Wednesday, 27 July 2011

పాత ఇల్లు

ఇంటిగేటు తెరవగానే
ఇల్లంతటి జీవితం ఎదురుపడి
చుట్టుకునే గలగలాకబుర్లు,పలకరింపులు,నవ్వులు !
ముగ్గులు వేయని గుమ్మం
గోడవారగా పూలురాల్చని  పారిజాతంచెట్టు 
 నాన్న చిరునవ్వులు, అమ్మ హడావుడి లేని 
ఈ గేటును ఎందుకు తీసానా అనుకుంటాను

ఖాళి అయిన ఇంట్లో
రాలిన సున్నం పెళ్లలలో నిశ్శబ్ధం-
ప్రతిగదిలోనూ ఒక అనుభవం ధూళిదుమ్ములో కలసిపోతూ...

పిచుకల్లా ఈ ఇంట్లో తిరిగాము
ఈ గుమ్మంలోంచే
బతుకుగింజల కోసం ఎగిరి పోయాం
నన్ను పెనవేసుకున్న ఇంటి గతపుపరిమళం
నాతోపాటు గదిగదికి తిరుగుతోంది!

పెరటిలొ మామిడిచెట్టుని పలుకరించాను
ఎదిగి,ఆకాశంలో ఒదిగి 
నిండుగా నీడని పరచి నాకోసం పలకరింపుగా రెపరెపలాడింది .
సపోటాచెట్టు పెరిగి పెద్దదై గుంభనంగా నవ్వింది
మరోవైపు గులాబి,మందారమొక్కల ఆనవాళ్ళు.
మట్టిని తడిమితే తడితడి అనుభవాలు !!
***
ఈ ఇంటిచుట్టూతా ఏదో ఒక జ్ఞాపకం
తన స్వరాన్ని వినిపిస్తూనే వుంది-
***
బతికిన మనుషులని పంచుకొని,భావాలమీద నడచి 
శిధిలమైన పునాదులపై
మేడలు కట్టాలని మట్టిని తవ్వాలనుకునప్పుడే
ఇనుపగేటు తాళం తెరుచుకుంది.
నాఊహలోంచినావెనక నిల్చున్న
అమ్మనాన్నల  -బతుకంతటి ధైర్యం
దిగులు చీకటిపాయలో కలసిపొయింది
సుడులు తిరుగుతున్న నా ఆలోచనల ధారలోంచి
గేటు తాళంకప్ప నాచేతుల్లోంచి జారిపోయింది...
                          **

 











Wednesday, 20 July 2011

Evolution


GLIDING like a white cloud,a tiny seed
lands on lap gently,
surviving in moist soil
soil kissed seed holds an offer.


in the voyage amidst
eeb and tide,twister,typhoon,
if one can love the community
if one can move and get moved,
carrying conflicts and concerns...
if the one steeped in strife and spite,
if the one robbing liberty for liberation
gets respite under a greenwood water!


image in water...
copassion,mercy,clemency.
immutable beauty in every image
ripening as ripples
moves with waves to blend and fade.


seed from folded fist
dances down.
EVOLUTION of
evergreen woodlands of human harmony!

****

Telugu orgin...Ankuram

(Translated from Telugu by DR T.S. CHNDRA MOULI & B.B.SAROJINI)

Friday, 8 July 2011

ఊరి ప్రయాణం

విడిపోతూ దగ్గరవుతున్న పట్టాలపై చక్రాల కింద
రోజుని అదిమిపెట్టీ పరుగులుతీసే రైలు ప్రయాణం
ఎప్పుడూ వింత అనుభవమే-

చేరుకోవలసిన గమ్యం ఊరిస్తూవుంటుంది
ఒంటరిగా కూర్చున్నందుకు ఊరి ఊహ ఊరంతై
గుండెతలపులు తెరిచి గుట్టుగా చూపెడుతుంది

ఊరి మొదట్లో రావిచెట్టు కింద చిన్నసంత-
బస్సుదిగితే ఊర్లోకి మర్రిచెట్టు దోవ తప్పీస్తే ఊరికి దారిలేదు
అక్కడ నుండే పలకరింపులగాలులు ఒంటిని చుట్టుకుంటాయి
ఉప్పొంగిపోయిన మనసు
ప్రయాణపుబడలిక కుబుసం విడిచేసి ఊరిలోకి జారుకుంటుంది

రోహిణీకార్తె మధ్యాన్నపుఎండ నిలువునా కాస్తూంటే
దిగుడుబావిలో ఈతలు
- ఆస్నానం ఎంతో గొప్పది
బావి చుట్టూ చిన్నచిన్న అడుగుల కుదుళ్ళలో నీరు.
నీటీతడీలో పిచుకల స్నానాలు..

పాత ప్రహారిగోడ నాచుపట్టి నల్లరంగు పులుమినట్లు-
అవతలవైపు మసీదు, ఇవతలవైపు శివాలయం
శివాలయంలొ పచ్చగన్నేరు పూలు
జంగం గంట ,శంఖం ఊరినిలేపితే
వెలుగురేఖలు శివాలయాన్ని మసీదుని చుట్టుకుని
గాలిగోపురంలో పావురాళ్ళని నిద్రలేపి
గన్నేరుపూల అంచుల్లో పారాడుతాయి

ఏటి స్నానాలదగ్గర అందరు ఆత్మీయులే!
వరసలుకలుపుకోవడమే తెలుసు-
నీటి అద్దం సాక్షిగా
శివరాత్రి జాగారం, పీర్లపండగ జండాలు అందరివి.

నాగరికతలో కొ్ట్టుకుపోతున్న ఊరికళ గతమై కూర్చుంది

ఊరు ప్రయాణం ఎప్పుడు అనుకున్నా
మనిషికన్నా ముందు జ్నాపకాలు పట్టాలపై పరుగులు తీస్తాయి
ఊరిముందు సిగ్నలు రెక్కవాలింది
అడుగు దూరంలో స్షేషను
నేను ఆ పాతమనిషిగానే ఊరిని పలుకరిస్తాను
ఊరే కొ్త్త ముస్తాబుతో,నన్ను మాత్రం పాతగా చూస్తుంది...

*

Sunday, 3 July 2011

మరుపు పాట

నగరాల్లో ప్రయాణాల్తో అలసిపోతాం
ఆగిన అడుగు ఎదురుగా లెక్కలేనన్ని సమాధులు

అందులో ఒకటి మనగతం

కన్నీటి చుక్కలలో వెదుక్కొనేగాయాలు
ఎప్పటికప్పుడు చిగురుతొడిగే సమయం ఒకటి
గతాన్నితోడితవ్వి మంటలు రేపుతుంది
ఆత్మలధూళీ నల్లటి మబ్బులై నీటిని మోస్తున్న కుండల్లా
వ్యధలకి గాధలకి తోడుగా నిలుస్తాయి

గాలిలో అనంత రోదనం-
తుది మొదలు లేని ఆలోచనలు -

అవి జారిపడిన ప్రతీసారి
మనసురెక్కలు తెగిన పిట్టలా
ముక్కలు ముక్కలుగా తెగిపడుతుంది

రెప్పదాటీ రానియ్యని నీటిచినుకులు
కంటిపాపని కదల్చికురిసేమేఘంలా
మనుసుని తడిపేస్తాయి
చివరిసారిగా "మరుపు"
అసంపూర్ణ పాటలాగ వెంట వెంట తిరుగుతూ వుంటుంది
పదాలు పేర్చి శ్ర్రుతి లయలు కుదిర్చీ"మరపు"పాటని పాడాలి
పాటకుదిరితేనే గతం సమాధి అవుతుంది...............