Thursday, 11 September 2025
*కొత్తపుస్తకం. 210.
*రేణుక అయోల’ గారి.. “రవిక ” కావ్యమ్.!”
(Anthology Poems by Renuka Ayola)
*ఆమెకి తన రవికలేని భుజాలు నచ్చలేదు!!
*కోరిక తెల్ల సీతాకోక చిలుకై వెంటాడింది..
*చూపులవేట తప్పించుకోడానికి ఇనుప
కచ్చడాలు మోసింది..!!
*సంపూర్ణ స్త్రీవాద కవిత్వం.. స్త్రీ గుండె
చప్పుడు .”రవిక”.!!
కవిత్వంలో వైవిధ్యానికి మరో పేరంటూ వుంటే,
అది ఖచ్చితంగా అది“రేణుక అయోల”అయ్యుం
టుంది.” పడవలో చిన్నదీపం” నుండి మొదలైన రేణుక కవితా ప్రస్థానం మూడో మనిషి,పృథ, ఎర్ర
మట్టి గాజులు,. ఇప్పుడు “రవిక” దాకా వచ్చింది.. రేణుక గారి కవిత్వంతో నాకు పరిచయముంది.. ఆమె తీసుకునేకావ్య వస్తువుకు నేను ఫిదా అవు
తుంటాను. ఆశ్చర్యపోతుంటాను.ఒకటా! రెండా?
దేనికదే ప్రత్యేకం.. దేనిగొప్పదానిదే. ఇప్పుడు తాజా
కావ్యమ్ “ రవిక “ మనసును కట్టిపడేసింది.కవిత్వం
లోనే కాదు.. బుక్ మేకింగ్ లో కూడా క్వాలిటీ మిస్ కాలేదు. అదీ రేణుక అయోల ప్రత్యేకత. జనంలో వుండరు.బయట పెద్దగా కనిపించరు. కానీ చేయా
ల్సిన పనిని గుట్టుచప్పుడు కాకుండా చేసుకుంటూ
పోతారు. కవితా రహస్యాలే కాదు.ఆమె వద్ద నేర్చు
కోవాల్సిన ఇటువంటి విషయాలు చాలానేవున్నా
యి.
ఇప్పుడు “రవిక “ కావ్యమ్ గురించి మాట్లాడుకుం
దాం.రవిక…అనగానే.. పాతకాలంనాటి ‘రవికల’ పండగ గుర్తొస్తుంది.పాతకాలంలో స్త్రీని భోగవస్తువు
గా చూసేవారు(ఇప్పుడూ అంతే, కాకుంటే కాస్తంత వెసులుబాటు వచ్చింది)వస్తు మార్పిడి సంస్కృతిలో
భాగంగాజరిగే రవికల పండగలో స్త్రీలు తమ రవికలు తీసి ఓ చోట గుట్టుగా పడేస్తారు. పురుషులు ఆ రవి
కల్లో తమకు నచ్చింది తీసుకొని, ఆ స్త్రీతో గడుపు
తారు.నాటి ఫ్యూడల్ సంస్కృతిలో ఇది తప్పుకాదు.
ఆరోజు రాత్రి స్త్రీపురుషులు ఏకపత్నీవ్రతాన్ని తీసి…
కాస్సేపు కొక్కేనికి తగిలిస్తారు. ఒక ఇల్లాలికి ఆరోజు
కూడా తన భర్తే దొరికితే..‘పండగనాడూ పాతమొగు
డేనా’? అందట. ఇదే సామెతగా మారిపోయింది..
ధర్మపన్నాలు వల్లించే అంతోటి ధర్మరాజు కూడా.
వ్సనానికి లోనై ధర్మపత్ని ద్రౌపదిని జూదంలో పణం
గా పెట్టాడు ఓడాడు.. శ్రీరామచంద్రుడంతటి వాడే
సీతమ్మను అనుమానించాడు. అవమానించాడు.
అగ్ని ప్రవేశం చేయించాడు.లంకలోనే కాదు..అయో
ధ్యకు వెళ్ళాక కూడా పరనిందపేర…సీతమ్మను.
త్యజించి అడవులపాలు చేశాడు.ఇక హరిశ్చంద్రుడై
తే ఆడినమాటకు భార్యనే అమ్మేశాడు
నాడే కాదు.నేడు కూడా స్త్రీని భోగవస్తువుగా, వ్యాపా
ర సంస్కృతి లోభాగంగానే చూస్తున్నారు.పైకి సమా
నత్వ నినాదం,లోపల మాత్రంబానిసత్వభావన.ఆడ
ది నాడే కాదు..నేడూ..ఆటవస్తువుగానే వుంది.మన
దేశంలో “స్త్రీ”అస్తిత్వం నేటికీ ప్రశ్నార్థకంగానే వుంది.
మీకుతెలుసో లేదో కానీ.ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ లో..
వితంతువుల కోసం ఓ ప్రత్యేక ఊరే వుంది..ఇక..
”బేటీ పడావో,బేటీ బచావో “అనేది ఓ అందమైన అబద్ధం. ఓ రాజకీయ నినాదం మాత్రమేనని ఆచర
ణలో రుజువైంది.ఆడాళ్ళ కష్టాలు అన్నీ, ఇన్నీకావు.
ఈ కావ్యంలోని ‘రవిక’ వెనుక ఒక నిజ కథవుంది..
రేణుక గారి నానమ్మగారిని చూసి ప్రేరణ పొంది…
ఈ కావ్యం రాశారు రేణుక అయోల..ఆరోజుల్లో..
స్త్రీలపట్ల వివక్షతకు నానమ్మే ప్రత్యక్ష ఉదాహరణ.
“మా నానమ్మగారు కార్చిన కన్నీటి బొట్టు నన్నుకది
లించేది.ఇంటికి జుట్టు కత్తిరించడానికి వచ్చినప్పుడు
ఆమె పడే ఇబ్బంది నన్ను కదిలించేది.ఇలా అమ్మ
మ్మలకాలంలో కూడా అనేక సంఘటనలు చూశాను
వెరసి.. ఈ కావ్యం” అంటున్నారు రేణుక అయోల.
స్త్రీ వేసే ప్రతీ అడుగులోనూ వంచించే దుర్మార్గమైన
వ్యవస్థ సంగతేమిటి? ఎందుకిలా తయారవుతోంది అనే ప్రశ్నలనుంచి, మనసులోంచి వచ్చిన ఆవేదనే..
ఈ రవిక కవిత్వ సారాంశం. అంటున్నారు రేణుక..
నిజమే నాయనమ్మగారి రవిక లేనితనాన్ని రేణుక
ప్రత్యక్షంగా చూసింది. వైధవ్యం తెచ్చిన వివక్షని..
దానివల్ల నాయనమ్మకు కలిగిన కష్టాలు, బాధల
కు రేణుక ప్రత్యక్షసాక్షి. అందుకే నాయనమ్మను
కథానాయికగా చేసుకొని ఈ కావ్యఖండికకు ప్రాణం
పోశారు రేణుక అయోల
ఈ కావ్యంలో (కవితా సంపుటి) లో రవికను ఒక
కావ్యఖండికగా భావించవొచ్చు..దీంతో పాటు మరో
19 కవితలున్నాయి..అన్నీ ఒకే మొక్కకు అంటుకట్టి
నట్టు ఒకదానికి ఒకటి కొనసాగుతాయి.. ఎక్కడా ల్యాగ్ వుండదు…కవిత్వంలో ఎక్కడా ఖాళీదనం కనబడదు. ప్రతీ వాక్యం పకడ్బందీగా ప్రధానవస్తువు
కు పెనవేసుకుంటూ..సాగుతాయి.అనవసర వాక్యా
లు లేక పోవడం ఈ కవిత్వానికి పెద్ద ప్లస్..!
*రవిక…!!.
వైధవ్యం పేరుతో అగ్రవర్ణం స్త్రీలను రవిక తొడగనివ్వ
కుండా అడ్డుపడిన హైందవ సంప్రదాయంపై రేణుక
ఎక్కుపెట్టినబాణమే ఈ రవిక దీర్ఘకావ్యం. ఈ పేరు
తో రాసిన ఒక్క కావ్య ఖండిక చాలు” రవిక”కు కావ్య
స్థాయిని తెచ్చిపెట్టడానికి
అఒకప్పటి కాలంలోబ్రాహ్మణ కుటుంబాలలో ఆచా
రాల పేరిట వితంతువుకు ‘రవిక’ తొడగనిచ్చేవారు
కాదు.ఈ కవయిత్రి రేణుక నానమ్మ ఆ సాంప్రదాయా
న్నిఎదిరించి రవికని వేసుకుంది. దీనికోసం ఆమెపడి
న
సంఘర్షణ ఎదుర్కన్న ప్రతిఘటన ,చిన్నదేం కాదు. అయితేనేం నాటి మూఢాచారంతో కలబడి,నిలబడి మరీ గెలిచింది. ఇది ఆమెవ్యక్తిగత విజయమే కాదు.
ఇలా పోరాడే ప్రతీ ఒక్కరి విజయం.సామూహిక విజ
యానికి బాటలు వేసిన గొప్ప విజయం..!!
“ఆమెకి తన రవికలేని భుజాలు నచ్చలేదు
ఎద చుట్టూ కప్పుకున్న చీరకొంగు ఒసలగానే
కొన్ని జతల కళ్ళు అక్కడే తచ్చాడటం నచ్చలేదు.
నచ్చని నగ్నత్వం కింద మనసు శరీరం నలిగిపోవడం
ఆమెని వెంటాడే మనసు పోరాటం..
….
పట్నంలో చూసిన రవిక
భుజాలమీదికి వస్తుందో రాదోతెలియని
రోజులకింద ఆశ..
…
కోరిక తెల్ల సీతాకోక చిలుకై వెంటాడింది.
వాలుతూ ఎగురుతూ కలలో ఊయల ఊగుతోంది.
గుండీలు పెట్టుకుంటున్న చేతివేళ్ళు
లిల్లీపువ్వులా నవ్వుతున్నాయి
రవికని కప్పుకున్న గుండెలు
భద్రంగా పసిపాపల్లా నిద్రపోతున్నాయి “!
రవికలేనపుడు, రవి తొడిగాక నానమ్మ ఫీలింగ్స్ ను
చాలా గొప్పగా చెప్పారు రేణుక.. మనసుపెట్టి రాస్తే
నే ఇంతగొప్ప కవిత్వం వస్తుంది..”రవికని కప్పుకున్న గుండెలుభద్రంగా పసిపాపల్లా నిద్రపోతున్నాయి”..
అన్న ఒక్క వాక్యం చాలు ఈ కవయిత్రి కవన మహి
మను తెలియజేయటానికి..
“నూతి గట్టుమీద స్నానాలు చేసిన దేవుళ్ళు
ఎండలో వరుసగా నిల్చున్నారు
వాళ్ళ ఒళ్ళు తుడిచే తెల్లటి పంచముక్క
ఒంటిమీద రవిక అవలేకపోయింది….
….
మహానగరం నుంచి కానుకగా వచ్చిన రవిక
నట్టింటి దూలంమీద దాక్కున్న నాగుపాము
ఒంటిని చుట్టుకోడానికి బుసలు కొడుతోంది…
….
కోరికముందు భయం ఓడిపోయిందెమో
పెట్టెలో దాచుకునచన రవిక ఎదని హత్తుకున్నాక
తెల్లగన్నేరు రెక్కలావుంది…
పెట్టుకున్న గుండీలు చూపులన్నింటిని
పేల్చేసే మిషను గన్నులా వుంది..
….
చీరలోకి రవిక ఒదిగిన కొత్తరూపు
చూపుల దుమ్ముదుమారంలో మాసిపోయింది
….
ఏ విలువలేని ఆడతనంకోసం
ఆమె…
గుమ్మం దాటకుండా హక్కుల్ని అడిగింది
బిరుదులన్నిటినీ
కుంపటి బొగ్గులతో కలిపేసి
రవికని తొడుక్కున్న సుఖం శరీరంమీద
ఆమె…
తెచ్చుకున్న విజయం వెల్తురు
అలలమీద తేలుతున్న చంద్రకాంతిలా మెరిసింది”
నానమ్మ రవిక తొడిగింది. నానమ్మ గెలిచింది.. కాదు
నానమ్మలాంటి ఆడాళ్ళందరూ గెలిచారు.. ఇది నాన
మ్మ విజయమే కాదు.. సమస్త స్త్రీలోకం విజయం….
నానమ్మ చీరలోకి రవిక ఒదిగిన కొత్తరూపుచూపుల
దుమ్ముదుమారంలో మాసిపోయింది…ఎంతో గొప్ప
భావన.. అంతేగొపచప వ్యక్తీకరణ..
**
*సాహసం ఆమె మరోపేరు!!
స్త్రీలకోసమే పుట్టిన ఆచారాలు స్త్రీలని వేధించినా వాటిని పాటించడానికి ఎప్పుడూ ఇబ్బంది పడ
లేదు.. వైధవ్యం ఒక్క స్త్రీకే పరిమితం చేసినప్పుడు
వాటితో పాటు నడుస్తూ ఎన్నో అవమానాలని భరిస్తూ జీవితం గడిపేశారు..గాయం పుండులా మారి సలపరం కలిగినప్పుడు దురాచారాల్ని ఎది
రించాలన్న ఆలోచన, సాహసం కలిగింది…
ఖాళీ నుదుటితో ఆమె…
ఆమెకి
ఇరవైయేళ్ళ తేడాతో తాళికట్టినవాడు
ముసలివాడు చనిపోక ఉట్టికట్టుకొని వుండిపోతాడా
…..
తెల్లచీర గుండు అడ్డకచ్చ పోసీ
విభూతి బొట్టుతో ముఖం
శకునాలకి ఎదురుగా బతికే ధైర్యంలేని వయసు
…
అందరి చేతులు కళ్ళు ఉచితంగా
ఒంటిమీద హక్కుగా వాలిపోతుంటే
…
గుండె ఆగి చనిపోతే..
అనుకోవడం ఆమెకు జపంగా మారింది
బయటపడటానికి ప్రయత్నించింది.
నది ఒడిలో మునక..
ఈత వచ్చిన మునక..
మైళ్ళదూరంలో ఆనందం ఆవలి తీరం చేరుకుంది.
ఎత్తైన శిఖరం మీద ధిక్కార పతాకం.. వెలిగే ఆమె
ముఖం.. నది నీడలో నిశ్చలంగా కనిపించిందట…
*ఓ బ్లాక్ బ్యూటీ విజయం
ఇలా మొదలైంది..!
ఒంటిరంగు చూసి మనుషుల విలువను అంచ
నావేసే లోకం ఇది. అందుకేఇప్పుడు మార్కెట్లో రంగుదోపిడీ జరుగుతోంది.నల్లగావున్న చర్మాన్ని తెల్లబరుస్తాం. కొత్త రంగు తెస్తామంటూ ఎన్నో బ్యూటీపార్లర్లు వెలిశాయి. క్రీముల ధందా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఫేషియల్ పేర పార్లర్లకు
సొమ్ములే సొమ్ములు.పుట్టుకతో వచ్చేరంగునిజం
గా మారుతుందా! మారుతుందన్న భ్రమలో వేల
కోట్ల వ్యాపారం జరుగుతోంది.వీటన్నింటికి అతీ
తంగా ఓ నల్లమ్మాయి ఆత్మవిశ్వాసంతోబ్యూటీ
కాంటెస్టులో విజయం సాధించింది….
“ఆమె యవ్వనంతో పాటు ఎదిగిన రంగు
కుంగుబాటులో కూరుకుపోయింది….
…
ఆమె నలుపుద్వేషం రంగస్థలంమీద
తెల్లటితెరలు చించి వ్యక్తిత్వాన్ని బయటపెట్టింది.
…
తెల్లటి సమాజానికి చీకటి విలువ నేర్పుతూ
నన్ను ఊపిరి పీల్చుకోనివ్వండి! అంటూనే
బ్లాక్ బ్యూటీ విజయాన్ని సాధించింది…
తెలుపుపై…నలుపురంగు సాధించిన అపూర్వ
విజయం ఇది…ఆత్మ విశ్వాసం వుంటే ఏదైనా
సాధించవచ్చనే నమ్మకానిదీ విజయం..!
**
పెళ్ళి సుఖమా..?
సహజీవనం సుఖమా?
కలిసి జీవించడానికి
భార్యభర్త పిలుపులు లేని ఇంటికి
అద్దాల తలుపులు బిగించుకున్నప్పుడే
ఆనందం ప్రతిమూల
ఎర్రగులాబీల గుల్దస్తాలని పేర్చింది”.
(ఒప్పందాలు)..
సమాజంలో స్త్రీలకి పెళ్ళి భద్రతనిస్తోందా..?
అన్న ప్రశ్న మొదలయ్యాక, కొన్ని సమస్యలు
కొన్ని కుటుంబాల్లో చొరవడి వేదనకి గురిచేస్తు. న్నాయి.. ఈ నేపథ్యంలో పెళ్ళి సుఖమా? సహ
జీవనం సుఖమా అన్న ఆలోచన మొదలైంది….
సుప్రీం కోర్టు కూడా సహజీవనానికి ఆమోద ముద్ర
వేసింది.. నేటి యువతరం ఇప్పుడు సహజీవనం
వైపు అడుగులేస్తున్నారు.. అయితే ఒక్కసారి సహ
జీవనంలోకి అడుగుపెట్టాక.. కారణాంతరాలవల్ల వెనక్కి తిరిగివచ్చేకన్నా…ఆ జీవితాన్ని అర్ధంచేసు
కుంటే సమస్యే వుండదు. అదే ఆమె విజయమవు
తుంది..
***
*కచ్చడం.. తాళంకప్ప.
కొన్ని వింటుంటే “ ఛీ “ అనిపిస్తుంది. ఈ మగాడి
దుశ్చర్యలకు అంతంలేదా! అనిపిస్తుంది. పెళ్ళాల
మీద అనుమానంతో భొర్యలకు కచ్చడం తొడిగించి, నడుంకుతాళం కప్ప వేసి, తాళం జేబులో వేసుకొని బయటకెళ్ళే మగాళ్ళగురించి ఏం చెపబుతాం. అక్క
డెక్కడో పెళ్ళాలు అందంగా కనబడకూడదని పెదాలను తాళం కప్పలతో మూసేస్తారు. వాళ్ళంటే
అనాగరికులు..కానీ ఈ నాగరిక సమాజంలో బతికే
వాళ్ళకేమైంది? ఇప్పటికీ కొందరు ఇళ్ళకు గొళ్ళెంపెట్టి
తాళంవేసి బయటకు వెళ్ళఘ అనుమానపు మొగు
ళ్ళున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.మనువు కాలం
లో పెళ్ళాలమీద అనుమానంవచ్చి నడుముక తాళాలు వేసే మొగుళ్ళను చూశాం.. పాపం ఆ తాళపు కప్పల్ని ఎలా మోసారో ఏమోగానీ, ఇప్పటి
మొగుళ్ళు కొందరు అనుమానపు చూపులతో పెళ్ళా
లను మానసికంగా హింసిస్తున్నారు.ఈ పరిస్థితుల
కు అద్దంపట్టే కవిత.. “కచ్చడం”.
స్త్రీకి తన శరీరంమీద తనకే హక్కులేకుండాపోయిం
ది.ఓ మూరెడు పసుపుతాడు కట్టి స్త్రీ శరీరంపై పేటెం
ట్ హక్కుని సాధించేస్తాడు పురుషుడు.అందమా!
అవయవమా!మగవాడి చూపులతూకంలోఏదిఎక్కు
వ బరువుతూగుతోందో తెలీని పరిస్థితి..
“అనుమానం తలుపు కొట్టినప్పుడు
నడుముకు కచ్చడం తగిలించి
యోనిని కాపుకాసే తాళం కప్ప చేయించుకొని
తాళం పంచ మొలకి కట్టుకున్ననాడూ
భయపడలేదు..
అనుక్షణం వెంట వెంట తిరిగే మగడు
చూపులవేట తప్పించుకోడానికి
ఇనుపకచ్చడాలు మోసింది..
ఒకటా!రెండా.. ఆడాళ్ళపై చిత్రహింసలు..
యోనిపూజల దేవతనిచేశారు, మడి కోసం మట్టును
అంటు చేశారు. ఆడపిల్లగొంతులో వడ్లగింజ వేశారు
యాసిడ్ పోసి ముఖాన్ని కాల్చారు…అదే ఆడది తిరగబడి చేతిలో విస్కీగ్లాసుతో కనిపిస్తే బరితెగిం
చిందని నిష్టూరమాడతారు. ఈ మగబుద్ధి వుందే…
అదెన్నటికి మారదు గాక మారదంటున్నారు.రేవచ్చే
కళ్ళు..మద్యనిషేధం మాటలకే…పరిమితం.!
మద్యం సమాజాన్ని నిశనంచేస్తోంది. మద్యనిషేధంపై మహిళలు ఉద్యమించినా ఫలితం శూన్యం. మగా
ళ్ళు మద్యంతాగి ఇల్లూ.. ఒళ్ళూ గుల్లచేసుకుంటు
న్నారు.మరో పక్క ప్రభుత్వమే మద్యం షాపులు తెరి
చి జనాన్ని తాగుబోతులుగా చేస్తోంది. ఎవరికి చెప్పు
కోవాలో తెలీక మహిళలు పడే బాధ అంతాఇంతా
కాదు..
సర్కారు వా మద్యం రద్దు వాగ్దానంలో తెగి దారి
తప్పింది సంసారాల మధ్య తెగిన కరెంటు తీగలా
పడిపోయినప్పుడే.. రోడ్డెక్కిన ఆమె.. వేలమంది
గాజుల చేతుల్ని కలుపుకుంటూ న్యాయం మెట్లు
ఎక్కుతూ అనేక స్వరాల కన్నీటి తునకలు గాజుల మలారంలో చిక్కుకున్నప్పుడే, వాటిని చెరిపేసే నమ్మ
కంలో ఇరుక్కుంది ఆమె ముఖం.. అంటారు రేణుక.
*సెల్ వెల్/ సోషల్ మీడియా భూతం..
“ఆమె
తన వెంటబడే కళ్ళు
కాలేజీ వాష్ రూముల్లో
మాల్స్ ట్రయల్ గదుల్లో
ఉన్నాయని తెలిసినప్పుడే
ఎక్కడ తలదాచుకోవాలో
తెలియని చౌరాస్తాలో నిలబడి
ఆడపిల్లగా పుట్టినందుకు సిగ్గు పడింది “
*వెంట వెంట వచ్చేకళ్ళు!!
సోషల్ మీడియా వచ్చాక ఆడాళ్ళకు రక్షణ లేకుండా
పోయింది. అశ్లీల వీడియోల్ని అప్ లోడ్ చేసి బ్లాక్
మెయిల్ చేయడం ఎక్కువైంది. అలాగే కాలేజీ వాష్ రూముల్లోమాల్స్ ట్రయల్ గదుల్లో రహస్య కెమెరా
లుపెట్టి వేధిస్తున్నారు. సెల్ వెల్ అయిపోయింది…
నెట్టింట దారుణాలు ఎక్కవయ్యాయి. స్త్రీలకు ప్రైవసీ
యే లేకుండా పోయింది. మన ఇళ్ళల్లో ఇలాంటి రహ
స్య కెమెరాలుండవు కదా.. మరి పబ్లిక్ స్థలాల్లో,
బయట ఎందుకు పెడతారో తెలీదు.. అంటున్నారు
రేణుక అయోల.
***
స్త్రీ సమూహంలో వున్నా ఒంటరి నడకే..
ఆమె…
నడివయసులో సింగిల్ వుమెన్ గా బతకడం
విశాలమైదానంలో వానలో తడవడం లాంటిదే.
పోకిరి గాళ్ళ పనికిమాలిన చేష్టలు సరేసరి..
**
పిల్లలకోసం స్త్రీలు పడే తపన అంతా ఇంతాకాదు.
పిల్లలు కలగక పోతే మూఢనమ్మకాలకూ దాసోహం
అంటారు. తాయెత్తులు కట్టుకుంటారు. ఇక ఆడపిల్ల
పుడితే అరిష్టమని శాపాలు పెడతారు. మగపిల్లాడు
పుట్టకపోతే నిందలు మోపుతారు. స్త్రీ శరీరంపై ఇదో
పచ్చబొట్టై జీవితాంతం మచ్చగా మిగిలిపోతోంది.
“ఆడపిల్లల వెనక ఒక్క మొగ నలుసుకోసం
నెలలు నిండని పిండాలుశరాలిపోతుంటే
తలవొంచుకున పరిస్థితి..ఎప్పుడు మారుతుంది?
అంటోంది కవయిత్రి..
**
ఇక ఇల్లాలు అంటేనే చిన్నచూపు.. అసలు స్త్రీని సాటి
మనిషిగా కూడా గుర్తించని దారణమైన స్థితి..
**
భర్తకు రిటైర్మెంటు దొరికినా భార్యకు మాత్రం దొరకదు. రిటైర్ అయిన భర్త కు ఇల్లు, ఇల్లాలు
గుర్తుండదు. సాయంత్రమైతే తాగుడు. వాగుడు.
వీలైతే పేకాట.. ఇంట్లో శాంతి కరువు. భార్యకు
విశ్రాంతి వుండదు..
***
అరవైయేళ్ళొచ్చాక స్త్రీ జీవితంలో పెనుమార్పులు.
వయసును దాచుకడానికి ఎన్ని తిప్పలు పడాలో.
**
ఇలా స్త్రీ కేంద్రంగా “రవిక” ను స్త్రీవాద సాహిత్యంగా
మలిచారు రేణుక అయోల.. ఇదో సౌపూర్ణ స్త్రీవాద
కావ్యమనడానికి ఎటువంటి సందేహౌ లేదు. ఈ మధ్య ఇటువంట స్త్రీ బేస్డ్ కవిత్వం రాలేదు. స్త్రీచుట్టూ
తిరుగుతూ, స్త్రీల సమస్యల్ని బాధల్ని ఏకరువుపెడు
తూ,పనిలో పనిగా స్త్రీ సాధించినవిజయాలను ఉటం
కించే ఈ కవిత్వం మెచ్చదగింది.
ఇక ఈ కవితల్లో రేణుక విశ్వ రూపం చూపించారనే
చెప్పాలి.. ఒక్కో వాక్యం. మిస్సైల్ తలపిస్తుంది..
పురుషాధిక్యతపై రేణుక విసిరిన అణ్వాస్త్రమిది
*పెదవి మీద వున్న పుట్టు మచ్చతో
నవ్వే నవ్వుమీద నిలబడి మెరిసింది”
*ఆమె.. ఇంట్లో
నిద్రపోతున్న నీలి ఉత్తరం
*అమాయక నవ్వులన్నీ
గుండెలోనుంచి జారి
వొడిలో పడిపోయాయి..
*చిరిగిపోతున్న ఉత్తరం పాటపాడుతోంది. “!
*వర్షంలో చెట్టుగొడుగు కింద నిల్చున్న
సాయంకాలం!
*ఆమె గృహిణి.. వంటింట్లోవంటై ఉడికి
పోతుంది.
*క్షణాల యుద్ధంలో ఓడిపోవడం
ఆమెకు నచ్చలేదు
లాంటి వాక్యాలు ఎన్నోవున్నాయి. ఈ కవిత్వం
చదివాక గుండె బరువెక్కుతుంది. మనసున్న
మగాళ్ళు సిగ్గుతో తలదించుకుంటారు.. స్త్రీలైతే
తలెత్తి చూస్తారు. స్త్రీలను వేధించే దుర్మార్గమైన
వ్యవస్థను ఇలా దృశ్యమానం చేయడంలో రేణుక
అయోల నూరు శాతం న్యాయం చేశారనే చెప్పాలి.
స్త్రీలకు సంబంధించిన సమస్యలు.. విజయాలపై ఫుల్ ప్యాకేజ్ ఈ కవితా సంపుటి..అందరూ తప్ప
క చదవతగ్గ కవిత్వం.ఇష్టం లేకున్నా మగాళ్ళంద
రూ చదవాలి ముఖ్యంగా స్త్రీలు. తప్పనిసరిగా…
చదవాలి..(Must read)
రేణుక అయోలగారికి అభినందనలు..
*ఎ. రజాహుస్సేన్.
*బోధి ఫౌండేషన్ ప్రచురణ
పేజీలు.. 108.ధర. రూ. 100/
కాపీలకు..
*నవోదయ…బుక్ హౌస్.. 9247471362
*విశాలాంధ్ర బుక్ హౌస్.. 9963845649
*లోగిలి బుక్స్.. 9550146514.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment