Tuesday, 22 October 2019

   పి.జ్యోతి ( spreading లైట్ )


రేణుక అయోల గారి కవితా సంపుటి “ఎర్రమట్టి గాజులు” ఒక స్త్రీ మనసులోని మ్యూజింగ్స్ కి అద్దిన పదాల సొగసులు. దీన్ని కవిత్వంగా చదవాలి కాని ఇందులో ఇజం ని వెతకడం వల్ల కవిత్వాన్ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేం. సాధారణంగా కొందరు రచయిత్రులకు ఒక బ్రాండ్ ఆపాదించడం జరుగుతుంది. అందులోకి కుదించి వారి కవిత్వాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చాలా మంది విమర్శకులు చేస్తూ ఉండడం నాకు తెలుసు. ప్రొఫెషనల్ విమర్శకుల స్థాయి లో నేను లేకపోవడం కొన్ని సార్లు నా అదృష్టంగా భావిస్తూ ఉంటాను. ఎందుకంటే ప్రతి పుస్తకాన్ని ఒక సరికొత్త భావ వ్యక్తీకరణగా చదివి అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. అందువల్ల విషయాన్ని ఇజాలకు రచయిత్రులకు అంటగట్ట బడిన వాదాలకు దూరంగా కేవలం విషయంగా చదవడం నాకు అలవాటు. అందువలన వీరి కవిత్వంలో కొందరికి కనిపించినట్లు కుల, వర్గ, లింగ పరిమితులు నాకు అంతగా కనిపించలేదు. స్త్రీవాద కవిత్వంగా ఇది ఉంటుంది అనే ఆలోచనతో నేను ఈ పుస్తకం చదవలేదు. ఎటువంటి ఇన్హిబిషన్స్ లేకుండ చదవడం వలన నాకు ఇది అర్ధం అయ్యిన విధంగా ఇక్కడ ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను.
ఈ సంపుటిలో నాకు చాలా నచ్చిన మొదటి కవిత “నీలి రంగు హాండ్ బ్యాగ్” ఈ కవిత పై వాడ్రేవు చినవీరభద్రుడు గారు రాసిన వ్యాసం చాలా గొప్పగా ఉంది. ఆధునిక మహిళ జీవన విధానాన్ని, ఇంత చక్కగా సింపుల్ గా ప్రెజెంట్ చేయడం సాధ్యమని ఈ కవిత చదివే దాకా నాకు తెలీయలేదు. స్త్రీ జీవితంలో మారే ఇష్టాలు ప్రయారిటిలను చాలా గొప్పగా ఈ కవిత చెబుతుంది. ఇందులో ఒక్క వాక్యాన్ని కోట్ చేయలేం, మొత్తం కవితను చదవాలి అందులోని నిర్వేదాన్ని, అనుభవాన్ని అర్ధం చేసుకోవాలి. ఇక మరో కవిత “ఎర్ర మట్టి గాజులు”, దీన్ని చదవగానే హిందీ కవి నాగార్జున్ గారి “గులాబీ చూడియా” అనే కవిత గుర్తుకు వచ్చి తీరుతుంది. 60 సంవత్సరాల నాటి ఈ కవితలోని వాక్యరచన శైలి రేణుక గారి “ఎర్ర మట్టి గాజులు” లో అతికినట్టు కనిపిస్తాయి. అయితే నాగార్జున్ గారు తన కవితలో ఒక తండ్రీ కూతురు మధ్య అనుబంధాన్నిఅలాగే స్త్రీ కి సంబంధించిన వస్తువులను చూసి సమాజం చూపే చులకన భావాన్ని చాలా గొప్పగా అవిష్కరించారు. ఈ గాజులు మీరూహిస్తున్నట్లు ఎవరివో కాదు నా కూతురివి అన్నప్పుడు మారే భావాలు, ఈక్వేషన్సు, వారి కవితలో గొప్పగా కనిపిస్తాయ్. అయితే అదే విషయాన్ని ఒక స్త్రీ జీవన పరిమాణంలో స్త్రీ ధరించే వివిధ పాత్రల ద్వారా చూపుతూ ఆ ఎర్ర మట్టి గాజులతో స్త్రీ కున్న అనుబంధాన్ని అవి గుర్తుకు చేసే సున్నితమైన భావాల్ని అద్భుతంగా పలికించారు రేణుక గారు తన కవితలో. రెండు భాషలలో ఒకే సన్నివేశాన్ని ఒక పురుషుడు, ఒక స్త్రీ తమ భావాలకు అనుకూలంగా రాసినప్పుడు ఉండే వైవిధ్యంలో John Gray “Men are from Mars, Woman are from Venus” అనే పుస్తకంలోని ఫిలాసఫీ కనిపిస్తుంది. నిజంగా స్త్రీ పురుషుల ఆలోచనలలో ఎంత వ్యత్యాసం ఉందో, చాలా భావలలో వారిరో సారూప్యత ఉన్నా ఒకటిగా ఎందుకు ఉండవో చెప్పడానికి ఈ రెండు కవితలను ఉదాహరణగా తీసుకుని ఒక పేపర్ ప్రెజెంట్ చేయవచ్చు.
“ఒక సండాసు కథ”లో కొన్ని వాక్యాలు స్త్రీల పరిస్థితికి అద్దం పడతాయి. “రాత్రి ముట్టుకొట్టులో ఆక్రమించుకున్న భర్త నూతి మీద చేదడు నీళ్ళతో పవిత్రమై తెల్లవారి “అసుంటా వుండూ” అంటూ తప్పుకు తిరుగుతున్న మగడి చేష్టల నుంచి పుట్టిన రవ్వ” ….. ఈ వాక్యాలలో కొంత అగ్రకుల స్త్రీల బాధ కనపడుతుంది. ఏ కులానికి చెందినా స్త్రీ పురుషుని చేతిలో వస్తువుగా మిగిలిపోవడం వెనుక ఉన్న పురుషాధిక్యతను తలచుకుని అయినా ఇప్పటికీ స్త్రీలందరూ ఒక జాతిగా ఎందుకు సంఘటితం కాలెకపోతున్నారో అని వేదన పడుతుండటం సమాజాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటి నుండి నాకో అలవాటు.
ఇందులో నాకు నచ్చిన మరో కవిత “రెండు ముఖాలు” 1920 లో పికాసో చిత్రీంచిన “Weeping Woman,Head of a Woman” చిత్రాలు గుర్తుకు వస్తాయి. “నిజానికి భయపడేది అసలు ముఖంతో ఆ ముఖం దాచడానికి మాటల మట్టి గుట్టుమీద బిడారం వేసుకుని కూర్చుని మాటని పావురాయి చేసి రుమాల్లోంచి తీసి ఎగురవేసి యుద్దవ్యూహాలు రచించి మనిషిని పరాయివాడిగా చేద్దామని పిలుపునిచ్చి అసలు ముఖాన్ని వెనక్కి తిప్పి చూస్తూ వుంటుందీ’ ఈ వాక్యాలన్ని పికాసో మదిలోవా రేణుక గారి మదిలోవా లేదా ద్విముఖాలను చూస్తూ పరిశిలించే మన అందరి మదిలోనివా…. ఆలోచించే మేధ కు ఒక కనెక్టివిటీ ఉంటుంది. ఒక మాట, ఒక చిత్రం, ఒక ఆలోచన ఎప్పుడు ఎక్కడ ఎవరితో కలుస్తాయో చెప్పలేం. అందుకే వాటిని చాలా జాగ్రత్తగా సృష్టించాలి అని మేధావులు అంటూ వుంటారు. వీరి కవిత్వంలో గుంపులో ఒంటరితనం అనుభవించే ఇంటేలెక్చ్యువల్ బాధ కనిపిస్తుంది. “జనం మధ్యలో మనం మనకి మనమే అపరిచితులం” అని ఒక చోట అదే కవితలో “ఏదో సందర్భంలో ఒక ముఖం చేరువ అవుతుంది ఏ సందర్భం లేకుండానే మనసులో ప్రతిష్టింపబడుతుంది, దాన్నే గుండెల్లో మోస్తూ ఆలోచనల్లో పెనవేసుకుంటూ”…..అని మనల్ని ఏవి ఎందుకు ఎప్పుడు ఆకట్టుకుంటాయో ముందుకు నడిపిస్తాయో తెలీని కారణాన్ని వెతికే ప్రయత్నం చేయకుండా అది జీవన రహస్యం అని ఒప్పుకుని జీవించే ఒక తాత్వికురాలు కనిపిస్తుంది.
కొన్ని కవితలు వీరు చదివిన పుస్తకానికి ఇన్స్పైర్ అయ్యి, లేదా ఒక సినిమా చూసి లేదా కొన్ని చిత్రాలకు స్పందించి రాసుకున్నారు, ఈ కవితలు రాయడం వెనుక నేపద్యం వివరించినా పాఠకులు ఈ కవితలతో రచయిత్రిలా కనెక్ట్ కాలేరు ఆ పుస్తకాన్ని లేదా సినిమాని చూడకపోతే. ఇలా రాసిన కవితలలో భావ సౌందర్యం మాత్రమే నేను ఆస్వాదించ గలిగాను. అందుకే ఇవి చాలా వరకు రచయిత్రి మ్యూజింగ్స్ లాగానె అనిపించాయి. డైటింగ్ కాన్సెప్ట్ పై రాసిన కవిత ఇప్పటి స్త్రీలందరూ చదవవలసిందే. శరీర లావణ్యం కోసం పెద్ద పెద్ద రిస్కులు తీసుకోవడం సాధారణమయిపోయింది, దీనికి వీరంటారు “ఈ శరీరం సమాజానికి అప్పచెప్పినట్టుగా ఉంది కులాసాగా ఉన్నారా? ఎవరూ అడగటం లేదు, వెయిట్ ఎంత? ఏ డైట్ ప్లానులో ఉన్నారు? “ ….. నిజంగా మన జీవితాలలో ఎంత నాటకీయత వచ్చేసింది? మార్కెట్ మనల్ని ఎలా ఆక్రమించేసింది అన్న విషయం పై ఈ కవిత చదివి ఆలోచించకుండా ఉండలేం. మాతృత్వాన్ని గ్లోరిఫై చేయడం మన భారతీయ సంస్క్రుతిలో ఒక అతి పెద్ద అలవాటు. పిల్లలను పెంచి వారితో కాంప్రమైజులయ్యి మళ్ళి వారి పిల్లలకు అన్నీ చేయవలసి రావడం భారతీయ తల్లుల అదృష్టం. ఇది ఎంత మంది పూర్తిగా ఇష్టపడి చేస్తున్నారు అన్నది మనం అడగకూడని ప్రశ్న. నాపీ వీసాలకు ఎగబడే భారతీయ మాతృత్వాన్ని నా లాంటి వారు విమర్శిస్తే మమ్మల్నీ మాత్రుత్వ సౌందర్యం లేని స్త్రీలుగా అటు తిరిగి చెప్పుకోవడం నాకు తెలుసు. కాని నా లాంటి స్త్రీల కోసం వీరు “కొత్త ఉద్యోగం” అనే కవితను చాలా చక్కగా పాము చావకుండా, కర్ర విరగకుండా రాసారు. ఈ కవితలో ని ఆఖరి వాక్యాలలో నాకే వెదన నిర్వేదం కనిపించాయా… అందరికా అన్నది ఇంకా కనుక్కోవాలి “ ఎప్పుడు పెంచామో, ఎలా పెంచామో జ్ఞాపకాల పూలతోట నుంచి కొన్ని పూలూ ఏరుకోవాలి కొత్త వుద్యోగం కోసం”……
“ఏకాంతం” అనే కవితలో నాకు పూర్తిగా రమణ తత్వం కనిపించింది. “పక్షుల పాటలకి పల్లవి అందించాలంటే లోపలి రాగాలకి శ్రుతి నేర్పి తీరాలి ఒక్కళ్ళమే వెన్నెలలో స్నానం చేయాలంటే దాని నగ్నత్వాన్ని పంచుకోవాలి” “లోపలి మహా సముద్రాలు ఏకంకాగానే ఒడ్డున చేరుకున్న శవమై పోవాలి” “కళ్ళు తెరవగానే మూగుతున్న ముఖాలకి అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం లేని చరిత్రగా మిగిలిపోవాలంటే అరణ్యమై పోవాలి” అనే వాక్యాలలో రమణుడు కనిపిస్తాడు. చెత్తకుండీ పక్కన తాగి పడిపోయిన వ్యక్తిని చూసి స్పందించి వీరు రాసిన “కన్నీటి గుంటలో శవం” అనే కవితలో “ఎదురు చూసే కళ్ళలోతుల కన్నీటీ గుంటలో ఈదుతూనే ఉంటాడు” అనే వాక్యం లో ఎందరి తల్లుల, భార్యల, బాధ దాగి ఉందో….”ఒక దుఖం ఒక కన్నీటి చుక్క” అనే కవితలో మత సామరస్యాన్ని ప్రస్తావిస్తూ వీరు రాసిన ఆఖరి వాక్యాలు చాలా గొప్పగా ఉన్నాయి “ పెళ్ళికూతుళ్ళ చేతిలో రాళ్ళ గాజులు గలగలమన్నాయి రాజ్యలక్ష్మి, మెహరున్నీసా ఒకేలా సిగ్గుపడ్డారు మెహందీలో పాట ఢోలక్తో కలిసి నాట్యం చేసింది” “సైకిల్ బెల్లు” అనే కవిత వనజీవి రామయ్యగారిని ఉద్దేశించి రాసింది…. వన సంజీవయ్య అని తప్పు ప్రింట్ అయ్యింది ప్రతి వాక్యం నిశితంగా చదువుకునే వాళ్ళు దీన్ని సవరించుకో మని మనవి. “గోడ చెప్పిన కబుర్లు” అనే కవితలో రచయిత్రి రాసిన వాక్యాలు Roman Polanski 1965 లో తీసిన Repulsion అనే సినిమాలో ని పాత్ర గోడలను చూసి భయపడే సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చింది. “ముఖం లేని గోడలు గోడలలో వెతుకుంటున్న జీవితం ముఖాన్ని అణిచేసి దేహంమీద నుంచి పరుగెడుతున్న కాలం అడుగులు అడుగుల పగుళ్ళ నుంచి ఓ నిజం కళ్ళయెదుట నిలబడుతుంది” స్త్రీల suffocation ని తక్కువ పదాలతో ఆవిష్కరించబడ్డ కవిత ఇది. రేణుకగారి కవిత్వంలో Symbolisms ఎక్కువగా కనిపిస్తాయి, “వెలిసిన ఆకుపచ్చని చీర కొంగుని నడుముకు దోపుకుని” “స్కూలు పిల్లల పసి బుగ్గల మీద మందారంలాగ పూసి” “జ్ఞాపకాల పాత చెక్క బీరువా తెరిచి పల్లెటూరి గుమ్మంలో వొదిలిపెట్టింది” “పాడి నేల మీద రాలిన పెద్ద చినుకులా నన్ను తడిమింది” లాంటి expressions చాలా కనిపిస్తాయి.
వీరి కవిత్వానికి ఉన్న పెద్ద ఎసెట్ కనెక్టివిటి. ఇది మన అందరి ఆలోచన అనో మన మనసులోని భావం అనో మనచేత అనిపించేలా చేసే గుణం ఈ కవిత్వానికి ఉంది. కవిత్వంలో విషయం కన్నా feeling ఎక్కువ. Subjective or objective poetry కాదు వీరిది. Its an expression… pure expression and response towards the world around. అందుకే విషయం కన్నా భావం, భావ వ్యక్తీకరణ ప్రధానంగా రాయబడిన కవిత్వంలా దీన్ని అర్దం చేసుకోవాలి.