Friday, 25 November 2011

గతాల పిట్టలు



తడి ఇంకిన  పొడి పొడి జ్ఞాపకాలు
నా చుట్టూ  పిట్టల్లా ఎగురుతుంటాయి
భుజంమీద వాలాలని వాటి  ప్రయత్నం

పట్టించుకోనట్లే తిరుగుతుంటాను

రెక్కల కొనలతో  రాచుకుంటూ
పదే పదే చుట్టుతా  ఎగురుతుంటాయి
అంచులు నిమిరి  పంపిచేస్తుంటాను

పాతకధలు  గుర్తుచేయాలని  పాటనందుకుంటాయి
గతపు ఆకాశంలో రెక్కలతో  ఎగురుదాం - రమ్మంటాయి
తుడిచిపెట్టిన  స్మృతిచిహ్నలను
పొడిబారిన కళ్ళకు చూపిస్తాయి
నీటిచెలమలను చూపించి కంటిపాపలను ఊరిస్తాయి


సుఖాలని అందుకోబోయి  కష్టాలని ,
శాంతి కోసంపరుగులు పెట్టి  అశాంతిని,
చిరకాలపు  స్థితిగతుల్ని
మనసుని మెలిపెట్టే రహస్యద్వారాలని
తెరిచి చూపిస్తుంటాయి.

సతమతమయ్యే  జీవితాన్ని  కళ్ళఎదుట పెట్టి
గతాలపిట్టలు మళ్లీ మళ్లీ వచ్చి వాలుతుంటాయి
ఇంకా ఏవో చెప్పాలని చుట్టూ తిరుగుతుంటాయి

నిద్రని ఆహ్వానించి కలలతో  సాన్నిహిత్యం పెంచుకుంటే
సూటిగా  మాట్లాడలేని ఆ జ్నాపకాలపిట్టలు
కలలచెట్టు మీద కూర్చుని రాగాలు అందుకున్నాయి

వద్దు వద్దు అనుకుంటూనే
కలలుకూడా  ఆ రాగాలమత్తులో
రాత్రంతావింటూనే ఉండిపోయాయి.

కలల అలసటలో తెలివివచ్చాక కూడా
గతాలు-  గాయాలుగా  మారిపోయాయి ...

!*!

















Thursday, 24 November 2011

కౌన్ బనేగా కరోడ్ పతి ...?!


"కిస్సాకుర్సీకా"  మంటలురేపే సింహాసనం
పర్వతాలాంటి మనుషులు ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూ
ప్రపంచంముందు కూర్చుంటారు

గంభీర స్వరం స్వాగతం పలుకుతుంది

ఎదురుగా  కంప్యుటర్  నుదిటి రాతను సరిచేయగల బ్రహ్మదేవుడు!.
ఆనేక  ప్రశ్నలు చిన్నతాళం--
ఇన్నింటినీ తట్టుకుని నిలబడ్డానికి చాలా కష్టపడాలి
గతంముందు మోకరిల్లాలి
లోకంలో మన స్థానాన్ని అప్పచెప్పుకోవాలి

”పంచకోటీ మహామణీ”  ఊహించనికి జీవితానికి సింహద్వారం !

కోరి ఎంచుకున్న మెట్టు ఎక్కగానే
అశల సీతాకోకచిలుకలు చుట్టూ ఎగురుతూ
భవిష్యత్తు రంగులన్నీ లోలోపలికి ఒంపుతాయి  

పలకరింపుల జడివానలో తడిసిముద్దయ్యాక
సింహాసనంలొ కూర్చుని బేలగా మారిపోతూ
కన్నీళ్ళుపెట్టుకుంటూ
మనసు మంటలని ఆర్పుకోవడం అంటే-
సుళ్ళు తిరుగుతున్న ఆశ నిరాశలతో
బీడుభూమి మీద వానచినుకుని అనుభవించడమే..!

చెక్కులు నిదానంగా అడుగులు వేస్తుంటాయి

పరిస్థితులమీద నుంచి, కష్టాలమీద నుంచి
ఆగాధాల మైదానాలమీద నుంచి దాటుకుని
డబ్బు కీరిటాన్ని మోస్తూ
అలఓకగా నేల మీదకాళ్ళు ఆనించి నడవడం !

అందరికి అదృష్టంగా అనిపిస్తుంది.
గెలిచిన ధనాన్ని నెత్తిన పెట్టుకుని
అరికాళ్ళకింద బాధ్యతలు పేర్చుకుంటూ
ధీమగా నడుస్తుంటే అందరి ఆశలు మోస్తున్నట్లే!

నడుస్తున్న వాళ్ళ వెనకాల
మొన్నటికన్నా నిన్నటికన్నా
ఎన్నో తుఫానులు ,ఎన్నో ఇంధ్రధనస్సులు ..
రోజు వస్తూనే వుంటాయి.                    


!*!









  











Thursday, 3 November 2011

కాఫి కప్పుతో -మరుసటి రోజు

     



పగటి ఆకులు దులుపుకొని
పక్కని సరిచేసుకొని నిద్ర పరదాలు దింపుకుంటే
గడిచిన రోజు ఇంకా భూజాల మీదే కూర్చుంది
రోజంతా గడచిన నాటకంలో పాత్రలు ఒక్కక్కొక్కటీ
కళ్ళముందు నిల్చుంటాయి.


పెంచుకొన్న బంధాలు పెనవేసుకోన్న అనురాగాలు
ఫోనులు పలకరింపులు.అసహనాలు ఆవేసాలు
అంతలోనే కన్నీళ్ళు,గుప్పెడు సంతోషం
కొత్త పరిచయాలు కావాలనుకుంటూ వుత్సాహం


ఎవరికోసమో ఎదురుచూపు రారని తెలిసాక నిరాశ.
దేవుడికి ప్రార్ధనలు ,అర్ధింపులు, వంట ఇంటి ఆఖరి సర్దుడై
దొర్లిపోయిన రోజు నిదానంగా తనపని తాను చూసుకుంది


అన్ని ఆగిపోయాక నిద్ర మోసు కొచ్చి పక్కమీద పడేస్తుంది
శరీరం అన్నింటీని ఇమడ్చుకోని  ఆలోచనలని ఒదిలేసి
నిద్రలోకి ఒరిగిన మరుక్షణం-  స్వప్నపు  కిటికి రెక్క తెరుచుకొని
వెన్నెల విజామర వీస్తుంది చలువరాయి పలకల మీద నిద్ర .

సాగరాన్ని దాటి ఒడ్డుచేరుకుకొన్న నావ ఇసుకని ఢికోట్టుకొట్టుకుంటుంది
మెలకువ రెప్పల మీద ఉదయం ''కాఫీ కప్పులో  తేలుతూ  పలకరిస్తుంది .
 





















.