ఒక ఒంటరి దేహం
సంకల్పంతో మరణించి
తనకు తానే కొత్తగా స్ఫూర్తిగా నిలబడింది
మంచి చెడు పాపం పుణ్యం
ఏవి పట్టనట్లు ఒంటరితనంతో
కన్నపేగు గర్వించే సమూహమైంది
ఒక మరణం తెచ్చిన తుఫానులోంచి
ఒక మరణం తెచ్చిన సంక్షోభంలోంచి
నగరం తన ప్రతిబింబాన్ని కొత్తగా చూసుకుంది
నలిగిన ముఖం ముక్కలైన భాష
భాష ముందు మూగగా
తనను తానే అశ్చర్యంగా చూసుకుంది
౨
గుంపులు గుంపులుగా మాట్లాడే భాష
ఎలుగెత్తి నినాదంగా మారే రూపం ఉద్యమం!
నినాదాలు నిట్టూర్పులు ఆవేదనలు
అంతా ఒక బాషలోనే
ప్రవాహంలో సుడులు తిరుగుతున్న భాష
ఒకరి నుంచి ఒకరు అందుకునే ఇసుక గమేళలా -
మాట మారి నినాదమై కొత్త కట్టడంలా మారింది
ఇప్పుడు మనల్ని మనం కోత్తగా చూసుకుంటున్నాం
కన్న తల్లిని రెండు ముక్కలుగా పంచుకునే తతంగాన్ని
విచిత్రంగా గమనిస్తున్నాం
అంగుళం కదలకుండా
జడంగా మారి మనల్ని మనమే కొత్తగాచూసుకుంటున్నాం
మరణం ఊరేగింపుగా మారడం
మరణం రక్తసిక్త రణంగా మారడం చూస్తూన్నాం
ఈ చూపు ఎంత పాతబడిపోయిందంటే
చూపు తప్పించి ఇంకేమి మిగలనంత
మనకు మనమే వింత ,మనభాషే మనకు కొత్త
౩
పొట్ట చేత పట్టుకుని ఊళ్ళు వదిలి్నవాళ్ళం
అపరిచితులుగా ఇక్కడ చౌరస్తాలో నిలబడి పోయాం
ఇప్పుడు దారులకు గమ్యంతెలియదు
చెట్ల కింద నేర్చుకున్న విద్య ఒంట పట్టించుకున్న చదువు
పరాయిగా మారి అ ఆ లు వేర్వేరు గుంపులై పోతున్నాయి
పచ్చటి ఆకులు నేలకు రాలుతే
వాటిని అంటుకున్న నెత్తురు మంచుబిందువులతో కలసి
భూమ్మీద ఒరుగుతూ
త్యాగాల నినాదాలని లిఖిస్తోంది
మరణం తరువాత నిశ్శబ్ధం
గంభీరంగా అలుముకున్న ప్రశాంతత
ఆ నిశ్సబ్ధ ప్రశాంత మరణమే ఊరేగిపుగా మారి
నినాదమై పయనించడం ,చరిత్రగా రూపోందడమే
మార్పు ఏ రూపంలో వచ్చినా
ఈ మరణం మాత్రం చరిత్ర పుటల్లో ఆరంభ వాక్యం.
భాష ముందు మూగగా అనుకుంటాను ..మందు అని వ్రాశారు
ReplyDeleteకవితా చాలా బావుందండి.ఈ క్రింది లైన్లు బాగా నచ్చాయి
ప్రవాహంలో సుడులు తిరుగుతున్న భాష
ఒకరి నుంచి ఒకరు అందుకునే ఇసుక గమేళలా -
మాట మారి నినాదమై కొత్త కట్టడంలా మారింది.
పచ్చటి ఆకులు నేలకు రాలుతే
వాటిని అంటుకున్న నెత్తురు మంచుబిందువులతో కలసి
భూమ్మీద ఒరుగుతూ
త్యాగాల నినాదాలని లిఖిస్తోంది