విడిపోతూ దగ్గరవుతున్న పట్టాలపై చక్రాల కింద
రోజుని అదిమిపెట్టీ పరుగులుతీసే రైలు ప్రయాణం
ఎప్పుడూ వింత అనుభవమే-
చేరుకోవలసిన గమ్యం ఊరిస్తూవుంటుంది
ఒంటరిగా కూర్చున్నందుకు ఊరి ఊహ ఊరంతై
గుండెతలపులు తెరిచి గుట్టుగా చూపెడుతుంది
ఊరి మొదట్లో రావిచెట్టు కింద చిన్నసంత-
బస్సుదిగితే ఊర్లోకి మర్రిచెట్టు దోవ తప్పీస్తే ఊరికి దారిలేదు
అక్కడ నుండే పలకరింపులగాలులు ఒంటిని చుట్టుకుంటాయి
ఉప్పొంగిపోయిన మనసు
ప్రయాణపుబడలిక కుబుసం విడిచేసి ఊరిలోకి జారుకుంటుంది
రోహిణీకార్తె మధ్యాన్నపుఎండ నిలువునా కాస్తూంటే
దిగుడుబావిలో ఈతలు
- ఆస్నానం ఎంతో గొప్పది
బావి చుట్టూ చిన్నచిన్న అడుగుల కుదుళ్ళలో నీరు.
నీటీతడీలో పిచుకల స్నానాలు..
పాత ప్రహారిగోడ నాచుపట్టి నల్లరంగు పులుమినట్లు-
అవతలవైపు మసీదు, ఇవతలవైపు శివాలయం
శివాలయంలొ పచ్చగన్నేరు పూలు
జంగం గంట ,శంఖం ఊరినిలేపితే
వెలుగురేఖలు శివాలయాన్ని మసీదుని చుట్టుకుని
గాలిగోపురంలో పావురాళ్ళని నిద్రలేపి
గన్నేరుపూల అంచుల్లో పారాడుతాయి
ఏటి స్నానాలదగ్గర అందరు ఆత్మీయులే!
వరసలుకలుపుకోవడమే తెలుసు-
నీటి అద్దం సాక్షిగా
శివరాత్రి జాగారం, పీర్లపండగ జండాలు అందరివి.
నాగరికతలో కొ్ట్టుకుపోతున్న ఊరికళ గతమై కూర్చుంది
ఊరు ప్రయాణం ఎప్పుడు అనుకున్నా
మనిషికన్నా ముందు జ్నాపకాలు పట్టాలపై పరుగులు తీస్తాయి
ఊరిముందు సిగ్నలు రెక్కవాలింది
అడుగు దూరంలో స్షేషను
నేను ఆ పాతమనిషిగానే ఊరిని పలుకరిస్తాను
ఊరే కొ్త్త ముస్తాబుతో,నన్ను మాత్రం పాతగా చూస్తుంది...
*
heart touching memories
ReplyDeletebest wishes