అరచేయి దోసిళ్ళలో ముఖం ఉంచి
రహస్యంగా దాచుకున్న దుఃఖమేదో
వరదలా పొంగి వేళ్ళ సందులలొంచి జారీ
వర్షంలా జారుతున్నపుడే ...
వేళ్ళని ఊడల్లాదించి
దేహం తప్పా ఏమి కనిపించని కళ్ళతో
ఊహకందని పరిమళంతో
బంధించినపుడు
ముల్లు గుచ్చుకున్న రాపిడి
పొడిబారిన నేలలో దుమ్ము పట్టిన పొదలమీద
రాలిన చినుకు గాయం
ఖాళీ మైదానాల మీద ప్రవహించిన జీవితాన్ని
తేలిగ్గా చాపచుట్టలా చుట్టేస్తూ ప్రాణం ఇస్తావా
అని అడిగితే
ఊపిరి పీల్చుకున్నదెప్పుడు ?
దేహచలనాలలో ప్రేమ
బిరడా బిగించిన సిసాలో పొగ
నవ్వినా ఏడ్చినా పలకని అద్దం
ఎప్పటికి ఒకే ప్రశ్న వేస్తూ
నిద్రావస్థ ప్రపంచంలో నడిచే నడకకి
దేహ పరిమళమే గుర్తుఉంది
అంటావు చూడు .....
అరచేయి దోసిళ్ళనుంచి తప్పించుకుని
ఒంటరి చీకటిలోనుంచి కాంతికోసం
నడుస్తునపుడే వెన్నెల వెర్రిగా నవ్వింది
జ్జాపకం చీలికలై వెన్నెల దూరని నీడలోకి జరిగింది
తప్పిపోయి సూర్యకాంతిని,వానని
మరచిపోయి
తోలుబొమ్మలా గూటిలో నిద్రపోతున్న
నిన్ను చూస్తూనే ఉన్నాను......