మామకో లేఖ
మామ నీకు మాతో ఉన్న చుట్టరికం తెలుసా
నీ కాంతి అద్దంలో
మా భూమి మెరిసేది
మా విరహంలో
మా దిగులుల్లో
మా పాపాయి కళ్ళల్లో
నీ రూపం నిండు జాబిల్లి అయ్యేది
తల ఎత్తి నిన్ను చూస్తున్నప్పుడు
అనందం మా కళ్లకే తెలుసు
నువ్వు మాగదిల్లో
కిటికీ చువ్వలతో ఆడుకున్నప్పుడు
మావూరి బావిలో తేలినప్పుడు
మా నదుల మీద పడవలా తేలినప్పుడు
కాగితల మీద అక్షరాలుగా
మాచెయ్యి పట్టుకునే వాడివి
రాత్రి రోడ్డు మీద పడుకునే వాళ్ళ కి
చల్లని దుప్పటి అయ్యేవాడివి తెలుసా
మంచి నీళ్లు మురికి కాలువలు
కావేవి వెన్నెలకి అడ్డం అనే వాడివి
ఇంత బంధంతో
ఇంత స్నేహంతో
నీ కోసం నిర్మిచుకున్న వెన్నెల సామ్రాజ్యమిది
మామ ఇప్పుడు నీ ఇంటికి
మేము రావాలనుకుంటే
ప్రయాణించాలి
నిదగ్గరకి రాక ముందే
నీతో ముడి పడ్డ పేజిలని
ఇక్కడే పాతిపెట్టుకోవాలి
మై డియర్ చందమామ
మీ ఇంటికి వచ్చే రోజుకోసం
ఎదురు చూస్తున్నా
మీ చుట్టాలు...