Thursday 18 June 2015

అఫ్సర్ గారు రాసిన " ఇద్దరి చీకటి " చదువుతుంటే ఇలాగే అనిపించింది ... ఇద్దరి చీకటి

ఎందరో ప్రముఖుల కవిత్వాలు చదువుతూ వుంటాము ,వాళ్ళతో పాటు అమ్మతనంలోకి
ఊరిలోకి ,ప్రకృతిలోకి ,ఉద్యమాల ఉద్రేకాలలోకి వెళ్ళిపోతూ వుంటాము ,కొన్ని సార్లు ఏదో
చెప్పాలను కుంటాము ,కాని చెప్పలేకపోతాము రోజువారి జీవితంలో మునిగి పోతాము
అప్పుడప్పుడు కొన్ని కవితలు మాత్రం ఇలా అనిపిస్తాయి ...

ఒక పాట వేటాడుతుంది పాడుకుని ,పాడుకుని అలసిపోయి ఒక సంతృప్తిని
మిగుల్చు కుంటాము . అదే ఒక కవిత్వం వెంటాడితే మనసులోపలే మాట్లాడుకుని
అక్షరాల్లో మునిగి పోయి ఒకో సారి దారి దొరకని చౌ ర స్తాలో నిలబడిపోతాము.
అఫ్సర్ గారు రాసిన " ఇద్దరి చీకటి " చదువుతుంటే ఇలాగే అనిపించింది ...
ఇద్దరి చీకటి
1
చాలా సార్లు నువ్వొక గుహలాంటి చీకటి
లేదూ, చీకటిలాంటి గుహ.
కళ్ళు చికిలించుకొని అన్ని చూపుల్నీ వొక్క చోటే గుచ్చుకొని
ఎంత సేపని చూస్తానో
నీలోకి వొకింత కూడా రాలేను, నువ్వూ రానివ్వవు
నీ ఎత్తాటి గోడల మధ్యకు-
వొక్క చినుకయ్యీ రాలలేను, నువ్వూ రాలవు
ఎవరి ఎడారిలో వాళ్ళం!
అయినా గానీ
ఎంత ఆశగా చూస్తూ వుంటానో పసి కళ్ళ దాహంతో-
* * * *
* * * *
చీకటి మనసు లాంటి గుహలోకి కళ్ళ దాహంతో ఎంతసేపైన చూడగలను అంటారు
మరోసారి ఎత్తటి గోడలాంటి నీ మనసు ఎడారిలో ఒక చినుకై రాల లేను అంటారు
మనసుని చీకటి చేసుకుని ,ఎడారి చేసుకుని ప్రేమించుకున్నాము అనుకోవడం ఎంత
వెర్రి తనం అనిపిస్తుంది చదువుతుంటే ,అయినా ఒక ఆశ పసి మనసుతో అమాయకపు
కళ్ళతో ప్రశ్నిస్తుంది నీకోసం ఎదురు చూస్తూ ఉంటానని ...
మనసుని పసితనం చేసుకోవడం చాల కష్టం అందుకే కవి పసితనపు నీడలని జారవిడుస్తారు
ఇక్కడ .
2
వద్దు వద్దని నువ్వు చెప్తూనే వుంటావ్ కానీ
ఇసక కంటే పొడి పొడిగా వుండే
ఆ కొద్ది మాటల్నే వొకటికి పదిసార్లు చదువుకుంటూ వుండిపోతాను
మునిమాపు చీకట్నించి నట్టనడి రాత్రి దాకా
నీ వాక్యాల చుట్టూరా మూగ దీపమై వెలుగుతూ వుంటాను,
ఎంత చలి నెగడునై కాలిపోతూ వుంటానో
తెగే నరాల ఉన్మత్తతలో-
వద్దు అనడం కంటే పొడి పొడిగా సందేహలలో రాలిన మాటలు ఏరుకుని
చదువుకోడం ఎంత కష్టం ,అయినా కవి వాటిని ఏరి వాక్యాల మధ్య దీపంలా
వెలుగుతాను అంటారు , ఇసుక మాటలు పట్టుకుని చలి చుట్టుకున్న మనసులో
నెగళ్లు వెలిగిస్తారు ,ప్రేమకి ఇంతటి బలమా ఇంత సహనమా,అనిపిస్తుంది చదువుతుంటే
ఒకింత ధైర్యంగాను వుంటుంది ...
3
సమూహలకేమీ కొదువ లేదు యిక్కడ
పలకరింపుల వానలకూ తెరపి లేదు
యింకాస్త గుండె ఖాళీ చేసుకొని
వూరికే వచ్చెళ్ళే తడినీడలూ కొన్ని.
అయినా గానీ,
అన్నిట్లోనూ అందరిలోనూ వొక్క నువ్వే నా కళ్ళకి-
యీ చుట్టూ శేష ప్రపంచమంతా గుడ్డి గవ్వయిపోతుంది నాకు.
అందరు వుంటారు సమూహంగా పలకరిపులో తడి వుంటుంది పొడిగా
ఆ తడిలో నువ్వు లేవు అంటారు , ఏ ఒక్క కళ్ళలో నువ్వు లేవు అంటారు
ఒక్క సారిగా ఈ వాక్యాలతో పాటు మనం ఎటో వెళ్లిపోతాము ,ఒక్క క్షణం ఆగిపోతాము.
ప్రపంచమంతా గుడ్డి గవ్వగా మార్చిన ఆ అందమైన కళ్ళని మనం కుడా వెతకడం
మొదలు పెడతాము ...
నిజమే, కలిసి చూసే వెలుగులూ వుంటాయి,
అడుగులు కలిపే మలుపులూ వుంటాయి
మరీ ముఖ్యంగా
యిద్దరమూ వొకే చీకట్ని కలిసి చూస్తున్నప్పుడు
వొక నమ్మకమేదో వెలుగై ప్రవహిస్తుంది
రెండు దేహాల నిండా-
అవునా? కాదా?
అవుననో కాదనో కూడా చెప్పవా?!
ఇప్పుడు ఈ వాక్యాలలో కవి హృదయం ఒక నమ్మకమై ప్రవహిస్తుంది
కలిసి చూసే చూపులకి చీకటి అంటినా రెండు దేహాలు ఒకటే అనే నమ్మకాన్ని
బలంగా చెప్తూనే ,నీ మాటే నా మాట అని చెప్పే ప్రేమ వేసవి నీడలా వుంటుంది
ఏ కవి హృదయాన్ని తేలిగ్గా అంచనా వేయలేము ఒక అక్షరంలో వేల చిత్రాలు వుంటాయి
నేను. అఫ్సర్ గారి ఈ చిత్రానికి పై పై రంగులు వేస్తూ నిజమైనవి అనుకున్ననేమో ?



No comments:

Post a Comment