే  నవ్వులో  ఏముంది
 నాటకం నీదే నటన నీదే 
చుట్టూ  ఉన్నవాళ్ళ  పాత్రలో ఏముంది
 తిరిగి తిరిగి దశాబ్దం తరువాత  చూసుకుంటే  ఎముటుంది
 మానవత్వం నమ్మకుండా  ఎదిగిన మనిషిగా  ఉండిపోతావు
  అనుకూలంగా ఉన్న వాళ్ళు  
పొడిచిన పిడిబాకులా మిగిలిపోతావు

 స్పస్టంగా చూసుకుంటే  
నిన్ను నువ్వు  పోల్చుకుంటావు
 స్వప్నంలో  మృత్యువుకి   ప్రేమ లేఖ రాస్తూ  పట్టుబడతావు ..