నదితో పాటు నడవాలన్న కోరిక.
మనసు తెలిసిన అలలు నవ్వాయి
ఒంటరితనానికి ముగింపులా
ఎంత ప్రకృతి!
నదీ జలాలని ఆవరించుకుని
నింగి దాకా ఆకుపచ్చని కాంతితో
మనసులోకి నిర్లిప్తత అలముకోకుండా
ప్రశాంతత గాడంగా పెనవేసుకుంది
ఒంటరిగా ఉన్నపుడే ఎదుటలేని ప్రకృతంతా
మనసులోకి జొరబడి తోడు నిలుస్తుంది
ఒంటరితనం భావన నెపం మాత్రమే
ఖాళీ ఖాళీగా కనిపించే పాత్రలో నిండి వుండే గాలిలా
ఒంటరితనం కూడా ఖాళీగా వుండదు.
సుడులేత్తే ఆలోచనలతో,జ్ఞాపకాలతో
ఎప్పుడూ సందడి సందడిగా వుంటుంది
దూరమైన గతానికి దగ్గరగా
వర్తమానంలోంచి పైకిలేపి
ఒంటరితనంలోకి ఒంపుకుంటుంది
గాలిపటంలా ఎగురుతున్న
అనేక ఆలోచనలు పక్కనపెడుతూ
ఒంటరితనం ఒంటరిగా మిగిలిపోయింది
అప్పుడే చుట్టుకుంది వెన్నెల
సంగీత వాహినిలాస్పర్సిస్తూ
గుండె శృతికలిపి పాడగానే
ఒంటరితనం దూదిపింజలా ఎగిరిపోయింది
నదినాతో అంటుంది-
నీఒంటరి నౌకని ఇక్కడే వదిలేసిపోమ్మని-
అదెలాసాధ్యం?
ఆనౌక ఉంటేనే కదా నానడక నీదాకా...