Wednesday, 23 January 2013

అక్షరాలకు ఆయువు పోసిన లోపలి స్వరం

సారస్వతం 
పుస్తక పరిచయం - 1

- సమీక్షకులు ; శైలజామిత్ర

కవిత్వానికి గుండె ఒక నివాసం . తలుపు తీసినప్పుడల్లా ఒక్కో తలపు మనల్ని పలకరిస్తూ బయటకు వెళ్ళిపోయి కవి అయితే అక్షరంగా,, కాకుంటే ఒక జ్ఞాపకంగా రూపు దాల్చుతుంది.. , కలలు కూడా మనలోని భావాలే అని తెలుసుకునేది ఒక్క కవి మాత్రమే అనే మాటకు కవిత్వమే సాక్ష్యం. కవిత్వం లో ఎప్పుడు అభూత కల్పనలు ఉండవు కేవలం అనుభూతులు తప్ప. తపస్సు చేసుకునే రుషి భావుకుడు కాలేడు. ఆ తపస్సును గమనించే వ్యక్తి మాత్రం తప్పకుండా కవిగా మిగిలిపోతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కవిత్వం పూజ కాదు. నైవేద్యం. కవిత్వంలో ఎన్ని అలలు ఉన్నా జడి మాత్రం ఉండదు. అంతా నిశ్శబ్దం ...

రేణుక అయోల కవిత్వానికి ఒక ముద్ర ఉంది. మానవీయ స్పర్శ ఉంది. వీటన్నిటితో పాటు ఏదో కోల్పోయాననే ఆవేదన ఉంది. గుండెలో తడి ఉంది. ఉదాహరణకు కాలం ఎపుడు కధ చెబుతుంది అనే వస్తువును తీసుకొని నా పేరు కాలం అనే కవిత రాసారు. "నువ్వు నన్ను తెలుసుకోవాలంటే /యుగాలతో సంభాషణ జరపాలి/మృదువైన పిల్ల గాలిని అడగాలి" అంటారు. ఎంత బరువైన భావం ? మొదటిది యుగాన్ని మరొకటి పిల్లగాలిని రెంటినీ సమాన స్వరంలో మనకు చూపారు. ఇక్కడ యుగం అనేది గతం. పిల్లగాలి అనేది వాస్తవం, ప్రస్తుతం. అంటే మనిషిని గురించి, కాలాన్ని గురించి విపులంగా తేలపాలంటే రెండు వాస్తవాలను అడిగి తెలుసుకోవాలి అంటారు.

కాలాన్ని అంచనా వేయడం అంత సులభం కాదంటారు.

అడవిని అంచనా వేయడం చాలా ప్రయాసతో కూడిన పని అంటాను. ఎందుకంటే అడవి విశాలం, ఏ మూలా ఏముందో తెలుసుకోవడం, ఎలా వెళితే బయటకు వస్తామో తెలుసుకోవడం అనేది చాల కష్టం. ఒక్కసారి అన్నీ కని పెట్టగలిగామంటే ఇక అదే స్వర్గం అవుతుంది. అలాంటిది అడవిలో ఒక రాత్రిని గురించి తెలిపే అరుదైన ప్రయత్నం చేసారు. ఈ వాక్యాలు గమనించండి ఆ రాత్రి/ అడవిని చుట్టుకున్న వెన్నెల దీపం/చీకటిని మింగిన చందమామ/అడవిలో నడుస్తున్న నన్ను పెనవేసుకున్నాయి// రహస్యాలను చేదించాలని ఉద్వేగం/ కొమ్మ కొమ్మను పలకరించాలనే తపన/చల్లటి స్పర్శతో ఆత్రుతగా నడిచే నడకలు/పచ్చటి చీకటి నీడల్ని చీల్చే / వెన్నెల పాయలు/ గడ్డి పొదలు/గుండెను గుబులు పట్టించే కూతలు.. అంటారు . ఎంత అద్భుతం? ఈ వాక్యాలు చదువుతుంటే మనం అక్కడే ఉన్నామేమో అనే భావన కలిగించక మానదు.

కవిత్వం అనేది ఒక చిత్రమా? లేక శిల్పమా ? అనే సంశయం వస్తే ఖచ్చితంగా చిత్రమే అంటారు రేణుక అయోల గారు. అందుకే వీరి ప్రతి కవితలో ఒక అద్బుతమయిన భావ చిత్రం కనిపిస్తుంది.. అలాగే వీరి కవిత్వం చదవరులను కట్టి పడేస్తుంది.. హృదయం అనేది ఒక సముద్రం. అందులో ఎన్నో అలజడులు, ప్రశ్నలు, సందేహాలతో పాటు సమాధానాలు కూడా ఉంటాయి. కాని మనం ఒక్క సమాధానాన్ని మాత్రం వదిలి పెట్టి మిగిలిన వాటిపైనే దృష్టిని కేంద్రీకరిస్తాము. కాని ఈ కవయిత్రి సమాధానం వైపు కూడా దృష్టిని పెట్టారు.. చూడండి చిన్న విత్తు / తనకు తానే భుమిలోకి ఒదిగి /కాలానికి నమస్కరిస్తూ లేత చిగుళ్ళతో/గున గున ఎదిగి పలకరిస్తుంది". అంటూ చివరిలో అంటారు "చెట్టు మొదలును తడుముతుంటే / గిలిగింతలు పెడుతూ/ చిన్నారి మొలక/ గుండె గుడిలో వెచ్చదనపు పండగ అంటారు. రోడ్డు వెడల్పులో కనుమరుగవుతున్న చెట్లను చూస్తూ చలించి రాసిన ఈ భావాలలో నువ్వెంతగా నరికినా నువ్వు నువ్వు పాతిన చోటే మళ్లీ మొక్కై నిలవక మానదు. చెట్టు స్వభావం మొలకెత్తడం అనే విషయాన్ని ఎంతో అందంగా తెలియజేసారు.

ఇక్కడో విషయం మనం గమనించాలి. వీరి కవిత్వం లో సునిశితత్వం దాగుంది. సున్నితంగా గుండెను స్పృశించే గుణం ఉంది. గొంతును తీయగా పలికితే పరుష వ్యాఖ్యలు కూడా పరమానందం కురిపిస్తాయి. భావనలో ఎలా ఉన్నా పరుషంగా తోటి మనుషులను ఓదార్చినా సరే పారిపోయేలా చేస్తాయి. అందుకే మాట మంత్రం అంటారు. రేణుక గారు తన మృదువైన స్వరంతో ప్రకృతిని ఎంత ఆదరించారో చూడండి చినుకుల తెరలో/ తడిసిన మనసు శరీరం/ లేడి పిల్లలా గంతులు వేసింది. తడుస్తున్న పులా కొమ్మల్లో నేను / పువ్వునై తడుస్తుంటాను// ఎండా వానా కలబోసినా సాయంత్రం/ మబ్బుల్లో తల దాచుకున్న సూర్యబింబం/చినుకు తడిలో భూమిని అల్లుకున్న సుగంధ శ్వాస /ఆవిరి అవుతున్న వేడి ఇలా సాగుతుంది వీరి ధోరణి. కవి ప్రకృతికి దాసుడు అనే వాఖ్యానికి రేణుక గారి కవిత్వం ఒక గొప్ప ఉదాహరణ.

కలమనేది కాలంతో పాటు కదులుతుంది. జీవితంలో ఎన్నో సంఘటనలు మనల్ని హత్తుకుని నిరంతరం జ్ఞాపకానికి వస్తుంటాయి. అలంటి కవితలే నీటి బొమ్మ, మరణమే చరిత్ర, కొత్త ఉదయం పుట్టుక, ఊరి ప్రయాణం, పల్లకీలో పెళ్ళికూతురు కవితలు. ప్రతి కవితలో ఆర్ద్రత ఉంది. మానవత్వం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా పరిశీలన ఉంది. కవికి పరిశీలనా ఎంత అవసరమో అంతా రేణుక గారిలో ఉంది అనడం అతిశయోక్తి కాదు.

ఇవన్నీ ఒక ఎత్తైతే. ఈ గ్రంధం చివరిలో ఒక పది వాక్య కవితలు ఉన్నాయి. వాటిలో కొత్తదనాన్ని మనం గమనిద్దాం. ఏ కవితైనా, చిన్నదైన, పెద్దదైనా, వాక్యమైనా, వాటిలో వస్తువుతో ఒడంబడిక ఉండాలి. అంటే వాక్యానికి, వాక్యానికి మధ్య సంవిధానం తప్పనిసరి. ముఖ్యంగా వాక్య కవితలకు చాల అవసరం. ఆ విషయం ఈ కవయిత్రికి తెలుసు. తెలుసు కనుకనే ఈ ప్రయోగానికి ప్రాణం పోశారు. ఉదాహరణగా ఈ వాక్యాలు గమనించండి. ఊడ్చి వెళ్ళిన రోడ్డు మీద పరుచుకున్న బొమ్మ కుంచెలు రంగులు లేని చిత్రం నేలనంతా కళాత్మకంగా మార్చేసింది. ఈ వాక్యం లో ఎంత భావన దాగుందో అందరికి తెలుసు. కళను ఎవరు ప్రదర్శించినా అది కళే అనే మాట ఇందులో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆ కవిత అనుసరణ చూడండి. మధ్యాహ్నం ఎండలో మిల మిలా మెరుస్తూ పాదాల కింద పడిపోకుండా ఆ బొమ్మ తనని తాను రక్షించుకుంటూ దేవుడి రూపంలో చిత్రకారుడి ఆకలి రంగు తెలియనీకుండా తెల్లగా మెరుస్తూ, నిశ్సబ్దంగా చిల్లర నాణాలు మోస్తూ, వాడి గుండె తడిలో ఒదిగి తనలో తాను నవ్వుకుంటూ, నేలను నమ్ముకున్న చిత్రం లోపల ఎన్ని మెలికలు తిరిగినా, ఆకలి చూపులు రాకుండా అచ్చం గుళ్ళో దేవుడిలా గంభీరంగా ఉండిపోతుంది. ఈ ప్రక్రియ ఎంతో విలక్షణంగా ఉంది.. చదువుతున్నంత సేపు టాగూర్ గీతాంజలి, తిలక్ అమృతం కురిసిన రాత్రి గ్రంధాలు గుర్తుకు వచ్చాయి.

రేణుక అయోల ఒక నిర్దిష్టమయిన భావాలు ఉన్న కవయిత్రి. పదాల పొందిక, భావాల అల్లిక లో తనకు తానే సాటి అనిపించు కున్నారు. కవిత్వం ఎలా ఉండాలో అనే ఆలోచన కలిగితే ఒక్కసారి వీరి కవితలను తరచి చూస్తే చాలునేమో అనిపించక మానదు. వీరి భావాలు మరింత సుగమమై, మరింత సోయగమై మరో గ్రంధం రావాలని అభిలషిస్తూ అభినందనలు.

ప్రతులకు :

పాలపిట్ట బుక్స్
16-1-20//1/1,
403,విజయశ్రీ రెసిడెన్సి ,
సలీం నగర్, మలక్ పెట్, హైదరాబాద్.-36

ఫోన్ : 040-2778430
వెల: 60 రూపా

Thursday, 10 January 2013

KAVILOKAM BY : RENUKA AYOLA (a famous poet in Telugu) ENGLISH TRANSLATION: JAGATHI




POET’S WORLD

Poets always seem to be
Roving in another world
Flipping the pages of history, chewing the time
They roam around and amidst the people
Weaving threads around the world
They are caught like flies in the cobwebs
Pining with the poetic thirst
They douse themselves in mounds of books
The smilingly recede with poetry
They wander in silence

The non-stop poetry inside them flowing ever
Poets fly birds of childhood
They find kids laugh in the birds
They look upon flowers like children
Picking up the dried flower seeds
They again bloom poesy
They plant poetry in their dry lands of life
They hide within with poetic moisture
They rejoice
Looking at tiny sprouts, and prim roses

The poets of any times in their walk
They induce confidence in life
Flipping the histories
Of their planted seeds

Published November 15, 2012 Write a comment
user image
SnehaSK
Well done! Nicely rendered.
user image
PrEmJi PrEmJi
that's a mad world!
user image
nimal dunuhinga
They wander in silence ...................................! thanks for this great work.
user image
jagathi
thank u soooooo much for your lovely and immediate response sandra dear ..love j
user image
Sandra Martyres
Thank you for translating this gem on the subject of Poets into English.

Tuesday, 8 January 2013

by-- కాశీరాజు





















లోపలి స్వరం *

రేణుకా అయోలా లోపలి స్వరం కవితా సంకలనం చదివిన తర్వాత నా అనుభూతిని వీలైతే ఆ రచయిత్రితో లేదా నాలాంటి పాటకులతో పంచుకోవాలనిపించింది.లోపలి స్వరం ఆమె రాసిన రెండవ కవితా సంకలనం.ఇందులో ఉన్న కవితల్లో చాలామటుకు తన రోజువారీ జీవితంలోని సంఘటణలే, వాటిని అక్షరంతో అభిషేకం చేసి మనముందు ప్రతిస్టించింది.ఒకరి మనసులోని ఆంతర్యాన్ని లేదా వారి మాటలను అతి సులువుగా కవిత్వం చేయగలదీమే .
”ఆగిపోని కవిత్వం ఏరులై ప్రవహిస్తుంటే
కవులు పసితనపు పక్షులు ఎగరేస్తారు .
చిట్టి మొలకలవైపు గడ్డి పూలవైపు చూస్తూ సంబరపడిపోతారు.
ఈ కవులు ఏ కాలంలో నడుస్తున్నా,
వారు పాతిన గింజలవంటి చరిత్రను తిరగేస్తూ జీవితం మీద నమ్మకాన్ని కలిగిస్తారు .
ఈ కవులింతే” అని తన తాతగారి మాటల్లోని భావనల్ని ఆయన గొంతై,రాతై మనకు కవితను వినిపిస్తుంది .ఒకరిమీద ప్రేమనో, స్నేహాన్నో , ఒక ప్రదేశం మీద వీడిపోని ఇష్టమో ఆమె కవితల్లో కనిపిస్తాయి.
“జ్ఞాపకాలతో నలుగుతున్న ఆ ముఖం కనపడగానే
ప్రపంచం తెలిసిపోయినంత ఆనందం
దూరం అవుతున్న కొద్దీ
వేదనో, ఆవేదనో తెలియని తనం
ముఖం ముఖంలాగా కాక జ్ఞాపకంలా మనలో మిగులుతుంది “ అని
ఒక చిన్నప్పటి జ్యాపకాన్ని కవిత్వంతో గట్టిగా కట్టి, కానుక మీకు అన్నట్టు మనముందు ఉంచింది . తన మనసులోని భావాలే కాక వేరే మనుసుల్లోకి చొరబడి వారి భావాలను అంతే చక్కగా రాస్తారు . ఇంట్లో పాత గడియారం కింద వేలాడుతున్న తాత ఫోటో చూసి ఇలా రాస్తారు.
“ఎప్పుడు ఈ ఇంట్లో కాలుపెట్టినా
ఎడ్లబండి చప్పుడు వినిపిస్తుంది “
నాగలి చేత్తోపట్టి ఎడ్లబండి తోలుతూ , దాన్యాన్ని కొట్లో నింపిన చేతులు ,పట్టె మంచం,తెల్లని బొంత కాళ్ళ దగ్గర రాగి చెంబుతో వాళ్ళ తాతయ్య వెంటాడే జ్ఞాపకం అని చెబుతుంటే మనకళ్ళముందు ఒక పిచ్చరైజేషన్ ఏర్పడి కాసేపు ఆ తాతగారిని సజీవంగా చూడగలుగుతాము .
మనమనుకుంటాం కానీ ఒంటరితనం ఎవరికీ ఉండదు.అది బహుశా సాధ్యం కాదు. ఖాళీ ఖాళీగా కనిపించి నిండి ఉండే గాలిలా ఒంటరితన కూడా ఖాళీగా ఉండదు. సుడులెత్తే ఆలోచనలతో జ్ఞాపకాలతో ఎల్లప్పుడూ సందడి సందడి గా ఉంటుందని చెబుతారు ఒంటరి తనం అనే కవితలో! . ఇద్దరిమద్యా మూఖాభినయాన్ని ఎంతబాగా వివరిస్తారంటే
“ వేళ్ళ చివర అక్షరాలను పొదిగి
అరచేత సంజ్ఞలతో ముడిపెట్టి
కబుర్లని అనువదిస్తూ స్పర్శలతో బందాలనూ ముడిపెట్టుకోవాలని
ఆ ఇద్దరూ మౌనానికి భాషను నేర్పుతారు “
భాషలేని భావాలూ, విడమరచలేని సందిగ్ద రూపాల్లా వాళ్ళు
చేతివేళ్ళ కోనల్లో మాటల్ని సృస్టిస్తారు “
మౌనాన్ని భాషగా చేసుకుని మూకాభినయం ప్రదర్శించుకునే ఒక జంట గురించి ఇంత అందంగా ఎవరు రాస్తారు ?
"అమ్మా,నాన్న గురించి సమాజం అడిగినపుడు వాడికో పుట్టుక కధ ఉందని గుర్తుకొస్తుంది పసివయసులో గుండెలనిండా గాదలే కళ్ళనిండా అనాధ దృశ్యాలే ! పసితనమొకటి అప్పుడప్పుడూ పలకరించి పోతుంటుంది .రహదారిలో ఒకరికొకరు తోడుగా నడుచుకుంటూ బీదరికాన్ని తలాకాస్తా పంచుకుంటారు” ఇలాంటి వాక్యాలతో అనాద తనం గురించి రాస్తూ అనాద మనుసులనీ, మనసులనీ ఆలోసింపజేస్తుందామె.
“ఉన్న ఊరు, కన్నతల్లి మీద ప్రేమనీ ఎంతబాగా కవిత్వీకరించి మనకు అందించిందంటే ఊరిప్రయాణం అనే కవితలో
“ రోహిణీ కార్తె మద్యానపు ఎండ నిలువునా కాస్తుంటే
దిగుడు బావిలో ఈతలూ
ఆ స్నానం ఎంతో గొప్పది
బావిచుట్టూ చిన్న చిన్న అడుగుల కుదుళ్లలో నీరు
ఆ నీటి తడిలో పిచ్చుకల స్నానాలు “
ఊరిప్రయాణం ఎప్పుడు అనుకున్నా మనిషికన్నా ముందు జ్ఞాపకాలు పరుగులు తీస్తాయి . అని ఈ పుస్తకాని మనచేతుల్లో ఉంచుకునీ మనం కూడా మన వూళ్ళకు వెళ్ళి దిగుడుబావుల్లో మునకలేసి వచ్చేంతగా చక్కగా రాసింది.
తనవూరిలోని నదిని గుర్తుచేసుకుంటూ
“పల్లెమీద అలిగీ
దూరంగా జరిగీ
తనకు తానుగా నిచ్చలంగా పాయాలా పారుతుంటే
వర్షపు గొడుగులేక మండుటెండలో నిలుచున్నట్లుంది “
ఇసుక గొంతులో నీటి చెలమల తడి
పల్లెదాహం తీరిస్తూ! అని అమ్మలాంటి నది గురించి “అమ్మనది” కవిత

“అమ్మ వెళ్ళి పోయింది
అందర్నీ వదిలి వెళ్లిపోయింది
నన్ను ఎత్తుకుని లాలించిన చేతుల నుండి గాజులూ
పడుకోబెట్టి నలుగుపెట్టి స్నానం చేయించిన కాళ్ళ నుండి
కడియాలు వాటాలు పంచుకున్నాక
అమ్మ వెళ్లిపోయింది”
ఒక జ్ఞాపకం సూదిమొనలా గుచ్చుకుంటుంది
“ కూరలో ఉప్పు ఎక్కువైతే
ముఖం మీద పల్లాలు విసిరేసినా
ఉప్పు సరిచూసుకున్నాను కాను – అనుకునే అమ్మకి
అభిమానాలు,ఆప్యాయతలు పంచివ్వడమే తెలుసు “ అమ్మ జ్ఞాపకం గా మిగిలిన ఓ సందుపెట్టెని చూసినప్పుడల్లా ఆమె తన తల్లిని పల్లకిలో పెళ్లికూతిరిలా చూసుకుంటుంది . ఆ సన్నివేశాలు ఎంతో చక్కగా కనిపిస్తాయి తన ఊరి చిత్రాన్ని చూసో, లేదా వేరే ఏదైనా ప్రదేశాన్ని చూసో ఎంత చక్కగా ఆయాప్రాంతాలను అక్షరాలుగా చేస్తుందో ప్రేమకట్టడం,చిత్రం అయిన ఊరు లాంటి కవితల్లో మనం చూడవచ్చు
“శరీరం శిధిలమై చరిత్రలో బాగమైపోతుంటుంది
ప్రేమ సజీవమై పాలరాతి గుండెలో ఒదిగిపోతుంది
అడుగడుగునా ప్రేమ శిల్పచాతుర్యాలతోనిండి
తన ఒడిలో చేరమంటూ పిలుస్తుంది “
ఒక చారిత్రక కట్టడం తాజ్ మహల్ మీద రాసిన ఈ కవిత అద్భుతం .

“బర్త్ డే గ్రీటింగ్స్ కోసం ఎదురుచూపు
ఖాళీగా పడివున్న ఉదయాన్ని దాటుకునీ
అద్దరాత్రి గ్రీటింగ్స్ , గుప్పుమన్న విస్కీ వాసన
పొగడ్తలు, శరీరం నిండా గాయాలు
సుడితిరిగే దుఖ్ఖపు అంచుల్లో పుట్టినరోజు
మసక చంద్రుడిలా వెలవెలబోయింది
కానీ
మళ్ళీ వచ్చింది
హ్యాపీ బర్త్ డే మాతృత్వపు పరిమళం తియ్యగా రాగాలు తీసింది “
అని పుట్టిన రోజు కవితా ద్వారా ఒక నిశిత పరిశీలనని , జీవితంలో ఎదుర్కున్న సంఘటనల్ని కవితగా ఎలా మార్చిందో ఇక్కడ చూడొచ్చు
కొత్త ఉదయం పుట్టుక ,ఎవరో నేర్పిన పాఠం,జన్మరహస్యం ,పాత ఇల్లు ఇలా అన్నీ తమ ప్రాముఖ్యతను ఈ పుస్తకంలో చెబుతూ కనిపిస్తాయి .
“నిద్రపోతున్న దేన్నైనా లేపొచ్చు
నిద్రపోతున్న సాహిత్యాన్ని ఇప్పుడిక పెడబొబ్బలతో లేపాలి
మనకోసం సాహిత్యం నాగలిని
భుజానికెత్తుకోవాలి
దుక్కి దున్నిన భూమ్మీద
ఆప్యాయతల గింజలు జల్లుకోవాలి
మొలకెత్తిన మొలక
మేలుకోవాల్సిన సమాజానికి ప్రతీక “ అంటూ “రాయాల్సిన వాక్యం” రాసేసి, ఈ పుస్తకానికి కవీ,లేదా కవయిత్రీ ఎప్పుడూ రాస్తూనే ఉండాలి అని వాడ్రేవు చినవీరభద్రుడు ముందుమాటగా రాసిన వాక్యాలు నిజం చేస్తుంది .ఈ పుస్తకం చదివి అభిప్రాయం రాయడంలో నేను ఎంత సఫలమయ్యానో తెలియదుగానీ నేను ఇక్కడ రాసింది ఆ కవితల్లోని ఖచ్చితమైన ఆతృత కాకపోతే నేను మిగతా పాటకులని తప్పుదోవ పట్టించినట్టే అవుతుంది . అయినా యధావిదిగా పుస్తకం చదివిన తర్వాత అది నాకు పంచిన అనుభూతిని ఇలా రాస్తున్నాను .వాస్తవికతను అక్షరబద్దం చేయడానికి మీ చేతుల్లో ఉండాల్సిన పుస్తకం ఇది .

లోపలి స్వరం
కవయిత్రి: రేణుకా అయోలా
ఈమైల్:isola.renu@yahoo.com
కవర్ డిజైన్ :మహేశ్ మలైకర్
వేల:60 రూ /
పేజీలు:119
ప్రతులకు :పాలపిట్ట బుక్స్ , kinige.com