Tuesday, 21 February 2012

కొత్త ఉదయం పుట్టుక





ఉదయం కిటికి తెరవడానికి రాత్రిని అనుభవించి
ఒంటరి నడకలకి పెట్టుకున్న పేరు
మార్నింగ్ వాక్ .

రోజు చూసే చెట్లు, మెత్తటి గడ్డి
పొగమంచు తెరలో చిక్కుకున్న వెలుతురు

 సిద్దంగా వుండే్ పచ్చగన్నేరు పూలమడి
అలవాటుగా చిరునవ్వులు సంతరించుకున్న పలకరింపుల ముఖాలు
*     *  *

ప్రతీ ఉదయం అక్కడ కొన్ని పూలు కొత్తగాపూస్తాయి
అందానికి అర్ధాలు చూపిస్తాయి
పచ్చికలో  పసుపురంగు పూల మొక్క
తన్మయత్వంలోకి జారి-

ఒక్కసారి చేతుల్లోకి తీసుకుంటే
లేత రెక్కల అనుభవం
ప్రకృతి అరచేతిలో ఒదిగి
పరిమళాలు నింపిన కొత్తదనం

అప్పుడొక పాట మనసులో సుడి తిరిగి
బయటికి రావడానికి మొహమాటపడి
ఆ నిశ్శబ్దరాగం గొంతులోనే పాటపాడుకుంటుంది

నన్నో అతిధిలా కాకుండా తోటమాలి అనుకుంటాయి
ప్రతీ ఉదయం  ఎన్నో దృశ్యాలు
గడచిన రాత్రిని  మరుగునపడేస్తాయి.

రోజు వచ్చీ  వెళుతున్నాసరే
కొత్తగా చెప్పవలసింది ఇంకా మిగిలిపోతుంది
వినడానికి  మళ్ళీమళ్ళీ రావాలి
ప్రతీఉదయం కొన్ని సంగతులు
రాలిన ఆకుదొన్నెలోనో
పచ్చగన్నేరు పూలలోనో
వేప గాలిలోనో మిగిలిపోతాయి

కొత్త ఉదయం కిటికి తెరవడానికి
రాత్రికోసం నిరీక్షీంచాలి.



Wednesday, 15 February 2012

అమ్మ నది

 
నిశ్ఛలమైన  నీటిని కదల్చితే వలయాలు
కదులుతూ కనుమరుగైపోతూ
నీటిఅద్దంలో ముఖం

నదిఒడిలో వెదుక్కునే బాల్యం
అలసిన మనసు ,శరీరం సేదదీరేదిక్కడే
నదితో ముడిపడ్డ సంస్కృతి-
నదివెంట పల్లెజనం , నదిఒడిలో గ్రామం

నది ఒడ్డున నిల్చుని ఒంటరిగా
నదిలోతులని పాదాలతో కొలవలేక
ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు
          నది అమ్మలా పలుకరిస్తుంది.
        2
నదిని కార్తీకదీపాలతో అలంకరిస్తే
పున్నమి అద్దంలో  దీపాల పట్టుచీరతో
అమ్మలా, దేవతలా గుండెలో నిండిపోతుంది

నది నాఆత్మ ,నది నా బాల్యం
ఇసుక తనువులో చిన్నతనం
అమ్మమీద అలిగి నదిగట్టుమీద కూర్చుంటే
అలలరెక్కల మీద నీటిపిట్టలని పేర్చీ నవ్వించేది
తోటలోని పిల్లగాలిని పిలిపించి
        ముంగురులను సవరించి మురిసిపోయేది.

నదిలోకి చేపపిల్లలా జారుతే
వెచ్చగా కౌగలించుకునేది
అలల సంగీతంలో మునిగిపోయి
గొంతులో్కి పాట వుబికి నదినంతా నింపేస్తే
            నది నవ్వేది అమ్మలా-

రుతువుల చీరకోంగులో పల్లెని దాచుకున్న నది
పగలు రాత్రీ  వెంట వెంట నడిచీ
 మంచుదుప్పటి పక్కకిపెట్టీ ఏడారి ఆత్మలానిల్చుంది.
ఇసుక మేటలు వేడిగాలులు-

పల్లెమీద అలిగి దూరంగా జరిగి
తనకుతానుగా నిశ్చలంగా పాయలా పారుతుంటే్
వర్షపు గొడుగులేక మండుటెండలొ నిల్చునట్లుంది!
ఇసుక గొంతులో నీటిచెలమల తడి
                            పల్లె  దాహంతీరుస్తూ.

ఆ ఊరి పడవ ఈ ఒడ్డుకి చేరలేక  ఊగుతోంది
చిన్ని అలలకి చిరుమువ్వలా శబ్ధంచేస్తూ-

ఆకులు రాల్చిన తోట  ధ్యానంలొంకి వెళ్ళిపోయింది
నదితొ పాటుగా నేను  ఎప్పటికప్పుడు కొత్తదాన్ని-
పరీక్షీస్తూ నదిలొకి  ప్రవే్శిస్తూ వుంటాను.

ఒక కొత్త వేకువలో
కోకిల గొంతువిడి తోటతలుపులు తట్టీ
నదిలోపలికి  పాటల చిరుజల్లు కురిపించగానే
వేకువ దిగంతాలను చుట్టీ లోకం చెవులలొ ఒదిగి
నిశ్శబ్ధాన్ని చేధించి నిద్రలేపింది.

ఉగాది  కొత్త, జీవితం పాతది అనుకుంటూనే      -
ఇక్కడికి వచ్చిన ప్రతీసారీ  ప్రేమతో పలుకరిస్తూ
ఇంటిగుమ్మంలో ఎదురు చూసే నాన్న, అమ్మ
మామిడి చెట్టునీడలా అనిపిస్తారు

ఇప్పటికీ  ఆ పొదరింట్లో వాళ్ళనీడలో
మనసునిండా అ జ్నాపకాలు నింపుకుని
నీకోసం వచ్చాను  ఏకాంతం కోరుకుంటూ
నీతీరంలో వినిపించే నీ ఆప్యాయత, కొత్త ఉత్సాహం

మళ్లీ నగర ప్రపంచంలోకి పయనమవ్వాలి
ఈ వేకువలు,సాయంకాలాలు,వెన్నెలరాత్రులు
కొంగులో మూటకట్టుకుని-
ఇసుకపొరల్లొ నన్ను నేను దాచుకొని వెళుతున్నాను

నిన్నువిడిచి వెళ్ళలేని తనంలో,
ఇప్పుడిప్పుడే నేర్చుకొన్న చిత్రకారుడి చిత్రలేఖనంలా
నీ తనువుని చిత్రించడానికి ప్రయత్నిస్తూ-
మిగిలిపోయాను ఒక కొండ, ఒక కోన చిత్రిస్తూ
మళ్ళీ గుర్తుకొచ్చింది నిన్ను చిత్రంగా మలచుకుంటే
నీ ఒడిలో్కి రాలేనని
అందుకే ఒదిలి వెళ్ళిపోతున్నాను

నన్ను నా గుర్తులని
నాభావాల  స్పర్సలు  అనుభవించినందుకేమో
                                    నదికన్నులో నీటితడి....!





























Sunday, 12 February 2012

రైలు కలువలు

     
              
 రైల్లో  పొద్దున్నే కళ్ళు తెరవగానే
 రెండు చేతులనిండా కలువపూలతో నలబడింది ఆమె
 బుట్టలోపలి కలువలు
 నల్లచరువులో నిండు వెన్నెల ప్రతిబింబాల్లా
 తెల్లటి మెత్తటి కలువలు ఆకుపచ్చని కాడలు
 బోగినంతా అల్లుకున్న పరిమళం.

 నిద్ర లేనికళ్ళు అలోచనలతో నలిగిన మనసు
 కలువల పలకరింపుతో
 పెదవి అంచులమీద చిరునవ్వు విచ్చుకుంది.
 
”’కొనడమ్మా అడుగుతోంది”’ఆమె
ఆమె ఒడిలో  ఆడుకుంటున్న పసి పాపల్లా
అందరివైపు అమాయకంగా చూస్తున్నాయి

కొనాలనే వుంది కొంటే వాడిపోతాయని
తనివితీరా చూస్తున్నాను.
ఆ పసి కలువలు
రోజు పొద్దున్నే అందర్ని నిద్రలేపీ
కళ్ళల్లో వెలుగులు నింపే ఆ కలువలు
ప్రపంచానికి  వున్న ఒకే ఒక రంగు తెలుపే-
అన్నట్లు స్వఛ్చంగా నవ్వాయి...
కొన్నాను కొన్ని కలువలు
పసిపిల్లవాడిని ఎత్తుకున్నట్లు
జాగ్రత్తగా తీసుకుని పొదువుకున్నాను...













 

Wednesday, 8 February 2012

ఇప్పుడు ఆ ముఖం కోసం

ఎక్కడ అద్దం కనిపించినా
చూపు ముఖాన్ని చూసుకుంటుంది              
తనని తాను గుర్తు పట్టడం కోసం
మనసు పొరలు తోలగించుకొని                      
నచ్చినా నచ్చకపోయినా
ప్రతిబింబం పలుకరిస్తుంది

ముఖాన్ని ముఖంతో చూసుకోవడం
ముఖం వెనకాల భావాలతో మాట్లడుకోవడం
అన్నీ అద్దంతోనే-
అది జరిగి పోగానే ముఖానికో తోడుగు
లొలోపటి వాటితొ సంబంధం  లేని పయనం

లొలో్పల కొన్ని ప్రయాణాలు
చూపు అందినంతవరకు-
 ఘోషలా వినిపించే మాటలు
అవమానాలు ప్రశ్నలు ,సిగ్గు కోపం..
దహించివేసే కొన్ని రూపాలు
జీవితంతో పాటు నడిచిన కొన్ని సంఘటనలు
గజిబిజిగా నిలదీస్తూ ముందుకోచ్చే చిత్రాలు

ఎగురుతున్న గాలిపటంలా ఎక్కడెక్కడో తిరిగి
చీకటిలోయలో పడిపోతూ పట్టుకున్న కోమ్మ బాల్యం
పసితనం పలుకరిస్తుంది
యవ్వనం ఓదారుస్తుంది

ఓజీవితాన్ని మోసి
ఓజీవితాన్ని తిరస్కరించిన మఖం
బాల్యం జ్ఞాపకానికి చిగురిస్తుంది
ఇప్పుడు ముఖం..
ఆ ముఖం  కోసం ఎక్కడ అద్దం కనిపించినా చూసుకుంటూ వుంటుంది..