Wednesday, 25 January 2012

మరణమే చరిత్ర




ఒక ఒంటరి దేహం
సంకల్పంతో మరణించి
తనకు తానే కొత్తగా స్ఫూర్తిగా నిలబడింది

మంచి చెడు పాపం పుణ్యం
ఏవి పట్టనట్లు ఒంటరితనంతో
కన్నపేగు గర్వించే సమూహమైంది

ఒక మరణం తెచ్చిన తుఫానులోంచి
ఒక మరణం తెచ్చిన సంక్షోభంలోంచి
నగరం తన ప్రతిబింబాన్ని కొత్తగా చూసుకుంది

నలిగిన ముఖం ముక్కలైన భాష
భాష ముందు మూగగా
తనను తానే అశ్చర్యంగా చూసుకుంది
          ౨
గుంపులు  గుంపులుగా మాట్లాడే భాష
ఎలుగెత్తి నినాదంగా మారే రూపం ఉద్యమం!

నినాదాలు నిట్టూర్పులు ఆవేదనలు
             అంతా ఒక బాషలోనే
ప్రవాహంలో సుడులు తిరుగుతున్న భాష
ఒకరి నుంచి ఒకరు అందుకునే ఇసుక గమేళలా -
మాట మారి నినాదమై కొత్త కట్టడంలా మారింది
ఇప్పుడు మనల్ని మనం కోత్తగా చూసుకుంటున్నాం
కన్న తల్లిని రెండు ముక్కలుగా పంచుకునే తతంగాన్ని
 విచిత్రంగా గమనిస్తున్నాం
అంగుళం కదలకుండా
జడంగా మారి మనల్ని మనమే  కొత్తగాచూసుకుంటున్నాం

మరణం ఊరేగింపుగా మారడం
మరణం రక్తసిక్త రణంగా మారడం చూస్తూన్నాం
ఈ చూపు ఎంత పాతబడిపోయిందంటే
చూపు తప్పించి ఇంకేమి మిగలనంత
మనకు మనమే వింత ,మనభాషే మనకు కొత్త
                ౩

పొట్ట చేత పట్టుకుని ఊళ్ళు వదిలి్నవాళ్ళం
అపరిచితులుగా ఇక్కడ  చౌరస్తాలో నిలబడి పోయాం
ఇప్పుడు దారులకు గమ్యంతెలియదు
చెట్ల కింద నేర్చుకున్న విద్య ఒంట పట్టించుకున్న చదువు
గుండెలో నింపుకున్న అక్షరాలు
పరాయిగా మారి అ ఆ లు వేర్వేరు గుంపులై పోతున్నాయి
పచ్చటి ఆకులు నేలకు రాలుతే
వాటిని అంటుకున్న నెత్తురు మంచుబిందువులతో కలసి
భూమ్మీద ఒరుగుతూ
త్యాగాల నినాదాలని లిఖిస్తోంది

మరణం తరువాత నిశ్శబ్ధం
గంభీరంగా అలుముకున్న ప్రశాంతత
ఆ నిశ్సబ్ధ ప్రశాంత మరణమే ఊరేగిపుగా మారి
నినాదమై పయనించడం ,చరిత్రగా రూపోందడమే
మార్పు ఏ రూపంలో వచ్చినా
ఈ మరణం మాత్రం చరిత్ర పుటల్లో ఆరంభ వాక్యం.




Friday, 6 January 2012

మళ్లీ మొదలు .....

 సంసారం  గొడుగు కింద
 చాలీచాలని స్థలం
 ఇరుకు ఇరుకుగా
 అయిన సర్దుకుంటూ

విడివిడిగా ఇద్దరు ...
కలవని మనసులు
జవాబు లేని ప్రశ్నలు
ఒకొక్కసారి విడి పోవాలన్నా తపన

దూర దూరంగా వుండలన్న   తాపత్రయం
నడుస్తున్నా వెంటబడే నీడలా
ఎక్కడో ఒక్క చోట లిప్త పాటు కలుసుకున్నా ...

అసహనం ఆవేదన
ముఖ ముఖాలు చూసుకో కూడదన్ననిర్ణయాలు
పొడిపొడి ఆలోచనలు-
మనసు తెరల మీద కదలాడే గత చిత్రాలు
ఒద్డనుకుంటున్న కొద్దీ ప్రత్యక్ష్య మయ్యే రూపాలు
హృదయం  జ్ఞాపాకాలఅగ్నిలో కాలుతుంది
అన్నిటిని కాగితంలా చుట్టి విసిరి పారేయాలనిపిస్తుంది
ఏమి చేయలేని నిస్సహాయత

ఆనవాళ్ళే లేకుండా
చేరిపేయాలునుకున్నా విషయాలు
హోరెత్తే సాగరంలా పోటేత్తుతూ
నిద్రని దూరం చేస్తాయి ..

తెల్ల వారితే అన్ని మొదలు
పెదవిమీద రంగులా
రాసుకునే చిరునవ్వులు
తెచ్చి పెట్టుకున్న సహనం
సర్దుకు పోవాలనుకుంటూ
మళ్లీ మొదలు ..... 











 




 




















Tuesday, 3 January 2012

వాడితో నా ప్రయాణం

 
బుజంమీద ముడితో జోలెలా అనిపించే
మెత్తటి చీరముక్క ఊయలని-
ఆమె జోలె అంటుంది
నేను వాడిని మోస్తూ నాలోకి ఒదగనిస్తూ
వాడి అనుభావాలకి మూగ  పల్లకీనవుతాను

పొద్దునే నాలోకి జారుకుంటాడు లేతభానుడిలా
                 ,అక్కడనూంచి మాఇద్దరి ప్రయాణం.

నిద్రవీడని లేతకళ్ళు వాహనాల రోదకి ఉలికిపడతాయి
వాలిపోతున్న మెడకి ఆసరాగా చేతులు కానిచేతులు
నాచీర అంచులతొ అడ్డుకుంటాను..

అకొసనూంచీ ఈ కొసకి పరుగులు  పెట్టే తల్లినిచూస్తూ నవ్వుతాడు
వాడి లేతచిరునవ్వు నాకే వినిపిస్తుంది
వాడి ఊసులని వింటాను, ఏడుపుకి భయపడతాను.

అమ్మ ముఖంకోసం తలఎత్తీ చూడలనుకుంటాడు
ఎండ చుర్రుమని రెప్పలని వాల్చేస్తుంది.
ఎవరెవరో కనిపిస్తారు,వాళ్ళనే చూసి నవ్వుతాడు

వెలుతురు కొమ్మమీద వాలిన చీకటి 
వాడిని అమ్మఒడిలోకి చేర్చింది-
నన్ను దులిపి పక్కగాచేసి వాడిని పడుక్కోపెట్టగానే
మెత్తటి తివాచినవనందుకు నన్ను నేను తిట్టుకుంటాను
కనీసం మెత్తటి దుప్పటి నవుదామని నన్నునేను కుదించుకుని
వాడిని హత్తుకుంటాను.

బోర్లాపడతాడు నన్ను దగ్గరగాతీసుకుని
చేతి వేళ్ళతో లాగుతూ గుర్తుపట్టడాని ప్రయత్నిస్తాడు
ఆటలన్నీ కొద్ది క్షాణాలే..
మళ్ళీ అమ్మకోసం ఏడుస్తాడు

వస్తుంది విసుగుతో కసురుకుంటూ
”క్రిష్ణుడ్ని చెట్టుకి కట్టేసినట్లే ''మమ్మల్ని కొమ్మకి
తగిలించేసి వెళ్ళిపోతుంది.

ఊయలగా నేను జోరుగా ఊగి-
వాడి దుఖాఃన్ని చెరిపే కొమ్మమీద పిట్టకోసం ఎదురు చూస్తాను
వాడి కావలసింది అమ్మ.
అమ్మకి కావాలి ఆకలితీర్చే ఆదాయం.
జీవితం   ట్ర్రాఫిక్ సిగ్న్ ల్ దగ్గర ఆగి పోయింది

వాడి కలలరెప్పలమీద నవ్వు అంచుల్లో నేను తోడుగా మిగిలిపోయాను
అనుక్షణం అమ్మకి దగ్గరగావుంటూ
అమ్మని తీరిగ్గాచూడలేనంతదూరంగా వున్న వాడి
అనుభావాన్ని వింటూండగానే  తూరుపు రేఖలు విచ్చుకున్నాయి....