ఏమాత్రపు చిన్న అలికిడైనా చేయకుండానే
బతుకుని కేలండర్ అంకెలుగా మార్చుకొని
తెల్లవారడం ,చీకటి పడడం-
వీటి మధ్యే ఇరుక్కుపోయి,అందులోనేఅటూ ఇటూ దొర్లుతూ
సూర్యాస్తమాల చిరునవ్వులైనా స్వీకరించకుండానే
సాగిపోతున్నప్పుడు,ఒక నిశ్శబ్ద సౌదర్యం
ఋతువుల ఆగమనాన్ని చూపించింది
శితగాలికి దుప్పటి కప్పుకోన్నట్లేవుంది-
వసంతం అడుగులు కనిపించకుండానే
చిరుచెమటలు మెడకిందకి జారాయి
అప్పుడే ఋతు సంగీతం ఒక పక్షిలా నదిలా
నగరంలోకి ప్రవేసించింది
దూరంగా సైకిలు వాడి గంపలో ఆకుదూయని
మల్లేలు గుబాళించాయి
వేపపూత తెల్లగా చెట్టునుంచి వంగీ వునికిని చాటుకుంది
పొగొట్టుకున్న వస్తువు దొరికినట్లుగా
మురిపించిన గతం
రెక్కలు తొడుక్కుని ఆ ఊరికి చేరుకుంది
మండువా లోగిళ్ళూ
నట్టింట్లో ఊయ్యాల బల్ల
వెండిపళ్ళేంలొ మల్లెమొగ్గలు దారంవుండ
మెడదాక దిగని జుత్తుకి మల్లేపూల జడ.
తోటలో కోకిల కూతలకి స్వరంకలిపి
విసిగించి నవ్వుకోన్న రోజులు
విరగ కాసిన వెన్నెల గుబాళించే మల్లేలు
రాత్రి తెల్లగా మెరుస్తూంటే
స్వేచ్ఛా మలయవాయువులు
ఎన్ని మొసుకు రాగలము?
ప్రతీ ఏడాది వసంతం వస్తూనే ఉంది
అప్పుడప్పుడు గతంలా గుర్తుకి తెచ్చుకోవడానికే
అనుకుంటే-
నిరామయమైన జీవితంతో అవిటి వాళ్ళతోనిండిన
నగరంలో మనం ఒకరం....