(కలలు కనని మనిషి వుండడు.కఠినమైన నిజంకన్నా అబద్దంలాంటి కల హాయికదా! కలలునే కళ్ళ వెనక అంతులేని ప్రపంచం దాగివుంది .ఏదిఏమైనా ప్రతీ మనిషి కలకనడం చాలా సహజం..అలాంటి కలవెంట ఒక ప్రయాణం-)
నిద్రని ముక్కలు చేస్తున్న స్వప్నం
మెదడుని కాపలా కాస్తున్నకుక్క
బొట్టుబిళ్ళని రెండుగా విరిచి
నవ్వుతున్న ముఖంలాంటి పొగ
నల్లని మేఘం నీటిలో
పాయలు పాయలుగా విడిపోయి
వాటి అంచుల్లో చిక్కుకున్న మంచు ముత్యాలు
జడని చుట్టుకొన్న మందార పూలు
నల్లకనుల నాగస్వరం ఊది చూడు అంటున్నారు ఎవరో--
నీటీ అంచుల్లో తేలుతు ఒడ్డుని తాకుతూ
రాగాలు పలుకుతున్న నల్లకనుల మురళి
చుట్టూ చీకటి ఇసుకలొ కూరుకుపోతున్న పాట!
రాగాలను వినిపిస్తూ చుట్టు తిరుగుతోంది
గానం గొంతులో వెచ్చటినెత్తురు బొట్లుబొట్లుగా--
ఏదో బలమైన హస్తం
చేతికి ఆసరా ఇస్తూ స్వరం వెంట లాక్కెళుతోంది
కాలి వెండి పట్టాలు బంధాలు తెంచుకొని
పాదంలోంచి జారిపోయాయి-
మువ్వల అంచుని తాకిన చేయిలొ చిరు గజ్జల సవ్వడీ
వేళ్ళు తాకిన స్పర్సలలో వేదన
పాట మళ్ళీ వచ్చి లోపల వాలింది
కొండని చుట్టుకొని లోయలోకి ఒదుగుతున్న
పాట వెంట -అప్పటికప్పుడు పూచిన పూలు
సీతాకోక చిలుకలై ఎగురుతూ దేహాన్ని చుట్టుకొని
లోలోపలికి ప్రవేసిస్తూ కలలని కదుపుతూ
మెలకువలోకి ప్రవేసించాయి.
నిద్ర రెప్పలని విప్పి వెలుతురిని చూపించినా
కొత్త లోకం విడిచి రాలేని శరీరం
కలల పుప్పోడీ అద్దుకొని బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటోంది.
***